(దండుగుల శ్రీనివాస్)
అసలు సంగతి ఖజానా ఖాళీ. మరి రుణమాఫీ చేస్తానని రేవంత్ అంత ధైర్యంగా ఎలా ప్రకటించాడు. కొండంత రాగం తీసి.. సగం మందికి కూడా రుణమాఫీ చేయలేదెందుకు..? రైతుల నుంచి వ్యతిరేకత ఈస్థాయిలో ఉంటుందని రేవంత్ అంచనా వేయలేకపోయాడా..? అందుకే వెంటనే తేరుకుని సర్వే పేరుతో రైతులను కూల్ చేస్తున్నాడా..? ప్రస్తుత పరిస్థితులు చూస్తే ఇవే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. ఆర్మూర్ రైతులు ఐక్యవేదికగా ఏర్పడి ఆందోళన చేసిన తరువాత రుణమాఫీ గురించి రైతులు క్షేత్రస్థాయిలో ఎంత సీరియస్ ఉన్నారో సర్కార్‌కు అర్ధమయ్యింది.
అందుకే వెంటనే సర్వే పేరుతో వ్యవసాయాధికారులను రంగంలోకి దింపాడు. వారంతా ఫోటోలు తీసుకోవడం, ఎంక్వైరీ పేరుతో అలా రోజులు గడుపుతున్నారు. కానీ ఈ సర్వే ఎప్పటి వరకు చేస్తారు..? రుణం మాఫీ కాని రైతులకు ఎప్పటి వరకు క్లియర్ చేస్తారో చెప్పడం లేదు. అది ప్రభుత్వానికి తెలియదు. ఇంకా కచ్చితంగా చెప్పాలంటే ఇప్పటి వరకు అయ్యిందే రుణమాఫీ. ఇకపై ఉండబోదు.ఇలా అంటే సర్కార్‌ను బద్నాం చేసినట్టువుతుందని అనుకోవచ్చు. కానీ జరుగుతున్నదదే. జరగబోయేదీ అదే.
వ్యవసాయశాఖ మంత్రే ఖుద్దు రేషన్‌కార్డు ప్రామాణికమని ఆఫ్‌ది రికార్డులో చెప్పాడట. ఇంక డౌట్‌లేమున్నాయి. ఇప్పటి వరకు రుణమాఫీ అయ్యింది కూడా రేషన్‌కార్డులున్నవారికే. ఇప్పుడు చేస్తున్న సర్వే చేస్తున్నది కూడా రేషన్‌కార్డు లేనివారికే. కానీ వీరందరికీ రుణమాఫీ కావాలంటే మరో 12వేల కోట్లు కావాలి. అంత సొమ్ము ఖజానాలో ఎక్కడిది. అందుకే ఇది సాధ్యం కాదు. మరి రైతుల ఆందోళన బాట పట్టరా..? మొదట ఉన్నంత వేడి ఇప్పుడు లేదనే చెప్పాలి . ఎందుకంటే సర్వే వారిలోని కోపంపై కొంత నీళ్ల చల్లే ప్రయత్నం చేస్తన్నది.
రేవంత్ వ్యూహం కూడా ఇదే. అందుకే ఆయన ఈ ఇష్యూను పెద్ద సీరియస్‌గా తీసుకోవడం లేదు. ఇదంతా ఓ డ్రామాగానే చెప్పాలి. ఆర్మూర్ రైతులు సర్కార్‌కు ఈనెల 15 వరకు ఆల్టిమేటం ఇచ్చారు. ఆ తరువాత ఉద్యమం మరింత ఉధృతం చేస్తారా..? రేపు మాపో మాకూ వస్తాయిలే.. రుణమాఫీ అయితీరుతుంది లే అని చల్లబడతారా చూడాలి.