(దండుగుల శ్రీనివాస్)
లేక లేక పథకాలు వచ్చాయనుకున్నారు జనాలు. ఏడాది గడిచినా ఇంకా రాలే ఇంకా రాలే అని ఎదురుచూసి చూసీ విసిగి వేసారిన జనానికి ఎట్టకేలకు గుడ్ న్యూస్ చెప్పింది సర్కార్. గణ తంత్ర దినోత్సవం సందర్భంగా నాలుగు పథకాలను లాంఛనంగా ప్రారంభించింది. ఇవన్నీ కీలకమైన పథకాలే. పేదలకు లబ్ది చేకూర్చేవే. అంతా ఆసక్తిగా ఎదురుచూసినవే. పేదలంతా క్యూ కట్టినవే. కానీ ఆదిలోనే హంసపాదు అన్నట్టుగా ఈ పథకాలకు కోడ్ బ్రేక్ వేసింది. ఎమ్మెల్సీ ఎన్నికల షెడ్యూల్ విడుదల నేపథ్యంలో వీటికి కోడ్ వెంటనే అమల్లోకి వచ్చింది. దీంతో మార్చి 8 వరకు కోడ్ అమల్లో ఉన్నందున ఆ తరువాతే పథకాలు మళ్లీ అమల్లోకి వస్తాయి.
హైదరాబాద్, రంగారెడ్డి జిల్లా , మేడ్చల్ జిల్లా, ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో మాత్రం ఈ కోడ్ వర్తించదు. ఈ జిల్లాల పరిధిలో ఎన్నికలు లేనందున ఇక్కడ యథావిధిగా పథకాలు అమల్లోకి వస్తాయి. సీఎం సొంత జిల్లా అయిన పాలమూరులో పథకాల సందడి కొనసాగుతుంది. ఈ పథకాల పండుగ పాలమూరుకు మాత్రం ఆగలేదు. సీఎం మొదటి నుంచి ఈ జిల్లాపై ప్రత్యేక దృష్టి పెట్టారు. అత్యంత వెనుకబడిన జిల్లాగా ఉన్న పాలమూరును అన్ని రంగాల్లో అభివృద్ధి చేయాలని ఆయన భావిస్తున్నారు. బహిరంగ సభా వేదికల్లోనే ఈ విషయం సీఎంగా కాకుండా ఆ నియోజకవర్గ ఎమ్మెల్యేగా, ఆ జిల్లా బిడ్డగా ఆయన బావోద్వేగపు స్పీచులు మనం చూశం.
ఈ కోడ్ ఈ జిల్లాకు వర్తించని నేపథ్యంలో అక్కడ మరింత దూకుడుగా పథకాలు అమల్లోకి రానున్నాయి. ఇవి కాకుండా మిగితా జిల్లాల ప్రజలకు మాత్రం ఈ తాత్కాలిక బ్రేక్ తప్పదు. ఇప్పటికే 500 కోట్ల పై చిలుకు రైతు భరోసా నిధులు ఆయా రైతుల ఖాతాల్లో పడ్డాయి. ఇక విడుతల వారీగా వేయాల్సి ఉంది. ఈ కోడ్ వల్ల ఇప్పుడు ఆ రైతులకు ఎదురుచూపులు తప్పవు. ఇక మిగిలిన పథకాల పరిస్థితీ అంతే.