(దండుగుల శ్రీనివాస్)
నిజామాబాద్ జిల్లాలో అదీ ఆర్మూర్ డివిజన్ పరిధిలో ఎక్కువ విస్తీర్ణంలో పసుపు సాగవుతుంది. పసుపును బంగారంతో పోల్చుతారు. మరి ఇప్పుడా పరిస్థితి ఉందా…? దీన్ని పండించిన రైతులు ఎందుకు దీన స్ఙతిలో ఉన్నారు. ఎందుకు నష్టాల్లో ఉన్నారు. జాతీయ పసుపుబోర్డును నిజామాబాద్‌లో ఏర్పాటు చేశామని సంబురాలు చేసుకుంటున్నారు. దీని వల్ల రైతులకు ఒనగూరే లాభమేమిటి…? ఈ ప్రశ్నలకు సమాధానాలు చూస్తే నివ్వెరపోతారు. పదేళ్ల కాలం నాటి నుంచి అంతకు ముందు నుంచి పసుపు బోర్డు ఉండాలనే కోరిక, డిమాండ్ బలంగా వినిపిస్తోంది. దీన్ని రాజకీయ అవసరాల కోసం బాగా వాడుకున్నాయి పార్టీలు. ఇప్పటికి సాధించామని చెబుతున్నాయి. కానీ ఈ పదేళ్లకాలంలో సాగు విస్తీర్ణం 40 శాతం మేర పడిపోయింది. ఎందుకు..? పెట్టిన పెట్టుబడికి సరైన రాబడి రాక. అవును.. పదేళ్ల కింద ఎకరాకు 30వేల ఖర్చు.. ఇప్పడు లక్ష దాటుతోంది. పెరిగిన ఖర్చులతో పెట్టుబడి తడిసి మోపెడవుతోంది. అప్పుడు క్వింటాల్‌కు 15వేల పెట్టుబడి వచ్చేది. ఇప్పుడూ అదే వస్తే బంగారమనుకుంటున్నారు.
కానీ ఆ వచ్చిన ధర ఎటూ సరిపోవడం లేదు రైతుకు. పెరిగిన పెట్టుబడి ఖర్చుతో పోల్చితే క్వింటాలుకు 15వేలు ఇచ్చినా రైతు మాత్రం నష్టాల్లో ఉన్నట్టే. సరే, మరి జాతీయ పసుపుబోర్డు వచ్చింది కదా.. ఇక బాధలన్నీ తీరినట్టేనా..? రైతుకు గిట్టుబాటు ధర వస్తుందా..? అంటే రాదు. అవును. ఈ బోర్డుకు ఆర్థికపరమైన నిర్ణయాలు తీసుకునే సీన్ లేదు. కనీసం మద్దతు ధర 15వేలు ఇస్తామని చెప్పే దమ్ములేదు. ఆ శక్తిలేదు. బై బ్యాక్ కొనుగోలు చేసే నిర్ణయం ఇది తీసుకోదు. రైతులకు కావాల్సిన యాంత్రీకరణకు అవసరమైన సబ్సిడీలు ఇచ్చే చాన్స్ లేదు. మరెందుకిది…? ఉత్సవ విగ్రహంలా… రాజకీయ అవసరాలకు అనుగుణంగా వాడుకునేందుకు తప్పఈ పసుపు బోర్డు వల్ల పసుపు రైతులకు కొత్తగా ఒనగూరే లాభమేమీ లేదు. కొత్త వంగడాల అభివృధ్ది , పసుపు పరిశోధన అని అంటున్నారు. ఇది గతంలోనే కమ్మర్‌పల్లిలో ఏర్పాటు చేశారు. ఇప్పుడది బోర్దు పరిధిలోకి వస్తుంది. అంతకు మించి ఈ బోర్డు ఏర్పాటు కావడం రాజకీయంగా నేతలకు అవసరమయ్యిందే తప్ప. రైతులకు నయాపైసా లాభం లేదు.
తెలంగాణలో ప్రస్తుతం సాగయ్యే పసుపులో ఆర్మూర్ డివిజన్ పరిధిలోనే యాభై శాతం సాగవుతుంది. మిగిలింది కమ్మర్‌పల్లి, జగిత్యాల,ధర్మపురి, ఇబ్రహీంపట్నం, నిర్మల్, సారంగపూర్, బోథ్, ఆదిలాబాద్, వరంగల్, వికారాబాద్‌లలో సాగవుతుంది. గత పదేళ్లలో కేంద్రం పట్టించుకోకపోవడంతో ఈ పసుపుకు మద్దతు ధర కరువై సగానికి సగం విస్తీర్ణం పడిపోయింది. తెలంగాణ తర్వాత పసుపు సాగయ్యే రాష్ట్రాలలో వరుసగా మహారాష్ట్ర, తమిళనాడు, కర్ణాటక ఉన్నాయి. అస్సాం, కేరళలో కూడా కొంత మేర పసుపు సాగవుతుంది.
ఎకరాలకు 20 క్వింటాళ్ల దిగుబడి… లక్ష పెట్టుబడి…
ఏడాదిలో ఒకే పంటగా పసుపు సాగవుతుంది. 9 నెలల పంట ఇది. ఎకరాలకు 20 క్వింటాళ్ల దిగుబడి వస్తుంది. పదేళ్ల కింద 30వేల పెట్టబడి ఎకరాకు. 20 క్వింటాళ్ల దిగుబడికి 15వేల వరకు క్వింటాకు ధర పలికేది. అంటే 3 లక్షల వరకు ఆదాయం వచ్చేది. ఈ మూడు లక్షలలో 30వేల పెట్టుబడి తీసేస్తే దాదాపుగా రెండున్నర లక్షల వరకు ఎకరా మీద ఆదాయం తీసుకునే వాడు పసుపు రైతు. ఇది ఆనాటి ముచ్చట. కానీ ఇప్పుడు లక్ష పెట్టుబడి. ఎకరాకు 20 క్వింటాళ్లు. 15వేలు ధర ఇప్పుడిప్పుడు వస్తుంది. ఒకప్పుడు 7వేలకు మించి రాలేని పరిస్థితులు ఉండే. ఇప్పటికీ దళారులకు ఎంతో కొంతకు అమ్ముకుని రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. ఇప్పటికీ అదే జరుగుతున్నది.
అయితే ఇప్పుడు పెరిగిన కూలీ ఖర్చులు, పెట్టుబడి ఖర్చులతో ఎకరా మీద లక్ష వరకు కూడా లాభం రావడం లేదు. చాలా మంది నష్టాల్లోనే ఉంటున్నారు. ఏడాదికొకసారే ఇది సాగవుతున్న నేపథ్యంలో దీని మీద పెద్దగా లాభాలు రావడం లేదనే అసంతృప్తితో రైతులు ఈ సాగును విరమించుకున్నారు. ఇతర పంటల వైపు మొగ్గు చూపుతున్నారు.