ఇక జిల్లాల్లో కూడా హైడ్రా హల్‌చల్..!
కలెక్టర్ల చేతికి పగ్గాలిచ్చిన సీఎం రేవంత్..!!
కాంగ్రెస్ లీడర్లదే హవా.. బీఆరెస్ అక్రమకట్టడాలే టార్గెట్…!!
త్వరలో జిల్లాల్లో హైడ్రా ఆపరేషన్ షురూ..!
భారీ వర్షాల నేపథ్యంలో హైడ్రాకు పెరిగిన మద్దతు..
స్టాండ్ విత్ హైడ్రా అంటూ మద్దతుల వెల్లువ..
వాస్తవం ప్రధాన ప్రతినిధి- హైదరాబాద్:
ఓ వైపు భారీ వర్షం. మరోవైపు పొంగిపొర్లుతున్న వాగులు, వంకలు. జనావాసాల్లోకి భారీ వరద నీరు. ఇళ్లన్నీ జలమయం. ఇవన్నీ చూసిన తర్వాత అందరి మదిలో తట్టింది హైడ్రానే. ఎందుకు..? చెరువులు, కుంటలు ఆక్రమించేసి ఎడాపెడా అక్రమ నిర్మాణాలు, బహుళ అంతస్తుల భవనాలు కట్టేసిన పాపమే ఇలా ఇళ్లలోకి, కాలనీల్లోకి వరద నీరు వస్తుందని జనం డిసైడ్ అయిపోయారు. ఈ నేపథ్యంలో సీఎం రేవంత్ ఏర్పాటు చేసిన హైడ్రా.. అది హైదరాబాద్‌లో కూల్చిన అక్రమ నిర్మాణాలు గుర్తుకు వచ్చి బహుబాగు ఇలా చేస్తేనే తప్ప వరదల ప్రమాదాలు, ఇబ్బందులకు మోక్షం లేదనే విధంగా చర్చించుకుంటున్నారు.
స్టాండ్ విత్ హైడ్రా అంటూ అన్ని వర్గాల నుంచి మద్దతు కూడా లభిస్తోంది. ఇదే క్రమంలో సీఎం రేవంత్ దీన్ని జిల్లాలకు విస్తరించేందుకు నిర్ణయం తీసుకున్నట్టు సంచలన ప్రకటన చేయడంతో ఇది చర్చనీయాంశమైంది. జిల్లా కలెక్టర్లకే ఈ బాధ్యతను అప్పగించాడాయన. ఇక జిల్లాలో బీఆరెస్ నేతల అక్రమ నిర్మాణాలే టార్గెటెడ్‌గా హైడ్రా చర్యలు ప్రారంభం కానున్నాయి. ఇది పక్కా కక్షసాధింపు చర్యలా మారే అవకాశమూ ఉంది. వసూళ్లు చేసుకునేందుకు ఏర్పాటు చేసుకున్న బంగారు బాతులాగా కూడా మారనుంది. మంత్రులు, కాంగ్రెస్ లీడర్ల చెప్పుచేతల్లో జిల్లాల్లో ఏర్పాటయ్యే హైడ్రా నడవనుంది.
హైదరాబాద్‌లో అంటే ఇక్కడ అందరి కళ్లూ ఉన్నాయి. అక్రమాలు, అవినీతి జరిగితే ప్రశ్నించేవారున్నారు. సీఎంకు చెడ్డ పేరు వస్తుందనే భయం ప్రభుత్వానికి , ఆ పార్టీకి ఉంది. కానీ జిల్లాల్లో అదుండదు. టార్గెటెడ్ దాడులు, అక్రమ వసూళ్లు, రాజకీయ కక్షసాధింపు.. ఇవన్నీ కంపు కంపు చేయనున్నాయి. ముందు ముందు జరిగేదదే. కలెక్టర్లు, ఎస్పీలు కూడా ఏమీ చేయలేని పరిస్థితులు అక్కడ నెలకొని ఉంటాయి.