యాక్షన్… రియాక్షన్… ఓవరాక్షన్…!!
పుష్ప సీన్ రివర్స్..!
సినిమా సీఎం… రియల్ సీఎం…!!
సీఎం రేవంత్ బెట్టు… సినీ పరిశ్రమపై పట్టు..!
పుష్ప-2లో పైచేయి సాధించిన సీఎం..!
డిఫెన్స్‌లో పోలీసులు…!
( మ్యాడం మధుసూదన్, సీనియర్ పాత్రికేయులు..)
(9949774458)
పుష్ప వివాదం…కార్చిచ్చులా రగులుతూనే ఉంది. రోజుకో రాజకీయ రంగు పులుముకుంటున్నది. అటు ప్రభుత్వ పరంగా , ఇటు సినిమా పరంగా ఎన్నో ప్రశ్నలను మిగుల్చుతున్న పుష్ప వివాదంలో తప్పంతా అల్లు అర్జున్ దేనా..? పోలీసుల తప్పు ఏమీ లేదా..? స్మగ్లింగ్ సినిమా, రౌడీ సినిమా అంటున్న ప్రభుత్వం ఏమీ తెలుసుకోకుండానే రాయితీలనిచ్చిందా.. బెనిఫిట్ షోలకు అనుమతులిచ్చిందా..? యాక్షన్.. రియాక్షన్… ఓవరాక్షన్ ఎవరిది..? ఈ వివాదాన్ని అసెంబ్లీ కేంద్రంగా డైవర్షన్ కోసం ఉపయోగించుకుని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సక్సెస్ అయ్యారా..? అల్లు అర్జున్ ఓవరాక్షన్, ప్రైవేట్ సైన్యం రియాక్షన్‌ను ప్రజలకు వివరించగలిగాడు. సినిమా రంగ పెద్దలను కూడా నిలదీసి తాను ఎవరికీ తగ్గేదే లేదని స్పష్టం చేశారు.
అసలు ఈ కార్చిచ్చులో బాధితులెవరు..? బాధ్యులెవరు..? వార్త ఏమిటీ..? వాస్తవమేమిటీ..?
మొదటి అంశం.. పోలీసులు అనుమతినిచ్చారా..? నిజంగానే తిరస్కరించారా..? లేకపోతే అల్లు అర్జున్ ను ముందే హెచ్చరించారా..? హెచ్చరించకుండానే , అనుమతి నిరాకరించకుండానే తప్పించుకుంటున్నారా..? ఇది మౌళిక ప్రశ్నగా మారింది. నిజానికి. శేషాచలం అడవులలో ఎర్ర చందనం స్మగ్లింగ్ ప్రధాన ఇతివృత్తంగా పుష్ప-1, పుష్ప-2 లు దేశవ్యాప్తంగా అనూహ్యమైన సక్సెస్‌లను సాధించాయి. పుష్ప-1 రిలీజ్ సమయంలో కూడా ఇదే వెండితెర హీరో అల్లు అర్జున్ సంధ్య థియేటర్‌లో ప్రేక్షకుల మధ్య కూర్చొని సినిమా తిలకించాడు. అప్పట్లో కూడా హడావుడి జరిగింది. పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. బౌన్సర్లు కాపలాగా ఉండనే ఉన్నారు. ఇక పుష్ప-2 రిలీజ్ మరింత ప్రేక్షకుల్లో ఆసక్తిని హైపింగ్ తెచ్చింది. మొదటి సినిమా మాదిరిగా ఈసారి కూడా సంధ్య థియేటర్ యాజమాన్యం అల్లు అర్జున్ వచ్చే విషయాన్ని వివరిస్తూ అనుమతిని కోరింది. బందోబస్తు చేయమని కోరింది. ఇక్కడే అసలు ట్విస్టు మొదలైంది. అనుమతి అభ్యర్థనను స్వీకరించిన పోలీసులు తమదైన ఫార్మాట్‌లో దానిని నిరాకరిస్తున్నట్టు ప్రకటించలేదు. మొదట దానిని తేలికగా తీసుకున్న పోలీసులు, తరువాత విషయం అర్ధమయ్యే సరికి జరగకూడని నష్టం జరిగిపోయింది. ఇక్కడ పోలీసులు అనుమతిని నిరాకరించామనే విషయాన్ని హైకోర్టులో చెప్పలేకపోయింది.. కానీ థియేటర్ యాజమాన్యం మాత్రం కోర్టును ఈ విషయంలో ఒప్పించగలిగింది. ఇదే ఆధారంగా హైకోర్టు మధ్యంతర బెయిల్ ను ఇచ్చింది. ఈ దురదృష్టకర సంఘటన జరిగిన తరువాత స్థానిక పోలీసు అధికారులు మీడియాతో మాట్లాడుతూ అనుకోకుండా జరిగిన సంఘటనగా అభివర్ణించారు. దీనిపై కేసులు పెడుతున్నట్టు ప్రకటించిన పోలీసులు.. ఏ11 నిందితుడిగా అల్లు అర్జున్‌ను చేర్చి తేలికగా తీసుకున్నారు. అప్పటికే ముఖ్యమంత్రి ఈ విషయంలో, అల్లు అర్జున్ వైఖరి పట్ల చాలా ఆగ్రహం గా ఉన్నారు. ఈ సీరియస్‌నెస్‌ను గమనించి పోలీసులు అల్లు అర్జున్‌ను అరెస్టు చేశారు. నాంపల్లి కోర్టులో 14 రోజుల రిమాండ్ విధించే విషయంలో విజయం సాధించిన పోలీసులు .. హైకోర్టులో బోల్తాపడ్డారు. ఈ క్రమంలో అల్లు అర్జున్ ఒక రోజు జైళ్లో మగ్గేలా ఉంచేలా పోలీసులు చాలా కష్టపడాల్సి వచ్చింది.
రెండో పాయింట్….
ఒక ప్రీ రిలీజింగ్ ఫంక్షన్ లో అల్లు అర్జున్ ముఖ్యమంత్రి పేరును మరిచిపోయాడని, పట్టింపులేనట్టు మాట్లాడడని వార్తలు, విజువల్స్ వచ్చాయి. అందుకే కోపం వచ్చి ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పిడికిలి బిగించాడని , ఉక్కుపాదంతో తొక్కుతున్నారని ప్రచారం జరిగింది. వాస్తవానికి ఒక మహిళా చనిపోవడం, బాలుడు కోమాలోకి వెళ్లడం లాంటి దురదృష్ట సంఘటనపై ప్రభుత్వం బాధ్యతగా స్పందిస్తే ప్రచారం వేరే విధంగా జరగడాన్ని సీఎం కూడా సీరియస్ తీసుకున్నట్టు తెలుస్తోంది. ఈ క్రమంలో ఎంఐఎం శాసనసభాపక్ష నేత అక్బరుద్దీన్ ఓవైసీ నాటకీయంగా అసెంబ్లీలో ప్రశ్నను లేవనెత్తడం, దానికి బదులుగా ఘాటుగా, దీటుగా , ధాటిగా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సమాధానం ఇవ్వడం, అల్లు అర్జున్‌తో పాటు సినిమా రంగాన్ని కూడా కడిగేయడం పెను సంచలనం సృష్టించింది.
మొదట పుష్పను ఎందుకు అరెస్టు చేశారన్న ప్రశ్నలు తలెత్తిన పరిస్థితిని పూర్తిగా సీఎం తన చాకచక్యంతో మార్చివేశాడు. ఇక్కడ మనమొక విషయం గమనించాలి. పుష్ప-2 సినిమాలో సీన్ ఇక్కడ రివర్స్ అయ్యింది. ఈ సినిమాలో ముఖ్యమంత్రిగా ఉన్న ఒక పాత్ర .. ఈ సినిమాలో పుష్ప ( అల్లు అర్జున్) భార్యగా నటించిన రష్మిక దమ్ముంటే ముఖ్యమంత్రితో ఫోటో దిగమని చెబుతుంది. దాని కోసం హీరో ప్రయత్నిస్తే ముఖ్యమంత్రి పాత్రలోని వ్యక్తి నువ్వో స్మగ్లర్‌వు నీతో ఫోటో దిగడమేందని తిరస్కరిస్తాడు. దీంతో రెచ్చిపోయిన పుష్ప 500 కోట్లు అధిష్టానవర్గానికి ఇచ్చి ముఖ్యమంత్రినే మార్చేస్తాడు. మరో కొత్త ముఖ్యమంత్రితో ఫోటో దిగడంతో సినిమా కథ ఎండ్ అవుతుంది. ఇది సినిమా కథ. రియాలిటీకి వచ్చే సరికి సీన్ రివర్స్ అయ్యింది. ప్రపంచ వ్యాప్తంగా తన సినిమా హిట్ అయ్యిందన్న విజయగర్వంతో ఉన్న అల్లు అర్జున్ .. ముఖ్యమంత్రి పేరును మరిచిపోతాడు..దాంతో అసలే దూకుడుగా ఉండే ముఖ్యమంత్రి హీరోను జైల్‌లో పెట్టిస్తారు.. అని జనాలు ఆసక్తికరంగా చెప్పుకుంటున్నారు. కానీ, పోలీసులు మొదటనే కఠినమైన చర్య తీసుకుని ఉంటే ఈ సంఘటనకు ఆస్కారం ఉండేది కాదు.అందుకు మనమొక ఉదాహరణ చెప్పుకోవచ్చు.
జూనియర్ ఎన్టీఆర్ నటించిన దేవర సినిమా ఫ్రీ రిలీజింగ్ ఫంక్షన్‌కు భారీ ఎత్తున జనాలు వచ్చారు. పోలీసులు ముందే స్పష్టం చేశారు. జూ. ఎన్టీఆర్‌ను రావొద్దని, పరిస్థితిని అదుపుచేయలేమని చెప్పడంతో ఆయన ఇంట్లోనే ఉండిపోయాడు. కానీ ఇక్కడ చిక్కడపల్లి పోలీసులు మాత్రం అటువంటి చర్య తీసుకున్నట్టు కనిపించలేదు. ఎప్పుడైతే ముఖ్యమంత్రి స్వయంగా రంగంలోకి దిగాడో పోలీస్ వ్యవస్థ అప్రమత్తమయ్యింది. తాము మొదటనే అనుమతిని నిరాకరించామని చెప్పడానికి ప్రయత్నించింది. పౌరులు, సామాన్యపౌరులు వారి వారి సెల్‌ఫోన్‌లలో చిత్రీకరించిన వీడియోలను అతికష్టం మీద సేకరించారు. ప్రభుత్వం మెప్పు పొందడానికి , తమ తప్పు లేదని చెప్పడానికి పోలీసులు దాదాపు ఓ సినిమా స్థాయిలో వీడియోలను ప్రదర్శించారు.తాము అదుపు చేయడానికి విఫలయత్నం చేశామని వివరించారు.
మూడో పాయింట్,,!
వరుస హిట్లతో తానొక పెద్ద హీరోనని ప్రైవేటు సైన్యాన్ని కూడా నిర్మించుకున్న అల్లు అర్జున్…అహంభావం పుష్ప-1 సక్సెస్‌తో మరింత పెరిగిందని ఆరోపణలు వస్తున్నాయి. ఈ క్రమంలో ఏపీ పాలిటిక్స్‌లో రాయలసీమ కేంద్రంగా చోటు చేసుకున్న రాజకీయ పరిణామాలు.. అల్లు అర్జున్‌ను పవన్ కళ్యాన్‌కు కూడా దూరం చేశాయి. తాను ఎంతగానో ప్రేమించే పెద్ద మేనమామ చిరంజీవికి నరాజ్ అయ్యారని తెలుస్తోంది. పుష్ప-2 సూపర్ డూపర్ హిట్‌తో అల్లు అర్జున్ విజయగర్వం మితిమీరడంతో పాటు ముఖ్యమంత్రి వంటి పెద్ద స్థాయివారి పేర్లను కూడా మరిచిపోయేలా చేసిందనే విమర్శలున్నాయి. ఒక దశలో డైరెక్టర్ సుకుమార్ పేరు కూడా పొరపాటుగా ఉచ్చరించారు. మరోవైపు అల్లు యాక్షన్‌కు దేశంలోని బడా నాయకులు కూడా ఫిదా అయ్యారు.
యాక్షన్ హీరోగా పేరు తెచ్చుకున్నాడు. కానీ అదే సక్సెస్ తెలుగు చిత్ర పరిశ్రమలో ఒకవర్గం మీడియాకు కంటగింపుగా మారింది. కండ్లల్ల, పండ్లల్ల పడి పెద్ద దిష్టే తగిలింది. అల్లు అర్జున్ ఓవరాక్షన్ తెలుగు చలన చిత్ర పరిశ్రమకు కూడా కొంత ముప్పు తెచ్చింది. మొత్తం సినిమా రంగంపైనే ప్రభుత్వం గురిపెట్టే పరిస్థితి ఏర్పడింది. ఎందుకీ పరిస్థితి..? సినిమా రంగం చేసిన తప్పేమిటీ..? వాస్తవానికి స్వయంకృషితో ఎదిగి ముఖ్యమంత్రిగా పగ్గాలు చేపట్టిన డైనమిక్ సీఎం రేవంత్‌రెడ్డి పట్ల సినిమా రంగ పెద్దలు పెద్ద గౌరవంగా వ్యవహరించలేదని, గతంలో ముఖ్యమంత్రులకిచ్చిన గౌరవం ఇవ్వడం లేదని ప్రచారంలో ఉంది. సీఎంగా బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి ఆయన బర్త్‌డే సెలబ్రేషన్ల వరకు సినిమా హీరోలు, పెద్దలు గౌరవం ఇవ్వలేదు. బెనిఫిట్ షోకు రాయితీలిచ్చినంక కూడా అల్లు అర్జున్ ప్రభుత్వానికి సంస్కారంతో కూడిన నమస్కారం చేయకపోవడం విమర్శలకు దారి తీసింది.
గతంలో కూడా తెలంగాణ ముఖ్యమంత్రిగా పగ్గాలు చేపట్టిన తరువాత కేసీఆర్ కుటుంబం కూడా సినిమా రంగంపై పట్టు సాధించేందుకు కొన్ని ఎత్లులు వేశారని చెబుతుంటారు. అందులో భాగంగా సినీ ప్రముఖుల మీద డ్రగ్స్ కేసులు పెట్టడం, మినహాయించడం వెంట వెంట జరిగిపోయాయి. ఆ తరువాత సినిమా పరిశ్రమ మొత్తం కేసీఆర్ అనుకూలంగా మారడం , ఇంకా అదే అభిప్రాయంతో ఉన్నారని ప్రభుత్వ వర్గాలకు ఉంది. చంద్రబాబు సీఎంగా ఉన్న సమయంలో కూడా ఆయనకు దగ్గరైన పరిశ్రమ తరువాత వచ్చిన సీఎం వైఎస్ రాజశేఖర్‌రెడ్డికి అనుకూలంగా మారడానికి కొంత సమయం పట్టింది. ప్రస్తుతం రేవంత్ రెడ్డి కూడా ఇదే స్థాయిలో పట్టు బిగించాడు. గత అనుభవాలను, సంఘటనలను పరిశీలిస్తే త్వరలో ఆయనకు కూడా సినిమా రంగం అనుకూలంగా మారొచ్చు.