(దండుగుల శ్రీనివాస్)
ఓ బీఆరెస్ సానుభూతిపరుడు సోషల్ మీడియాలో ఓ పోస్టు పెట్టాడు. కేటీఆర్ అన్న పోరాటం ఫలించింది అని. ఎందుకు..? అదాని స్కిల్ యూనివర్సిటీకి కేటాయించిన వంద కోట్లను రేవంత్‌రెడ్డి వాపస్ ఇచ్చేస్తున్నాడని. అందుకట. ఇందులో పోరాటమేముంది..? గెలుపేముంది..? అంతా రాజకీయ ఆరాటమే తప్ప. అవును.. పక్కన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మాజీ సీఎం జగన్ తీసుకున్నట్టు లంచాలు తీసుకున్నారని ఇక్కడేమీ అభియోగాలు రాలేదు. మొన్న మొన్న ఏర్పడిన ప్రభుత్వం. ఇక్కడ అవినీతి జరిగేందుకు ఆస్కారమైతే లేదు. ఉంటే గింటే బీఆరెస్ సర్కార్‌కు, కేసీఆర్‌కు, కేటీఆర్‌కు ఉండాలె. కానీ ఇక్కడ ఇప్పుడైతే బీఆరెస్ అధికారం కోల్పోయిందో అప్పట్నుంచి కేసీఆర్, కేటీఆర్‌లో ఫ్రస్టేషన్ స్థాయిలు మాములుగా పెరగడం లేదు. వాటికి అంతూపొంతూ లేకుండా పోతోంది.
ఏడాది గడిచింది కానీ వాళ్లలో ప్రజలపై కోపం పోలేదు. రేవంత్‌పై కట్టి కట్టి దాడులు చేయడం మానలేదు. కేవలం పొలిటికల్ మైలేజీనే ఇంపార్టెంట్ అనే స్థితికి దిగజారిండ్రు. సరే అంతకుముందు రేవంత్ కూడా చాలా ఆరోపణలు చేశారు. తిట్టాడు. కానీ రేవంత్ అలా చేయడం సరికాదన్న వీరే ఇప్పుడు అంతకు మించి చేస్తున్నారు. తనదాకా వస్తే .. అన్నట్టుగా అటు కేసీఆర్ జనాలపై కక్ష గట్టి ఫామ్‌హౌజ్‌కే పరిమితమయ్యాడు. కేటీఆర్ ఓ సోషల్ మీడియా టీమ్‌కు లీడర్‌గా మారాడు. తనో పార్టీకి వర్కింగ్ ప్రెసిడెంట్ అనే విషయమే మరిచాడు.
ఇలా అధికార పార్టీ నుంచి, సీఎం నుంచి ఏదైనా కామెంట్ రాగానే కవితాత్మక ట్వీట్ ఒకటి తిట్టుకుంటూ కేటీఆర్ ఫేస్‌బుక్ వాల్‌పై వాలిపోతుంది. డబ్బులు ఇస్తే రెడీగా ఉంటారు చాలా మంది తమలో టాలెంట్ చూపించడానికి. తాజాగా ఇవాళ మహబూబ్‌నగర్‌లో జరిగిన మీటింగులో కూడా కేటీఆర్ మాట్లాడుతూ మాట తూలాడు. ఏమంటే…. ఏదో రేవంత్ మాయ మాటలకు మోసపోయాం… అట. జనాలనుద్దేశించి కేటీఆర్ అన్న మాటలివి. అంటే జనం అంటే అంత పిచ్చోళ్ల. కేవలం మాటలకే పడిపోయారా..? మీరు చేసిన పాపాలు, ప్రజల శాపాలేమీ లేవా..? ఇక్కడే వారింకా రియలైజ్ కాలేదని చెప్పడానికి సజీవ నిదర్శనం.
సరే.. ఇప్పుడు అదానీ వంద కోట్ల విషయానికొద్దాం. వందకోట్లు ఇచ్చింది స్కిల్ యూనివర్సిటీకి. అది కూడా ఈ అవినీతి తంతు బయట పడకముందు. దాన్ని సాకుగా చూపి బురద జల్లి అక్రమ సంబంధం అంటగట్టి పైశాచికానందం పొందడం ద్వారా ఎవరికి లాభం..?? పార్టీల పరంగా మీకు.. మానసికంగా వ్యక్తిగతంగా కేటీఆర్‌కు ఇది మంచి వార్తేమో. కానీ.. అది ఓ మంచి పని కోసం ప్రభుత్వం తలపెట్టిన కార్యక్రమానికి కాళ్లలో కట్టెపెట్టినట్టే. ఇదంతా పట్టించుకునే స్థితిలో కేటీఆర్‌లేడు. ఆయన మానసిక స్థితీ అలా ఆలోచించేలా లేదిప్పుడు. రేవంత్ కూడా లిస్టు బయటకు తీశారు.
మీరేమేమీ చేశారో.. ఎన్ని కాంట్రాక్టులిచ్చారో ఇదిగో అని. మరి ఆనాడు ఆ పనులకు కమీషన్లు తీసుకోలేదా..? కమీషన్లు తీసుకోకుండానే వేల కోట్ల పనులు ఫుక్కడ్‌గా ఇచ్చారా..? ఒక్కవేలు చూపెడితే మిగిలినవన్నీ మిమ్మల్నే చూపుతున్నాయి కేటీఆర్.. అంటే మారడు. వినిపించుకోడు. మేఘా కృష్టారెడ్డి విషయంలో కూడా ఇట్లనే ఏదో జరిగిపోయిందని గగ్గోలు పెట్టాడు కేటీఆర్. వేల కోట్లు కాంట్రాక్టులిచ్చి ఆ కృష్ణారెడ్డిని పెంచి పోషించింది కేటీఆర్, కేసీయారే. ఈ వందకోట్లు వెనక్కి పంపాం చూశావా..! అని విర్రవీగితే మాత్రం అంతకు మించిన పైశాచికత్వం మరోటి ఉండదు.