(దండుగుల శ్రీనివాస్)
మీది తెనాలే.. మాది తెనాలె..! అర్దమయ్యిందనుకుంటా. కాపులంతా ఏకమయ్యారు. అల్లు అర్జున్ పుష్ప-2 వివాదం చినికి చినికి గాలివాన అయిన నేపథ్యంలో మళ్లీ రేపో మాపో జైలుకు వెళ్లేందుకు రెడీగా ఉన్న అల్లును కాపుబంధం అల్లుకున్నది. బీజేపీ మధ్యవర్తిత్వం వహిస్తున్నది. దౌత్యచర్యలకు దిగింది. మొన్నటి వరకు సీఎంను తిట్టిన నోటితోనే రిక్వెస్టులు పెట్టుకుంటున్నది బీజేపీ.
ఇవాళ సీఎం రేవంత్ రెడ్డిని నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ కలవడం రాజకీయ ప్రాధాన్యతను సంతరించుకున్నది. ప్రధానంగా అతను వచ్చింది పుష్పరాజ్ విషయంలో.. రగుతుతున్న వేడికి తగ్గించడానికి. సీఎం, అల్లు అర్జున్‌కు మధ్య పెరిగిన అగాధాన్ని తగ్గించడానికి. రేవంత్ రెడ్డి మంచి కసి మీద ఉన్నాడు పుష్పరాజ్ మీద. సినిమాలో విలన్ షెకావత్‌తో పెట్టుకుని హీరో అల్లు గెలిచాడమోగానీ, ఇక్కడ రియల్ లైఫ్‌లో రేవంత్ తో పెట్టుకుని బతికి బట్టకట్టలేడని తెలిసిపోయింది.
అసెంబ్లీలో అంత సీరియస్‌గా సీఎం సాక్షాత్తూ అల్లు అర్జున్ వ్యవహారశైలి తప్పిదాలను ఎత్తిచూపిన తరువాత మూసుకుని ఉండక… పోలోమని తగుదునమ్మా అంటూ మెచ్యూరిటీ లేని మాటలు ప్రెస్‌మీట్‌లో మాట్లాడి మరింత కంపు కంపు చేసుకున్నాడు అల్లు అర్జున్. దీనిపై సర్కార్ మరింత సీరియస్ అయ్యింది. బిడ్డా రా తాడోపేడో తేల్చుకుందాం… అనేదాకా పోయింది విషయం. దీంతో పోలీసులు రంగ ప్రవేశం చేశారు.
అప్పుడు సంథ్య థియేటర్లో జరిగిన తంతు మొత్తం వీడియోల రూపంలో బయటపెట్టారు. ఇక ముఖం ఎక్కడ దాచుకోవాలో తెలియక ఈ హీరో మరింత బిక్కచచ్చిపోయాడు. ఇదే సమయంలో ఓయూ జేఏసీ పేరుతో అల్లు అర్జున్ ఇంటిపై దాడి జరిగింది. ఇది మీరు చేశారంటే మీరు చేశారని ఇటు బీఆరెస్ మరోవైపు కాంగ్రెస్ సోషల్‌మీడియా సిగపట్లు పట్టింది. ఆ వివాదం ఇంకా కొనసాగుతున్న నేపథ్యంలోనే ఎంపీ అర్వింద్ సీఎం రేవంత్‌ను కలిశాడు. అంతకు ముందే బండి సంజయ్ పుష్పరాజ్ కోసం యథావిధిగా ఓ ప్రెస్‌నోట్ రిలీజ్ చేశాడు. మద్దతుగా ఉంటానన్నాడు.
సీఎం రేవంత్‌రెడ్డి కక్ష పూరితంగానే ఇదంతా చేస్తున్నాడని విరుచుకుపడ్డాడు. ఇప్పుడు ఇదే కాపు వర్గానికి చెందిన ధర్మపురి అర్వింద్ కూడా రంగంలోకి దిగాడు. ఏకంగా రాజకీయాలన్నీ పక్కన పెట్టేసి, సిద్దాంతాలన్నీ అటకెక్కించేసి రేవంత్‌ను కలిశాడు. కేవలం పుష్పరాజ్ కోసం. అవును.. ఇది నిజం! రేవంత్ పుష్పరాజ్‌పై భగభగ మండుతున్నాడు. ఇక వదిలేదే లేదనే రేంజ్‌లో సర్కార్ స్టెప్పులు వేస్తోంది.ఈ విషయాన్ని గ్రహించిన మెగా ఫ్యామిలీ, అల్లు అర్వింద్ టీం.. బీజేపీని అలర్ట్ చేసింది. వీరు రంగంలోకి దిగారు. ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి కూల్ చేసే పనిలో ధర్మపురి అర్వింద్ దౌత్యం వహిస్తున్నాడు. ఇద్దరి మధ్య గ్యాప్ తొలగించే ప్రయత్నం చేస్తున్నాడు. ఇక ఈ వివాదానికి బీజేపీ పుల్ స్టాప్ పెట్టనుంది. రేవంత్ కూడా కూల్ కానున్నాడు.