(దండుగుల శ్రీనివాస్)
ఎందుకో కేటీఆర్ ఏం మాట్లాడినా అది వారికే తిరిగి తగులుతుంది. ఎందుకంటే పదేళ్లు అధికారంలో ఉండీ వారు చేసిన చేష్టలు, వ్యవహారాలు అలాంటివి మరి. ఇవాళ ఢిల్లీ వెళ్లి ప్రెస్‌మీట్ పెట్టాడు. అమృత్ టెండర్లలో సీఎం రేవంత్ రెడ్డి బామ్మర్దికి నిబంధనలకు విరుద్దంగా కాంట్రాక్ట్ ఇచ్చారని. సరే, దీనిపై విచారణ చేస్తారు. రద్దు చేస్తారు. ఇది కొంపలు మునిగే పనికాదు.. మీరు ఇలాంటివి చేయని సుద్దపూసలు కాదు. ఇప్పుడు అది కాదు విషయం. మహారాష్ట్ర ఎన్నికలకు తెలంగాణ సొమ్మును సీఎం రేవంత్ రెడ్డి తరలిస్తున్నాడని.
కాంగ్రెస్ సర్కార్ ఏర్పడి ఏడాది కూడా సంపూర్ణంగా పూర్తి కాలె. ఇక్కడ పథకాలు అమలు చేసేందుకే దిక్కు లేక నానా తంటాలు పడుతున్నాడు సీఎం. అన్నీ అరకొర పథకాలు.. దాటవేసే దోరణే ప్రభుత్వానిది. రైతుబంధు ఎగ్గొట్టారు. ఇప్పుడిస్తామని అన్నా.. అదెప్పుడిస్తారో తెలియదు. రుణమాఫీ కోసం ఆర్బాటం చేసి సగం ఇచ్చి ఇంకా సగం ఎత్తేసి రచ్చ రచ్చ చేసుకున్నారు. పెంపు పింఛన్ లేదు. టైమ్‌కు జీతాలు లేవు. రియల్ ఎస్టేట్ ఢమాల్ మన్నది. ఆదాయం లేదు. అంతా ఆగమాగం. ఈ సమయంలో మహారాష్ట్ర ఎన్నికలకు డబ్బులు పంపుతున్నాడనే ఆరోపణ, వాదనలో బలమైతే లేదు. కానీ ఈ మాటన్న కేటీఆర్‌కు మాత్రం గతం గుర్తు రాకపోవడం విషాదం.
కేసీఆర్ ఆనాడు తనకు మించినోడు లేడనుకున్నాడు. తెలంగాణ మొత్తం బంగారుమయం అయిపోయింది. ఇక్కడ అంతా తనను దేవుడిలా కీర్తిస్తున్నారు. ఇక దేశం మీద పడదామని టీఆరెస్‌ను బీఆరెస్‌గా మార్చేశాడు. ప్రధాని పదవికి నేనేమాత్రం తీసిపోను అనే రేంజ్‌లో కటింగ్ ఇచ్చాడు. ఓ ఇద్దరు బ్రోకర్లను అక్కడ మహారాష్ట్రలో పెట్టి ఇక్కడి నుంచి వందల కోట్లు, వేల కోట్లు అక్కడికి తరలించాడు. మరాఠాలను అంగట్లో గొర్రెల్లా కొనేశాడు. తన స్పీచులతో దంచి కొట్టాడు. మరాఠాలు కూడా పోలోమంటూ వచ్చి కండువాలు కప్పుకుని దేశ్‌కీ నేత అంటూ గుట్కా, ఖైనీలు వేసుకున్న నోళ్లతో వేనోళ్లపొగిడారు. ఇక తిరుగులేదనుకున్నాడు. లెక్కలు వేసుకున్నాడు. కేసీఆర్ ముందు ఊహించినట్టే జరిగి ఉంటే ఇప్పుడు మహారాష్ట్ర ఎన్నికల్లో బీఆరెస్ నిలబడి ఉండేది. ఇంకెన్నివేల కోట్లు తెలంగాణ సొమ్ము అక్కడ పారేదో.
ఏమైనా అంటే.. బీజేపీ వాళ్లు అన్నట్టు.. మోడీ, షా ద్వయం ఏమి చేసినా అది ధర్మం కోసం దేశం కోసం అన్నట్టు. వీళ్లు కూడా కేసీఆర్ ఏమి చేసినా.. అంతా తెలంగాణ కోసమే.. ఇక్కడి ప్రజల బాగోగుల కోసమే అనే ఓ కలరింగ్ ఇచ్చే డైలాగును వదలడం అలవాటుగా చేసుకున్నారు. తెలంగాణ తెచ్చుకున్న ది మమ్మల్ని బాగు చేయండిరా బేవకూఫ్ అంటే.. ఇలా ఇక్కడి నిధులన్నీ మరాఠాల దోసిళ్లలో పోసి మా బతుకును మన్ను పాలు చేశారు కదరా అని ఏడ్చేలా చేశాడు కేసీఆర్. ఇప్పుడు ఇవన్నీ గుర్తు చేసి మరీ తిట్టించుకోవాలా కేటీఆర్.,,!
ఇంకో ముచ్చట. మహారాష్ట్రలో ప్రాంతీయ పార్టీలకు ఓటేయండి.. జాతీయ పార్టీలకు వద్దు అని పిలుపు కూడా ఇచ్చాడు కేటీఆర్. మరి మీ పార్టీ జాతీయ పార్టీనా, లేక ప్రాంతీయ పార్టీనా..? ప్రాంతీయ పార్టీనే అని ఫిక్స్ అయిపోయి ఉంటారు.. ఘోర పరాభవ ఫలితం తరువాత. మరి ఇంక బీఆరెస్ అనే ఆ పేరెందుకు ..? అందరితో కుక్క తిట్టు తిన్నంక కూడా. మార్చేయవచ్చు కదా. మళ్లీ టీఆరెస్ అని పెట్టుకోవచ్చు కదా. పెట్టలేరా..? కేసీఆర్ ఒప్పుకోడా..? ఎందుకు…? ఆయన ఒక భాషానా..? ఒక్కసారి చెబితే వందసార్లు చెప్పినట్టు .. అంతేగా.. అయితే పేరు మార్చకండి. మీరు మారకండి. మిమ్మల్ని మార్చేస్తా ఉంటారు జనాలు.