(దండుగుల శ్రీనివాస్)
రాష్ట్ర ప్రజల ఎవరూ సంతోషంగా లేరు. అందులో డౌట్ లేదు. అంతకు ముందు బీఆరెస్ పాలనలో పట్టుకున్న దరిద్రం ఈ సర్కార్ ఏడాది గడిచినా వదల్లేదు. ఇంకా కొనసాగుతోది. పెనం మీద నుంచి పొయ్యిలోకి పడ్డట్టే ఉంది పరిస్థితి. ఈ సమయంలో ఇప్పుడు కొత్తగా తెలంగాణ తల్లి విగ్రహం ఏర్పాటు అంశం కొత్త రచ్చకు తెర తీసింది. అది ఆకలి తీర్చేదా..? కష్టాలు కడతేర్చేదా..?? దేనికీ పనికి రాని ఇష్యూగానే చూస్తున్నారు ప్రజలు. కానీ ఇటు బీఆరెస్. అటు కాంగ్రెస్ మాత్రం దీన్ని రచ్చ కీడ్చి నానాయాగీ చేస్తున్నారు.
ప్రస్తుత ఈ రాజకీయాలతో జనం తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. ఇవెక్కడి రాజకీయాలురా నాయన..? మేం కోరుకున్నది ఇది కాదు… మాకు ఏం చేస్తారో మీరు చేయండి… ఈ మార్పు రాజకీయాలంటే విగ్రహాలు, నెంబర్ ప్లేట్లు మార్చడం కాదు.. మాకెందుకీ రాజకీయాలు…! అంటూ నెత్తి నోరు కొట్టుకుంటున్నారు. కేటీఆర్ ఇవాళ మాట్లాడుతూ.. అది ఫక్కాగా రాహుల్ తల్లి విగ్రహమంటూ కొత్త రాజకీయ చిచ్చు తెరపైకి తెచ్చాడు.
ఆ వెంటనే పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ ప్రెస్‌మీట్ పెట్టి… ఇంతకు ముందులా తల్లి దొరసాని విగ్రహం కాదు.. మేం పక్కాగా తెలంగాణ తల్లి విగ్రహం పెడుతున్నామని చెప్పుకొచ్చాడు. ప్రభుత్వం ఈనెల 9న సోనియా బర్త్ డే సందర్బంగా సచివాలయంలో ఈ కొత్త శిల్పాన్నిఆవిష్కరించే కార్యక్రమాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నది. లక్ష మంది మహిళల మధ్య ఈ కొత్త తల్లి తెలంగాణ విగ్రహాన్ని ఆవిష్కరించేందుకు ఏర్పాట్లు చేసింది. నియోజకవర్గానికి వెయ్యి మంది మహిళలను తలరించనున్నారు. ఈ క్రమంలోనే దీనిపై వివాదం నెలకొన్నది.