(దండుగుల శ్రీనివాస్)
ఎంత ఉవ్విళ్లూరినం. ఎంతగ ఎదురుచూసినం. ఇగ రేపోమాపో మా రామన్న జైలుకుపోతే సంబరాలు జేస్కునేందుకు రెడీ ఉన్నం. పటాకులు తెచ్చుకున్నం. మిఠాయిలు ఆర్డరేసినం. ఇగ జైలుకు పోతే సీఎం అవుడు పక్కా అనుకున్నాం. అంతా నిరాశనేనా..? జైలుకు పోవుడు లేనట్టేనా..? సలాకలు.. అవే జైలు ఊచలు లెక్కబెట్టడా..? షిట్ ఎంత పనైంది. అక్క పొయ్యొచ్చింది. అన్న పోకపోతే ఎట్ల. పోతడేమో పోతడేమో రోజూ ఎదురుజూసుడాయె.
ఇయ్యాల ఏకంగా రేవంతే మాట్లాడవట్టె. రామన్న ఢిల్లీకి వోయింది… మోడీ కాళ్లుమొక్కనీకంట. కేసుల నుంచి తప్పించుకోనీకంట. జైలుకు పంపకుండా గవర్నర్‌కు అనుమతినియ్యొద్దని బతిమాలేతందుకంట. అంటే పోయినపని సక్సెస్ చేసుకొచ్చిండన్నమాట రామన్న. మనకేమో అరె నేన్ జైలుకు వోతున్నరా..! పైలమన్నడు. వచ్చినంక మనదే రాజ్యమన్నడు. నేనే సీఎంఅన్నడు. ఈడనేమో చెయ్యండిరా అరెస్టు.. పంపండిరా జైలుకు.. అని తొడలు జరిచి.. ఆడనేమో వద్దు ప్లీజ్.. నన్నరెస్టు చెయ్యొద్దు ప్లీజ్ ప్లీజ్ అని బతిమాలుకుని వచ్చిండా..!
ఇదేందిదీ..! మరి మన రామన్న సీఎం కావడం కల్లేనా. రేవంత అన్నట్టు అక్క కాదు కదా సీఎం. ఛస్… పెద్దాయనకు అక్కంటే ఇష్టం లేదు. ఆమె పురాగా పార్టీకి చెడ్డ పేరు తెచ్చిందని గుస్సాగా ఉన్నడు. కొడుకు మీదే పాయిరం. కొడుకును సీఎం చేయాలనే కదా.. ఇంతా జేసింది.. జైలుకు పోతే గూడా మనలెక్కనే పెద్ద సారు కూడా సంబరపడేటోడు. ఫామ్‌హౌజ్‌ల పండుగ జేసేటోడు. కానీ ఇదేందిదీ..! రేవంతేమో ఇట్ల అంటుండు. అంటే.. అంటే…. రామన్నను జైలుకు పంపకుండా ఢిల్లీ పెద్దలు మోకాలు అడ్డం పెట్టిర్రా… సీఎం కావడం ఆళ్లకు కూడా సుతారమూ ఇష్టం లేనట్టుందిరా..!
ఆ పదేళ్లు అధికారంలో ఉండి మనకేమీ చెయ్యలే. ఈ చిన్నసారు సీఎం అయి చేసేదీ ఏం లే. అక్క ఇంటికి పోయి కల్వాలంటే గేటు కాడ కుక్కలెక్కల కావలి కాయలె.. పోరాబై ఇళ్లతో ఒచ్చిందేమీలేదు. ఉన్నది ఊడకొట్టుకునుడు తప్ప.