(దండుగుల శ్రీనివాస్)
మీడియాపై కస్సుమన్నారు సీఎం రేవంత్‌రెడ్డి. స్కిల్ యూనివర్సిటీకి అదానీ ప్రకటించిన కార్పస్ ఫండ్ వంద కోట్లు రానేరాలేదు.. అప్పుడే దీనిపై ప్రతిపక్షంతో కలిసి మీడియా గగ్గోలు పెడుతుందని ఆయన గుర్రుమన్నారు. ఆ నిధులు ప్రభుత్వానికి వచ్చేవి కావు…. సీఎం వ్యక్తిగత ఖాతాలో పడేటివి కావు.. అసలు అవి ఇంకా రానేలేదు.. అదానీ అవినీతి లొల్లి చూసినంక ఆ మరక మాకెందుకని మాకొద్దు బాబు.. నీ వందకోట్లు అని లేఖ కూడా రాసేశాం… అని వివరించారు సీఎం. మీరు కూడా దీనిపై రాద్దాంతం చేస్తున్నారు.. అంటూ మీడియాను సుతిమెత్తగా మందలించారు.
ఢిల్లీ వెళ్తున్నాం అనగానే అక్కడికి మంత్రివర్గ విస్తరణ కోసమని ఒకరు.. శాఖల మార్పు అని మరికొందరు రాసేసుకుంటున్నారు. అది రాజకీయ టూర్ కానేకాదు… అంటూ చెప్పుకొచ్చారు. చెప్పండి మీరు ఏఏ శాఖలు ఎవరికి కేటాయించారో.. అని చురకలు కూడా వేశారు. విలేకరులు అడిగిన ప్రశ్నలకు కూడా ఆయన తనదైన శైలిలోనే సమాధానమిచ్చారు.లగచర్ల లో ఫార్మా విలేజే పెడుతున్నారని కేటీఆర్ అంటుండని ఓ విలేకరి అడగగానే అరే వాడో పిచ్చోడు. వాడి మాటలను మీరెందుకు సీరియస్‌గా తీసుకుంటున్నారని కస్సుమన్నారు. లైట్ తీసుకోండి.. పట్టించుకోకండని హితవు పలికారు. కేటీఆర్ మైండ్ గల్లంతయ్యిందన్నారు.
అందుకే పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నారని, పక్కనున్నోళ్లే మావోడు ఏం మాట్లాడుతున్నాడో అర్థమైతలేదని చెప్పుకుంటున్నారని కేటీఆర్ అడిగిన ప్రశ్నల గురించి అడిగిన విలేకరులకు వివరించారు.