(దండుగుల శ్రీనివాస్)
మేము 30 మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేసి తప్పు చేశాం. అదే 30 యూట్యూబ్ చానెళ్లు పెట్టి ఉంటే మేమే అధికారంలో ఉండేవాళ్లం. తప్పు చేశాం. ఆ సోషల్ మీడియా వల్లే ఇవాళ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. ఈ మాటలన్నది కేటీఆర్. అధికారం కోల్పోగానే ఇలా ఉన్నదున్నట్టు.. కడుపులో ఉన్నది కక్కేశాడు. ఇప్పుడు అదే పాటిస్తున్నాడు. అచ్చంగా నెలకు మూడు కోట్లు సోషల్ మీడియా హ్యాండిల్స్‌ను హ్యాండిల్‌చేసే పనిని పెట్టుకున్నాడు. కేటీఆర్ ముచ్చట అటుంచండి. కేసీఆర్ ఏడాదిగా ఫామ్ హౌజ్‌లో ఏం చేస్తున్నాడో తెలుసా…!
సోషల్ మీడియాను ఫాలో కావడమే. అంటే కోట్లు పెట్టి నడిపిస్తున్న మెయిన్ స్ట్రీమ్ మీడియా కన్నా .. ఇప్పుడు సోషల్ మీడియానే ఎక్కువైంది ఇద్దరికీ. ఆ ఇద్దరూ ఎవరుకుంటున్నారా..? ఇంకెవరు. మాజీ సీఎం కేసీఆర్. సీఎం రేవంత్ రెడ్డి. తాజాగా వీరిద్దరి సంభాషణలు, దూషణలు చూస్తే సోషల్ మీడియాను వీరిద్దరు ఎంత ఫాలో అవుతున్నారో మనకే ఇట్టే అర్థమవుతుంది. కాంగ్రెస్ ఓ సర్వే నిర్వహించింది. ఫామ్ హౌజ్ పాలన కావాలా..? ప్రజా పాలన కావాలా..?? అని. దీనిపై ఫామ్ హౌజ్ పాలనే కావాలన్నారు ఎక్కువ జనం.
దీనికే అల్ప సంతోషిలా చంకలు గుద్దుకున్నాడు కేసీఆర్. ఏకంగా బహిరంగంగానే ఈ మాటన్నాడు. తనకే ప్రజలు వత్తాసు పలుకుతున్నారు. సిగ్గుండాలె. ఏడాదిలో కాంగ్రెస్ ఏమీ చేయలేకపోయింది. అందుకే రేవంత్ పై కోపంతో కేసీఆరే నయం అన్నాడుకుందాం. కానీ నువ్వు దానికే అంత సంబర పడాలా..? ఫామ్ హౌజ్ పాలన అంటే జనాలకు అందుబాటులో ఉండవనే కదా. మళ్లీ ఫామ్ హౌజ్ అనే పదానికి నిర్వచనం ఇవ్వబోయాడు కేసీఆర్. ఫామ్ హౌజ్ అంటే ఏదో వ్యవసాయం చేసుకుంటాడట. చేసుకో. కానీ నువ్వు వ్యవసాయదారుడివి కాదు. మాజీ సీఎం. జనాల గోస పట్టించుకోకుండా దుర్బేధ్యమైన కోటగోడల గడీల సామ్రాజ్యమొకటి నిర్మించుకుని దానికి ఎర్రవెళ్లి ఫామ్ హౌజ్ అని పేరు పెట్టుకుని, దాన్ని సమర్థించుకుని….. ఇలా తననే ప్రజలు కోరుకుంటున్నారని చెప్పుకోవడం దిగజారుడుతనమే.
సిట్టింగు ఎమ్మెల్యేలకు వరుసగా టికెట్లు ఇస్తూ.. నేనేది చెబితే అదే ప్రజలు విశ్వసిస్తారని వారిని పిచ్చి గొర్రెల్లా భావించి నియంత పాలన చేసిన నువ్వు ఇలా దిగజారి మాట్లాడటం బాగలేదు కేసీఆర్. సరే మన టాపిక్ అది కాదిప్పుడు. సోషల్ మీడియా అంటే సీఎంకు, మాజీ సీఎంకు ఎంతటి భయం ఉందో తేలిపోయింది. మెయిన్ స్ట్రీమ్ మీడియా కేవలం అలా జర్నలిజం పాఠాలు వల్లెవేస్తూ ఎవరి ఎజెండా వారు అమలు చేస్తారన్నమాట. అప్పుడు కేసీఆర్ పాట. ఇప్పుడు రేవంత్ పాట. అందుకే కోట్లు పెట్టి నడిపిస్తున్న మెయిన్ స్ట్రీమ్ మీడియా కన్నా.. సోషల్ మీడియా అంటే తడిచిపోతోంది అగ్రజులకు.