మ్యాడం మధుసూదన్
సీనియర్ పాత్రికేయులు
9949774458
ఫామ్ హౌజ్ పాలనా.. .ప్రజా పాలనా…!! అనవసరమైన ఈ అంశాన్ని చర్చకు పెట్టి కాంగ్రెస్ పార్టీ నాయకులు కొత్త సమస్యను తెచ్చి పెట్టుకున్నారు. తేనె తుట్టెలో రాయి కొట్టినట్టు ట్విట్టర్ పిట్టగూడును కదిపి .. మీ పాలన కంటే ఫామ్ హౌజ్ పాలననే బాగుండే అన్న తీరులో నెటిజన్లతో తిట్టించుకునే పరిస్థితి తెచ్చుకున్నారు. ఇది ఏ కాంగ్రెస్ నాయకుడు పెట్టాడనేది కాదిక్కడ. అధికార పార్టీలో గాడి తప్పుతున్న పరిస్థితికి .. సమన్వయ లోపానికి ఇది అద్దం పడుతున్నది. అధికారంలోకి వచ్చి ఏడాది గడుస్తున్నా.. పరిపాలనపై పూర్తి పట్టు సాధించకపోవడం, అధికారులను నియంత్రణలో పెట్టకపోవడం పాలన యంత్రాంగంలో ఉన్న వారు, పార్టీలో ఉన్న నాయకుల మధ్య సమిష్టి కృషి లేకపోవడం, పార్టీని అటు ప్రభుత్వాన్ని కొంత గందరగోళంలోకి నెట్టేస్తున్నది. కేబినెట్ విస్తరణ నుంచి మొదలుకొని భూ భారతి .. ఆరు గ్యారెంటీల పథకాల అమలు వరకు ఫైల్ పెండింగ్ అన్న పరిస్తితిలోనే ఇంకా పాలన కొనసాగుతున్నది.
కాంగ్రెస్ పార్టీలో ఇప్పటి వరకు స్కీంలు హిట్టుకాకపోయినా స్కాములు కూడా లేవనే చెప్పాలె. కానీ.. ఢిల్లీ అధిష్టానం నుంచి తెలంగాణ గల్లీ వరకు అధినాయకత్వం, అగ్ర నాయకత్వం, మధ్య నాయకత్వం, దిగువ నాయకత్వం .. మధ్య సమన్వయ లోపం ఒక శాపంగా మారింది. కొత్త పథకాలు అమలు చేయడము, ఆదిలోనే హంసపాదన్నట్టు పరిపాలన మూడడుగులు ముందుకు ఆరడుగులు వెనక్కు అన్నట్టు సాగుతున్నది ఈ పార్టీ వ్యవహారం. అధికార పార్టీలో సమన్వయ లోపం ఢిల్లీ కి తెలంగాణ కు దూరం పెంచినట్టు వార్తలు వస్తున్నాయి. అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తయినా చాలా విషయాలపై ప్రభుత్వం నాన్ సీరియస్‌గా ఉండటం పై అధిష్టానం సీరియస్ అయినట్టు తెలిసింది. తెలంగాణ పార్టీ వ్యవహారాల్లో కీలక పాత్ర పోషించి జాతీయ పార్టీ ప్రధాన కార్యదర్శిగా ఉన్న కేసీ వేణుగోపాల్ ఈ వ్యవహారాలన్నింటిపై తీవ్ర అసంతృప్తితో ఉన్నట్టు సమాచారం. దీనిపై ఆయన అగ్ర నాయకులతో తన అసంతృప్తిని ప్రత్యక్షంగానే వ్యక్తం చేసినట్టు ఉన్నత వర్గాలు చెబుతున్నాయి. పార్టీ అధినేత రాహుల్ గాంధీ కూడా కొన్ని విషయాలలో కినుక వహించి ఉన్నట్టు ఆయన సన్నహితులతో చెప్పినట్టు సమాచారం.
పార్లమెంటు ఎన్నికల తరువాత అధినాయకుడైన రాహుల్‌గాంధీ మన తెలంగాణ అగ్ర నాయకత్వానికి సమయం ఇవ్వకపోవడం.. ఏ విషయంపై కూడా ప్రత్యక్షంగా మాట్లాడకపోవడం చర్చనీయాంశంగా మారింది. అదానీ వ్యవహారంలో కూడా గతంలో ఆయన కినుక వహించినట్టు వార్తలొచ్చాయి. పాలనా యంత్రాంగంలో ఎవరికి వారే మూసీ తీరే అన్నట్లు వ్యవహరించడం ఒక నిర్ధిష్ట ప్రణాళికతో ముందుకు సాగకపోవడం పట్ల అధినాయకత్వం సుతిమెత్తగా మందలించినట్టు తెలుస్తోంది. మేడగడ్డ ప్రాజెక్టులో అవకతవకల విషయంలో పర్యటించిన పరిస్థితి వేరు.. ఈ రోజు అధికారంలోకి వచ్చిన తరువాత పరిస్థితి వేరు.. అన్న విషయం ప్రస్తావనకు వచ్చినట్టు సమాచారం. ప్రాజెక్టుల కాంట్రాక్టులు, ఇతర ఆర్థిక వ్యవహారాలల్లో విమర్శలకు ఆస్కారమివ్వకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, లేకుంటే పార్టీకి చాలా నష్టం వస్తుందని చర్చించినట్లు తెలుస్తున్నది. ఢిల్లీకి తెలంగాణకు మధ్య కొంత దూరం పెరుగుతుందని, అటువంటి పరిస్థితిని వెంటనే నివారించాలని సూచనలు అందినట్టు ప్రచారం జరుగుతున్నది. పరిపాలన విషయంలో చాలా అంశాలు పెండింగ్‌లో ఉండటం, సమిష్టిగా నిర్ణయాలు తీసుకోకపోవడం, ప్రతిపక్షాలను ఎదుర్కోవడంలో ఐక్యంగా ముందుకు కదలకపోవడం పట్ల అధిష్టానం అసంతృప్తిగా ఉంది.
ప్రజాదరణ కలిగిన నాయకుడిగా ఎదిగిన ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పరిపాలనపై మరింత పట్టు సాధించాలని సూచించినట్టు తెలుస్తున్నది. కొంతమంది మంత్రులు కూడా ముఖ్యమంత్రికి తోడుగా వేగం పెంచాలి. సమన్వయం సాధించాలి. అని అధిష్టాన వర్గం అభిప్రాయ పడుతున్నది. ఇటీవల ప్రతిపక్ష నాయకుల అరెస్టుల విషయంలో, కేసుల విషయంలో అధికారుల నుంచి సరైన సహకారం అందకపోవడం, పక్కా ప్రణాళిక ప్రకారం కూడా ముందుకు సాగకపోవడం పట్ల కేసీ వేణుగోపాల్ అసహనం వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది. దూకుడుగా, దుందుడుకుగా వ్యవహరించిన పాడి కౌశిక్ రెడ్డి అరెస్టు వ్యవహారంలో అధికారులు సరైన తీరులో వ్యవహరించలేదని, రెండు సార్లు అభాసుపాలు కావాల్సి వచ్చిందని, ఇటువంటి విషయాల్లో చాలా జాగ్రత్తగా అడుగులు వేయాలని అధిష్టానం భావిస్తున్నట్టు తెలుస్తోంది.
టీపీసీసీకి, ప్రభుత్వానికి మధ్య సమన్వయం సాధించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని సూచించింది. కొన్ని మంచి పథకాలు అమలు చేస్తున్నప్పటికీ ప్రజల్లో అవగాహన కల్పించడంలో.. అవసరమైన లబ్దిదారులకు సంక్షేమ పథకాలను చేరవేయడంలో ఎక్కడో తేడా వస్తున్నదని అధిష్టానం తన నివేదికలో పేర్కొన్నట్టు తెలిసింది. కొంత మంది అగ్రనాయకులు కూడా అధిష్టాన వర్గానికి తమ అసంతృప్తిని నమోదు చేసినట్టు తెలుస్తోంది. పథకాల అమలు, అధికారులను నియంత్రించడంలో ప్రత్యేక దృష్టిని సారించాలని సూచించింది. పరిపాలన ప్రజాకార్షణగా ఉండాలని, జనంలో గత పాలననే మేలన్న భావన రాకుండా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని అధిష్టానం సీరియస్‌గానే చెప్పినట్టు తెలుస్తున్నది. ధరణి స్థానంలో భూభారతి లాంటి మంచి ప్రయోగం చేసినప్పటికీ వాటి ఫలితాలు ప్రజలకు చేరకపోవడం, అధికార యంత్రాంగం సరిగా సహకరించకోవడం పై చర్చ జరిగినట్టు తెలిసింది.
ఏడాది పరిపాలన పూర్తయిన దశలో జనామోదం పొందేలా పరిపాలన మరింత మెరుగు పరుచుకోవడం ఎలా అనే దానిపై దృష్టి సారించాలని, అధిష్టానవర్గానికి లేని తలవంపులు, అనవసర చిక్కులు లేకుండా జాగ్రత్త పడాలని సూచించింది. ఫామ్‌హౌజ్ పాలన కాకుండా ప్రజాపాలనకు మద్దతు లభించేలా చూసుకోవాలని హితవు పలుకుతోంది అధిష్టానం.