(మ్యాడం మధుసూదన్
సీనియర్ జర్నలిస్టు..)
కమలం రథసారథిగా మల్కాజ్‌గిరి ఎంపీ, మాజీ సీనియర్ మంత్రి ఈటల రాజేందర్ ఎంపిక దాదాపు ఖరారైనట్టు సమాచారం. వచ్చే వారంలోపు బీజేపీ పగ్గాలను ఆయన చేపట్టే అవకాశం ఉంది. పార్టీ సంస్థాగత ఎన్నికలు దాదాపు పూర్తవుతున్న క్రమంలో కీలకమైన రాష్ట్ర అధ్యక్ష పదవి ఖరారుపై జాతీయపార్టీ దృష్టి సారించింది. ఈటల సారథ్యంపై ఆ పార్టీ అత్యున్నత స్థానంలో ఉన్న కేంద్ర హోం మంత్రి అమిత్ షా అత్యంత ఆసక్తిగా ఉన్నారు. గతంలోనే ఆయనకు కీలక బాధ్యతలు అప్పగిస్తామని మాట కూడా ఇచ్చారు. బండి సంజయ్ …. ఈటల మధ్య విభేదాలు వివాదస్పందంగా మారడంతో ఎన్నికలకు ముందు జాతీయ పార్టీ ఈటలకు పగ్గాలు ఇవ్వడానికి సాహసించలేకపోయింది. మధ్యే మార్గంగా వివాదాలకు అతీతుడైన కేంద్ర మంత్రి జీ కిషన్ రెడ్డికి మళ్లీ రాష్ట్ర పగ్గాలను అప్పజెప్పాల్సి వచ్చింది. వాస్తవానికి, రాష్ట్రంలో బీసీలలోనే కాకుండా జనాభాపరంగా అత్యధిక సంఖ్యాకులున్న ముదిరాజ్ కులానికి చెందిన ఆయనకు రెడ్డి సామాజిక వర్గంతో కూడా సంబంధాలున్నాయి. ఎందుకంటే , ఈటల సతీమణి రెడ్డి సామాజికవర్గానికి చెందినవారే. బీసీ కార్డు ఓ వైపు .. రాజకీయంగా బలమైన రెడ్డి సామాజికవర్గం మరోవైపు .. ఈటలకు నాయకత్వ బాధ్యతలు ఇవ్వడం వల్ల రెండు బలాలు కలిసి వస్తాయని బీజేపీ మొదటి నుంచి భావిస్తోంది.
ఈ క్రమంలో ఎమ్మెల్యే ఎన్నికలు పూర్తికావడం .. కాంగ్రెస్ గెలవడం, ఈటల, బండి సంజయ్ ఎమ్మెల్యేలుగా ఓడిపోవడం, ఇద్దరూ ఎంపీలుగా గెలవడం వంటి పరిణామాలు వెంట వెంట జరిగిపోయాయి. బీఆరెస్‌తో మ్యాచ్ ఫిక్సింగ్ వంటి ఆరోపణలు, బండి, ఈటల మధ్య విభేదాలు… పార్టీలో అయోమయ వాతావరణం కారణంగా శాసన సభ ఎన్నికల్లో బీజేపీకి గట్టి దెబ్బ పడింది. ఎంపీ ఎన్నికల్లో అనూహ్యంగా పుంజుకున్న బీజేపీ.. బండి సంజయ్‌కు కేంద్ర మంత్రి పదవి ఇవ్వడంతో ఈటలకు లైన్ క్లియర్ అయ్యింది. వాస్తవానికి ప్రస్తుతం అధ్యక్షపదవి రేసులో ఈటలతో పాటు ఎంపీలు అర్వింద్, రఘునందన్ అధ్యక్షపదవి రేసులో ఉన్నారు. రాజా సింగ్ పేరు కూడా అప్పుడప్పుడు తెరమీదకు వస్తోంది. కానీ, సామాజిక, ఆర్థిక, రాజకీయ, వ్యక్తిగతంగా ఎలా చూసుకున్నా ఈటల రాజేందర్‌కు గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేని పరిస్థితి ఏర్పడింది. 2021లో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ తనపై కత్తి కట్టి అవమానకరమైన పరిస్థితుల్లో పార్టీ నుంచి గెంటేశారు. అప్పుడున్న పరిస్థితుల్లో కేంద్రంలో బలంగా ఉన్న బీజేపీ వైపు మొగ్గు చూపాల్సి వచ్చింది ఈటల. ప్రబలమైన శక్తిగా ఉన్న కేసీఆర్‌ను ఎదుర్కోవాలంటే బీజేపీయే మార్గమని డిసైడ్ అయ్యారు రాజేందర్.
తెలంగాణ ఉద్యమకారుడిగా , రాడికల్ భావజాలంతో రాజకీయాల్లో ఎదగిన ఆయన ఉద్యమకారుడిగా మంచి పేరు తెచ్చుకున్నారు. కేసీఆర్ నమ్మిన బంటుగా ఉంటూ హుజురాబాద్ ప్రజల గుండెల్లో స్థిరస్థానం పదిలం చేసుకున్నారు. వరుసగా ఎమ్మెల్యేగా ఎన్నికవుతూ వచ్చారు. కేసీఆర్‌ను ఎదురించి మరోసారి విజయం సాధించి సంచలనం సృష్టించారు. ఆ తరువాత కేసీఆర్ మీద పోటీ చేసే క్రమంలో రెండు పడవల మీద కాళ్లు పెట్టడం, అనూహ్యంగా రెండు చోట్ల ఓడిపోవడం వెంట వెంటనే జరిగిపోయింది.
రాష్ట్రంలోనే మల్కాజ్‌గిరి పార్లమెంటు నియోజకవర్గం అత్యంత పెద్ద నియోజకవర్గం. అక్కడ ఎంపీగా గెలిచి జెండా ఎగురవేశాడు. అప్పట్నుంచి కేసీఆర్ ప్రభుత్వంపై, రేవంత్ పై ఘాటు విమర్శలు చేస్తూ ఒక బలమైన నాయకుడిగా ముద్ర వేసుకున్నారు. ఈటల కు బీజేపీ రాష్ట్ర బాధ్యతలు ఇవ్వడం వల్ల ఉద్యమ సంబంధాలు, సామాజిక \బలం తోడై.. బీజేపీకి నీడై… రాజకీయంగా బాగా లాభిస్తుందని అధిష్టానం భావిస్తోంది. అంతే కాదు ఈటలకు ఇంకో బలం ఉంది. ఈటలకు పగ్గాలు అప్పగిస్తే రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న బీఆరెస్‌ను బలహీనపరుచవచ్చనే స్కెచ్ వేస్తోంది అధిష్టానం. బీఆరెస్ నేతలతో సత్సంబంధాలున్న ఈటల… వారిని బీజేపీలోకి లాగుతారనే అంచనాలు వేసుకుంటున్నారు. తద్వారా ప్రధాన ప్రతిపక్షంగా బీజేపీ ఎదగవచ్చని సమీకరణలో లెక్కలు వేసుకుంటున్నారు.
రానున్న రోజుల్లో కాంగ్రెస్ బలహీన పడటం ఖాయం. ప్రధాన ప్రతిపక్షంగా బీఆరెస్ కనుమరుగైతే వచ్చేది బీజేపీ రాజ్యమే. కమలం రాజ్యమే. ఇవే అంచనాలు వేసుకుంటున్నారు బీజేపీ నాయకులు. ఈ క్రమంలో ఈటలకు పగ్గాలు ఇవ్వడం వల్ల పార్టీ మరింత బలమైన శక్తిగా ఎదుగుతుందని పార్టీ భావిస్తోంది. వచ్చే వారంలోగా సంస్థాగత ఎన్నికలన్నీ పూర్తవుతున్న తరుణంలో వచ్చే వారంలో ఈటలను అధ్యక్ష పీఠంపై కూర్చోబెట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి.
రఘునందన్ మీడిల్ ఆర్డర్ బ్యాట్స్‌మెన్‌గా ఎదుగుతున్న దశలో అధ్యక్ష పదవి ఇచ్చే అవకాశాలు లేవు. నిజామాబాద్ ఎంపీ అర్వింద్ అధిష్టానం దృష్టిలో ఉన్నప్పటికి ఆయన ఆవేశం మైనస్ పాయింట్. రాజాసింగ్‌కు విస్తృతమైన ప్రజాసబంధాలు లేవు. కేవలం తన ప్రాంతానికే పరిమితం. కానీ ఈటలకు అలా కాదు. రాష్ట వ్యాప్తంగా తను ప్రభావం చూపగలడు. దటీజ్ రాజేందర్.