(దండుగుల శ్రీనివాస్)
లుచ్చా కాంగ్రెస్ పార్టీకి ఓటేయొద్దని మహారాష్ట్ర ప్రజలకు చెప్పాలని ఆదిలాబాద్ రైతు మీటింగులో కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు వివాదస్పదమయ్యాయి. దీనిపై కాంగ్రెస్ శ్రేణులు భగ్గుమంటున్నారు. అయితే దీనికి కొనసాగింపుగా కేటీఆర్ మరో కామెంట్ చేశాడు. తాను మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంలో పాల్గొంటానని చెప్పాడు. అక్కడ బీఆరెస్ పోటీ చేయడం లేదు.కానీ కాంగ్రెస్‌కు ఓటేయొద్దు అని చెప్పడానికి ప్రచారం చేస్తాడట. ఇప్పుడు దీనిపై సోషల్ మీడియాలో కేటీఆర్ పై దుమ్మెత్తిపోస్తున్నారు.
అప్పుడు దేశానికే తెలంగాణ రోల్ మోడల్ అని చెప్పి ప్రధానంగా మహారాష్ట్రలో ఎంపీ సీట్ల కోసం ఏకంగా పార్టీ పేరునే మార్చిన చరిత్ర కేసీఆర్‌ది. ఇక్కడి నుంచి సొమ్మంతా తీసుకెళ్లి అక్కడ ఖర్చు పెట్టాడు. ఎడాపెడా అందరినీ కొనేశాడు. అందరిలో ఆశచూపాడు. రైతుబంధు మీకూ ఇస్తామంటూ మోచేతికి బెల్లం పెట్టాడు. అష్టలోపాల దళితబంధు స్కీమ్‌ను ఇక్కడే తూతూ మంత్రంగా ప్రవేశపెట్టి.. ప్రపంచంలోనే ఎవడూ ఈ విధంగా దళితులకు పదిలక్షలు ఇవ్వడం లేదంటూ ఊదరగొట్టాడు. అక్కడ మరాఠీలు మరీ ఆశలు పెంచుకున్నారు. దొరికినోళ్లకు దొరికినట్టు కండువాలు కప్పేశాడు. ఎడాపెడా మీటింగులు పెట్టాడు. ఎమ్మెల్యేలను అక్కడ ఇంచార్జిలుగా పెట్టి ఇక్కడి సొమ్మంతా తరలించాడు. కానీ ఇక్కడ జనాల్లో వీరి చేష్టల పట్ల ఎమ్మెల్యేల తీరు పట్ల తీవ్ర వ్యతిరేకత ఏర్పడింది.
అది తెలిసినా అహంకారంతో సిట్టింగులకే టికెట్లిచ్చాడు కేసీఆర్. దేశంలో చక్రం తిప్పుతా అని ఇక్కడి సొమ్మంతా తరలించిన కేసీఆర్.. తెలంగాణలో తీవ్ర వ్యతిరేకత వచ్చిందని తెలిసినా ఏవో అంచనాలు వేసుకున్నాడు. జనాలను తక్కువ అంచనా వేసి బొక్క బోర్లా పడ్డాడు. ఇక్కడ పార్టీ అధికారం కోల్పోగానే మహారాష్ట్రలో బీఆరెస్‌లో చేరిన నేతలంతా తలోదిక్కు పారిపోయారు. ఇప్పుడు ఆ ఎన్నికల్లో కేటీఆర్ వెళ్లి కాంగ్రెస్‌కు ఓటెయ్యొద్దని ప్రచారం చేస్తాడట. కాంగ్రెస్‌కు ఓటెయ్యద్దంటే బీజేపీకి వెయ్యమనేగా అర్థం. అంటే పరోక్షంగా అక్కడ బీజేపీని లేపుతున్నాడన్నమాట. ఆ ఎఫెక్టు తెలంగాణలో కూడా ఉంటుందని మరిచాడు. అంటే కేటీఆర్ పనిగట్టుకుని బీజేపీని లేపుతున్నాడమన్నాట. ఇలా అర్థంపర్థం లేని వ్యాఖ్యలతో చేష్టలతో మరింత పలుచనవుతున్నాడు కేటీఆర్.