రేవంత్ మాటల తాకిడికి…
ఏడాది అజ్ఞాతం వీడి… ఫామ్‌హౌజ్ నుంచి అసెంబ్లీకి…!
రూటు మార్చిన కేసీఆర్… ఫామ్‌హౌజ్‌లో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో భేటీ..!
ఆహ్వానం ఆహ్వానమే…. వ్యతిరేకం వ్యతిరేకమే..!
కొత్త తెలంగాణ తల్లి విగ్రహ ఏర్పాటును తప్పుబట్టిన కేసీఆర్..!
సర్కార్ నుంచి వచ్చిన ఆహ్వానాన్ని స్వీకరించిన బీఆరెస్ అధినేత..
ఆ మరుక్షణమే తన అఫీషియల్ ఫేస్‌బుక్ వాల్ పై బీఆరెస్ తెలంగాణ తల్లి విగ్రహం..!
అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో ఎమ్మెల్యే, ఎమ్మెల్యీలకు ఫామ్ హౌజ్ నుంచే దిశానిర్దేశం..!!
(దండుగుల శ్రీనివాస్)
మొత్తానికి రేవంత్ మాటల తాకిడిని కేసీఆర్ తట్టుకోలేకపోయాడు. ఇక ఫామ్‌హౌజ్‌ను వీడనున్నాడు. ఫామ్‌హౌజ్ నుంచి సోమవారం నుంచి ప్రారంభం కాబోయే అసెంబ్లీ సమావేశాలకూ హాజరుకానున్నాడు. సరిగ్గా ఏడాది తరువాత ఆయన కాలు బయట మోపుతున్నాడు. సోమవారం సచివాలయం ముందు తెలంగాణ తల్లి కొత్త విగ్రహం ఏర్పాటు చేయనున్న నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి మరోసారి కేసీఆర్‌కు కాలుదువ్వాడు. విగ్రహావిష్కరణకు రావాల్సిందిగా కోరాడు. మంత్రి పొన్నం ప్రభాకర్‌ను పంపాడు. అయితే దీనికి కేసీఆర్ ససేమిరా అంటాడనుకున్నారు. అసలు ఫామ్‌హౌజ్‌లోకి ఎంట్రీయే ఉండదని, మరోసారి ప్రజాక్షేత్రంలో కేసీఆర్‌ను దోషిలా నిలపాలని రేవంత్ భావించాడు.
కానీ అనూహ్యంగా కేసీఆర్ అందుకు విరుద్దంగా వ్యవహరించి అందరినీ ఆశ్చర్యపరిచాడు. పొన్నంకు అక్కడ సాదర స్వాగతం లభించింది. కలిసి లంచ్ చేశాడు. శాలువాతో సత్కరించాడు. మాట ముచ్చట చెప్పి పంపాడు. ఇదంతా పొలిటికల్ స్ట్రాటజీలో భాగమే. రేవంత్ ఎత్తుకు కేసీఆర్ ఇలా పై ఎత్తు వేసి ఔరా అనిపించాడన్నమాట. ఇక సోమవారం నుంచి నిర్వహించే అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో ఫామ్‌హౌజ్ లోనే ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో భేటీ అయ్యాడు కేసీఆర్. అసెంబ్లీలో పార్టీ వ్యవహరించాల్సిన వ్యూహాలపై చర్చించాడు. తను అసెంబ్లీకి కూడా వచ్చి తనవంతుగా మాట్లాడి ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టాలని, ప్రజల ముందు దోషిలా నిలుపుతున్న రేవంత్ దూకుడుకు అడ్డుకట్ట వేయాలని కేసీఆర్ భావిస్తున్నాడు. మొత్తానికి రేవంత్ తాకిడికి తట్టుకోలేక ఇలా ఏడాది అజ్ఞాత వాసం వీడనున్నాడు కేసీఆర్.