(దండుగుల శ్రీనివాస్)
రుణమాఫీపై రేవంత్ రాంగ్ స్టెప్ వేశాడు. అది అధిష్టానం గుర్తించింది. కొండంత రాగం తీసి.. పార్టీ పరువును తీసేవిధంగా, రైతులతో అంతరం పెంచుకునే విధంగానే రేవంత్ ఆలోచన చేశాడు. ఆ నష్టం పార్టీకి జరిగింది. దాన్నుంచి కోలుకోక ముందే హైడ్రా అంటూ అక్రమ కట్టడాలని, చెరువుల పునరుద్దరణ అని సంఘ సంస్కర్త వేషం గట్టాడు. ఈ బొమ్మ అట్టర్ ఫ్లాప్ అయ్యింది.
ఇలా వరుస తప్పిదాలు చేస్తూ వస్తున్న రేవంత్ పై సొంత పార్టీలో అగ్గి రాజుకుంటున్నది. అసలే ఎక్కడ్నుంచి వచ్చాడో మా పార్టీలో సీఎం అయ్యాడనే గరం ఉండనే ఉంది. సీనియర్ల లోలోపల రగిలే మంటలు ఉండనే ఉన్నాయి. సీఎం నేనంటే నేననే స్వేచ్చ వాతావరణం ఇబ్బడిముబ్బడిగా ఉన్న పార్టీనాయే. ఇంకేముంది..? ఇలా ఆదిలోనే రాంగ్ స్టెప్స్ వేస్తున్న రేవంత్‌పై ఇక దాడికి దిగరా..? పీకల్లోతు కోపంతో , సమయం కోసం ఎదురుచూస్తున్నారంతా. పీసీసీ చీఫ్ మహేశ్‌కుమార్ గౌడ్ .. సీఎం చర్యలపై నజర్ పెట్టాడు. హైడ్రా, మూసీ ఆపరేషన్ పార్టీకి తీవ్ర నష్టం వాటిల్లేలా ఉందని గ్రహించాడు. అందుకే ఆయన సపరేట్‌గా గ్రేటర్ ఎమ్మెల్యేలతో మీటింగ్ పెట్టి అసలు విషయం అధిష్టానానికి చేరవేశాడు.
ఈటల రాజేందర్ తాజాగా అన్న మాటలు కూడా వైరల్ అవుతున్నాయి. రేవంత్‌కు అసలు అనుభవమే లేదని, ఇంత వరకు కనీసం మంత్రిగా చేసిన వాడు కూడా కాదని, చెరువులను కాపాడుకోవాలంటే ఎడాపెడా కూలగొట్టడం కాదని, పట్టాభూములకు పరిహారం అందించి వాటిని స్వాధీనం చేసుకోవాలనే సోయి కూడా లేదని ఘాటుగానే వ్యాఖ్యలు చేశాడు. ఇప్పుడు ఇలాంటి వ్యాఖ్యలకు సొంత పార్టీలోనే మద్దతు లభించే వాతావరణం ఉంది. రేవంత్‌ను ఎవరెంత తిట్టిపోస్తే అంత సంతోషిస్తున్నారు సొంత పార్టీ నేతలు, సీనియర్లు, మంత్రులు. కానీ లోలోపల వారికీ భయం పట్టుకుందండోయ్…! ఎందుకంటే.. రేవంత్ ఇవాళ వస్తాడు, పోతాడు.. కానీ పార్టీకి లేక లేక అధికారం వస్తే రేవంత్ వల్ల ప్రజల వ్యతిరేకతకు బలై అధికారం కోల్పోతామోనని.
చంద్రబాబు దోస్తు, రేవంత్‌కు ఆప్తుడు ఆంధ్రజ్యోతి ఆర్‌కే కూడా ఇవాళ తన కొత్త పలుకులో రేవంత్ జర జాగ్రత్త అని హెచ్చరించాడు కూడా. హితబోధ చేయడమే కాదు.. వెంటనే హైడ్రాను ఆపేయమన్నాడు. మూసీ అవసరమా దాని వల్ల మరింత నష్టం జరుగుతుంది ప్రభుత్వానికి అని కూడా వాపోయాడు. కేటీఆర్ దీన్ని ప్రజల్లోకి తీసుకోకముందే మేల్కోండి లేకపోతే మళ్లీ బీఆరెస్ వస్తుంది.. అలా ఎట్టి పరిస్థితుల్లో కూడా జరగొద్దు సుమా అని వాపోయి, బాధపడి, హెచ్చరించి, కసురుకుని, బుజ్జగించి, బతిమాలి, భయపడి.. డిమాండ్ చేసి అడుక్కుని… ఇలా అన్ని చేశాడంటే పరిస్థితి తీవ్రత ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు.