మహా గెలుపుతో
నెంబర్ టూ పొజిషన్‌కు బీజేపీ..
ఇక్కడ ప్రధాన ప్రతిపక్షంగా బీఆరెస్‌పై పైచేయి..
ఇక మరింత దూకుడుగా బీజేపీ శ్రేణులు..
బీఆరెస్‌కు కొరకరాని కొయ్యలా మారిన బీజేపీ..
(దండుగుల శ్రీనివాస్)
మహారాష్ట్ర ఎన్నికల ఘన విజయంతో ఇక్కడ బీజేపీ మరింత దూకుడు మీద ఉన్నది. తెలుగు ఓటర్లు కూడా ఉండే మహారాష్ట్ర ఎన్నికల ఫలితాల ప్రభావం తెలంగాణపై కూడా ఉంటుంది. దీంతో ఇక్కడి బీజేపీ శ్రేణులకు ఇది కొత్త ఉత్సాహాన్నిచ్చింది. ఇప్పటికే రాష్ట్రంలో రెండు ప్రతిపక్షాలు బీఆరెస్, బీజేపీ నువ్వా నేనా అన్నట్టుగా పోరాడుతున్నాయి. ప్రధాన ప్రతిపక్షం మేమంటే మేమని వారికి వారే కితాబిచ్చేసుకుంటున్నాయి. వాస్తవానికి బీఆరెస్‌కు ప్రధాన ప్రతిపక్ష హోదా ఉంది. కానీ ఈ నెంబర్ టూ స్థానాన్ని బీజేపీ కైవసం చేసుకోవడం ద్వారా రానున్న కాలంలో రాజకీయ భవిష్యత్తు మాదే అని చెప్పాలని తహతహలాడింది. ఇప్పుడు మహారాష్ట్ర ఫలితాలు బీజేపీకి కొత్త ఊపిరి పోశాయి.
బీఆరెస్‌ను కాదని బీజేపీ ప్రధాన ప్రతిపక్షంగా రాష్ట్రంలో సెటిల్ అయ్యేందుకు ఇక ఇదే మంచి తరుణమని భావిస్తోంది. ఇప్పటికే మూసీ వెంట పడ్డది బీజేపీ. ఆరు గ్యారెంటీల అమలుపైనా పోరాటం చేస్తున్నది. జనం నాడి తెలుసుకుని పోరాటం చేయాలని, కాంగ్రెస్‌కు ప్రత్యామ్నాయం మేమే అని చెప్పుకునేందుకు ఉవ్విళ్లూరుతున్నది. మరోవైపు బీఆరెస్‌కు బీజేపీ కొరకరాని కొయ్యలా మారింది. ఓ వైపు కేసీఆర్ ఫామ్ హౌజ్‌కే పరిమితం కావడం, కేటీఆర్ ను జైలుక పంపేదాక రేవంత్ వదిలేలా లేడనే వాతావరణం ఉన్న తరుణంలో బీజేపీకి మహారాష్ట్ర ఎన్నికల ఫలితాలు నెత్తిమీద పాలు పోసిన చందంగా మారాయి. ఇక మరింత దూకుడును పెంచనున్నాయి బీజేపీ శ్రేణులు. బీఆరెస్‌ను కాదని ఇక తామే రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్షం అని చాటి చెప్పేందుకు మరింత పగడ్బందీగా ముందుకు సాగనున్నారు బీజేపీ శ్రేణులు. పకడ్బందీ ప్రణాళికతో ప్రతిపక్ష పాత్ర పోషించిందుకు వ్యూహ రచన చేయనున్నారు.