Dandugula Srinivas

Senior Journalist

8096677451

ధరణిని బంగాళఖాతంలో కలిపే అవసరం లేకుండానే కొన్ని సంస్కరణలతో పేద రైతుకు మేలు జరిగేలా చేయొచ్చు. ఎన్నో ఏండ్లుగా పెండింగ్‌లో ఉన్న భూ సమస్యలకు పరిష్కారం చూపి చిన్న రైతులకు మేలు చేయడంతో పాటు .. ఆర్థికంగా క్లిష్ట పరిస్థితుల్లో ఉన్న ప్రభుత్వానికి ఆదాయమూ సమకూరే మార్గం కళ్లముందే ఉన్నది. ఇదే విషయాన్ని కలెక్టర్లు కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకొస్తున్నారు. ప్రభుత్వం ఏర్పడిన తరువాత తొలిసారిగా రేపు (మంగళవారం) కలెక్టర్లతో సీఎం రేవంత్‌రెడ్డి కలెక్టర్లతో సచివాలయంలో కాన్ఫరెన్సు నిర్వహించనున్నారు. కీలకమైన తొమ్మిది అంశాలపై కలెక్టర్లతో చర్చించనున్నారు.

ప్రజాపాలనను అందించే క్రమంలో ఇప్పుడిప్పుడే సర్కార్‌ తొలిఅడుగులు వేస్తున్న నేపథ్యంలో ఈ కాన్ఫరెన్సు ప్రాధాన్యతను సంతరించుకున్నది. ప్రధానంగా ఇందులో ధరణి పై చర్చించే అవకాశాలున్నట్టు తెలుస్తున్నది. ధరణిలో తిరస్కరణకు గురవుతున్న దరఖాస్తులన్నీ దాదాపుగా అసైన్డ్‌ భూముల (పీవోటీ) రెగ్యులరైజేషన్‌, సాదాబైనామా కింద ఉన్న వాటిని పట్టా చేసేవే ఉన్నాయి. ప్రతీ వంద దరఖాస్తుల్లో 60 నుంచి 70 తిరస్కరణకు గురవుతున్నవి ఇవే. దీని వల్ల తీవ్ర ఇబ్బందులు పడుతూ కలెక్టరేట్ల చుట్టూ తిరుగుతున్నది పేద రైతులే. పెద్ద రైతులు ఏదో మార్గంలో తమ పనులు కానిచ్చేస్తున్నారు.

ఫైరవీలకు దారులు వెతుక్కున్నారు. నాయకులకూ ఇది సంపాదించి పెట్టే మార్గంగా మారింది. కానీ పేద రైతులు మాత్రం ఏళ్ల తరబడి తిరుగుతూనే ఉన్నారు. కలెక్టర్లకు మాత్రమే ధరణి దరఖాస్తులపై పూర్తి బాధ్యతలు అప్పగించడం కూడా పేద రైతుకు శాపంలా మారింది. కొంత మంది కలెక్టర్లకు ధరణి కాసుల వర్షం కురిపిస్తున్నది. ధరణిని పూర్తిగా ఎత్తివేయడం సాధ్యం కాదనేది సర్కార్‌ పెద్దలకు అర్థమయిపోయింది. అలాంటప్పుడు కొత్త చట్టం తెస్తామని మరింత కాలయాపన చేసే బదులు.. ప్రధానంగా ఇప్పటి ధరణిలో ప్రధాన ఆటంకం, అవినీతికి ఆలవాలంగా మారిన పీవోటీ యాక్టు, సాదాబైనామా విషయంలో క్రమబద్దీకరణకు ప్రభుత్వం ఓకే చెబితే రెండు రకాల ప్రయోజనాలు సమకూరుతాయనే అభిప్రాయాలున్నాయి.

అసైన్డ్‌ భూములను , సాదా బైనామాలను రెగ్యులరైజ్‌ చేస్తే ఏళ్ల తరబడి అపరిష్కృతంగా పెండింగ్‌లో ఉన్న ఈ సమస్యలకు శాశ్వత పరిష్కారం దొరకడంతో పాటు ప్రభుత్వానికి గణనీయంగా ఆదాయం కూడా సమకూరుతుందనే అభిప్రాయన్ని కొంత మంది సీనియర్ ఐఏఎస్‌ ఆఫీసర్లు వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 50 లక్షల ఎకరాల వరకు అసైన్డ్‌ భూములన్నాయి.

వీటిపై నిత్యం ధరణిలో దరఖాస్తులు వస్తూనే ఉన్నాయి. పీవోటీ యాక్టును అనుసరించి వీటిని అధికారులు తిరస్కరిస్తూనే ఉన్నారు. తహసీల్దార్లకు ధరణిలో అధికారాలు తీసివేయడం మూలంగా పేదరైతులు ఈ సమస్యలపై కలెక్టర్‌ను కలిసే వీలు లేకుండా పోతోంది. మండల స్థాయిలో పరిష్కరించబడే ఈ సమస్యలు కలెక్టర్‌ వద్దకు తెచ్చి పెట్టింది గత ప్రభుత్వం. దీన్ని నిబంధనల ప్రకారం పరిష్కరించలేక చాల మంది రిజెక్ట్‌ చేస్తుండగా.. కొంత మంది మాత్రం ఫైరవీల ద్వారా వీటిని క్లియర్‌ చేసుకుంటున్నారు.