రెవెన్యూ శాఖ పునరుద్ధరణలో భాగమవుతాం
– కొత్త ఆర్వోఆర్ చట్టం అమలుకు శక్తివంచన లేకుండా పని చేస్తాం
– గ్రామ రెవెన్యూ వ్యవస్థను పునరుద్ధరిస్తున్న ప్రభుత్వానికి కృతజ్ఞతలు
– గ్రామానికో రెవెన్యూ అధికారి ఏర్పాటు మంచి పరిణామం
– తెలంగాణ ఉద్యోగుల జేఏసీ చైర్మన్ వి.లచ్చిరెడ్డి
– తెలంగాణ రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్ ఆత్మీయ సమావేశం
– నూతన రాష్ట్ర కార్యవర్గం ఎన్నిక
– ఆఫీస్ సబార్డినేట్ నుంచి డిప్యూటీ తహశీల్దార్ వరకు రెవెన్యూ ఉద్యోగులకు ప్రాతినిథ్యం
వాస్తవం ప్రధాన ప్రతినిధి – హైదరాబాద్:
రాష్ట్రంలో చిన్నాభిన్నమైన రెవెన్యూ వ్యవస్థను తిరిగి పునరుద్ధరించేందుకు ప్రభుత్వం ప్రయత్నించడం సంతోషకరమని, ఈ ప్రయత్నంలో రెవెన్యూ ఉద్యోగులుగా అందరం భాగస్వాములం అవుతామని తెలంగాణ ఉద్యోగుల జేఏసీ చైర్మన్ వి.లచ్చిరెడ్డి పేర్కొన్నారు. ఆదివారం లక్డీకపూల్‌లోని అశోక హోటల్‌లో తెలంగాణ రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్(టీజీఆర్ఎస్ఏ) రాష్ట్ర స్థాయి ఆత్మీయ సమావేశం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వి.లచ్చిరెడ్డి హాజరై ప్రసంగించారు. గత ప్రభుత్వం గ్రామ స్థాయి రెవెన్యూ వ్యవస్థను ఎత్తేయడం వల్ల మొత్తం రెవెన్యూ వ్యవస్థనే నిర్వీర్యం అయ్యిందని ఆయన పేర్కొన్నారు. వీఆర్ఏ, వీఆర్వో వ్యవస్థలను తీసేయడం వల్ల గ్రామ స్థాయిలో పోలీసు వ్యవస్థ లేకుండా పోయిందని, ఫలితంగా లగచర్ల వంటి ఘటనలు జరిగే పరిస్థితి వచ్చిందని అన్నారు. మళ్లీ వీఆర్ఏ, వీఆర్వో వ్యవస్థను పునరుద్ధరించేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తుండటం స్వాగతించాల్సిన విషయమని అన్నారు. గ్రామ స్థాయి రెవెన్యూ వ్యవస్థను పునర్మించాలని నిర్ణయం తీసుకున్న మఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి లచ్చిరెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. గ్రామానికో రెవెన్యూ అధికారిని ఏర్పాటుచేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం మంచి పరిణామమని అన్నారు. గ్రామీణ స్థాయి నుంచి రెవెన్యూ సమస్యలు పరిష్కారమయ్యే వ్యవస్థను, అప్పీల్ వ్యవస్థను తీసుకురావాలని ప్రభుత్వం నిర్ణయించడం ఆహ్వానించాల్సిన అంశమని పేర్కొన్నారు. కొత్త ఆర్వోఆర్ చట్టం అమలు కోసం శక్తివంచన లేకుండా పని చేస్తామని అన్నారు.
అన్ని స్థాయిల ఉద్యోగులతో టీజీఆర్ఎస్ఏ
తెలంగాణ ఉద్యమ సమయంలో రెవెన్యూ ఉద్యోగులను భాగం చేయాలనే లక్ష్యంతో తెలంగాణ రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్(టీజీఆర్ఎస్ఏ)ను ఏర్పాటు చేశామని లచ్చిరెడ్డి తెలిపారు. రెవెన్యూ శాఖలోని ఆఫీస్ సబార్డినేట్ నుంచి డిప్యూటీ తహశీల్దార్ వరకు అన్ని స్థాయిల ఉద్యోగులకు ఈ సంఘం ప్రాతినిథ్యం వహిస్తుందని ఆయన చెప్పారు. రెవెన్యూ ఉద్యోగులను ఐక్యం చేసి, సమస్యల పరిష్కారానికి కృషి చేసే వేదికగా టీజీఆర్ఎస్ఏ పని చేస్తుందని ఆయన పేర్కొన్నారు. సంఘం నూతన కార్యవర్గానికి ఆయన శుభాకాంక్షలు తెలిపారు.
రెవెన్యూ ఉద్యోగుల సమస్యల పరిష్కారమే టీజీఆర్ఎస్ఏ లక్ష్యం: బాణాల రాంరెడ్డి
గతంలో విధ్వంసమైన రెవెన్యూ వ్యవస్థను తిరిగి గాడిలో పెట్టేందుకు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలకు ధన్యవాదాలు తెలుపుతున్నట్టు టీజీఆర్ఎస్ఏ నూతన అధ్యక్షుడు బాణాల రాంరెడ్డి పేర్కొన్నారు. రెవెన్యూ శాఖలో క్షేత్రస్థాయిలో ఉద్యోగుల సంఖ్య తగ్గి, పనిభారం విపరీతంగా పెరిగిపోయిందని అన్నారు. గ్రామ, మండల, డివిజన్ స్థాయిలో పరిష్కరించాల్సిన రెవెన్యూ సమస్యలను గత ప్రభుత్వం రాష్ట్ర స్థాయికి తీసుకెళ్లిందని పేర్కొన్నారు. గ్రామస్థాయి రెవెన్యూ అధికారి లేకపోవడం వల్ల ప్రభుత్వ భూములు అన్యాక్రాంతం కాకుండా చూసే వారు లేరని అన్నారు. ఈ అంశాలను పరిగణనలోకి తీసుకున్న ప్రభుత్వం.. ప్రజలకు రెవెన్యూ శాఖను చేరువ చేస్తూ కొత్త రెవెన్యూ చట్టం చేస్తున్నదని అన్నారు. ఈ చట్టాన్ని టీజీఆర్ఎస్ఏ స్వాగతిస్తున్నదని, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి ధన్యవాదాలు తెలుపుతున్నామని పేర్కొన్నారు. రెవెన్యూ ఉద్యోగుల సమస్యల పరిష్కారమే లక్ష్యంగా టీజీఆర్ఎస్ఏ పని చేయనున్నట్టు తెలిపారు. ఆఫీస్ సబార్డినేట్ నుంచి డిప్యూటీ తహశీల్దార్ వరకు అన్ని స్థాయిల రెవెన్యూ ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి తమ సంఘం పని చేస్తుందని ఆయన తెలిపారు. సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి, సానుకూల నిర్ణయం తీసుకునేలా చొరవ తీసుకుంటామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ కలెక్టర్స్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి కె.రామకృష్ణ, టీజీటీఏ అధ్యక్షుడు ఎస్.రాములు, ప్రధాన కార్యదర్శి రమేశ్ పాక, సెక్రటరీ జనరల్ ఫూల్ సింగ్ చౌహాన్, మహిళా అధ్యక్షురాలు రాధ, కోశాధికారి శ్రీనివాస్ శంకర్‌రావు తదితరులు పాల్గొని ప్రసంగించారు.
టీజీఆర్ఎస్ఏ నూతన కమిటీ ఎన్నిక
టీజీఆర్ఎస్ఏ రాష్ట్ర నూతన కమిటీని ఈ సమావేశంలో ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అధ్యక్షుడిగా బాణాల రాంరెడ్డి, ప్రధాన కార్యదర్శిగా బిక్షం, కోశాధికారిగా మల్లేశ్, మహిళా విభాగం అధ్యక్షురాలిగా సుజాత చౌహాన్ ఎన్నికయ్యారు.