పెన్షన్‌ పెంపు విషయంలో ఇచ్చిన హామీని నిలబెట్టుకునేక్రమంలో పడుతున్న తిప్పలు… ప్రభుత్వాన్ని మరింత ముప్పుతిప్పలు పెడుతున్నాయి. గత సర్కారు ఇచ్చిన 2వేల ఆసరా పెన్షన్‌ను 4వేలకు పెంచి ఇస్తామన్న కాంగ్రెస్‌ హామీ అమలు అంత ఈజీ ఏమీ కాదు. ఇప్పటి పాత పెన్షన్లు నెలవారీగా ఇవ్వడానికే వెయ్యి కోట్ల మేర భారం పడుతున్నది. 4వేల పెన్షన్‌ ఇవ్వాలంటే రెండు వేల కోట్ల వరకు భారం పడనున్నది. అందుకే ఆసరా పెన్షన్లు తీసుకుంటున్న వారిలో అనర్హులుగా చాలా మంది ఉన్నారు.. వీరిని తొలగిస్తామని ప్రభుత్వం ఇటీవల ప్రకటించింది.

ఇందులో మొదటగా సర్వీసు పెన్షన్లు అందుకుంటున్న వారిపై నజర్ పెట్టింది. ట్రెజరీ కార్యాలయాల్లో ఆధార్‌ నెంబర్‌తో ఎంక్వైరీ మొదలు పెట్టింది. జిల్లాల వారీగా డీఆర్‌డీవోలకు ఉత్తర్వులు జారీ చేసింది సర్కార్‌. నెల రోజుల గడువులోగా వీరిని గుర్తించి రికవరీ నోటీసులు ఇవ్వాలని ఆదేశాలిచ్చింది. ఇదంతా ఇప్పుడు ఎందుకు బయటకు వచ్చిందంటే… భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 80 ఏళ్ల పక్షపాత వ్యాధిగ్రస్తురాలైన ఒంటరి వృద్ధ మహిళ దాసరి మల్లమ్మ సర్వీస్‌ పెన్షన్‌తో పాటు ఆసరా పెన్షన్‌ కూడా తీసుకుంటున్నదనే కారణంతో రూ. 1.72 లక్షలను తిరిగి చెల్లించాలని రికవరీ నోటీసులివ్వడం రాజకీయ వివాదానికి తెరలేపింది. దీనిపై కేటీఆర్‌ స్పందించారు. కొండనాలుకకు మందేస్తే ఉన్న నాలుకు ఊడిందన్నట్టుగా నాలుగు వేల రూపాయల పెన్షన్‌ ఇవ్వలేని సర్కార్‌.. ఉన్న వాటిని తొలగించి రికవరీ చేస్తున్నదని మండిపడ్డారు.

ఇప్పటికే సర్కార్‌ నెలవారీగా టంచన్‌గా పెన్షన్‌ ఇవ్వడం లేదు. ఏప్రిల్‌ మాసం పెన్షన్‌ ను ఇచ్చి.. మే, జూన్‌ నెలలవి పెండింగ్‌లో పెట్టింది. జూలై మాసం కూడా గడిచిపోతున్నది. ఇంతటి జాప్యం నేపథ్యంలో ఇంకా పెన్షన్‌ రావడం లేదనే ఎదురుచూపుల నడుమ సర్కార్‌ తీసుకున్న ఈ పెన్షన్‌ రికవరీ నిర్ణయం వారిలో మరింత అసహనాన్ని, ఆగ్రహాన్ని తెప్పిస్తున్నది. సర్వీస్‌ పెన్షన్‌ అందుకుంటున్న వారికి ఆసరా ఇవ్వొద్దు.. నిజమే..! కానీ ఇచ్చారు. ఎంపీడీవోల తప్పిదం ఇది. అప్పటి రాజకీయ ఒత్తిళ్లు అలా ఉన్నాయని వారు సమర్థించుకోవచ్చు గాక.. కానీ ఉరుము ఉరిమి మంగళం మీద పడ్డట్టు.. సర్కార్‌ ఇప్పుడు ఈ పండుటాకుల మీద ప్రతాపాన్ని చూపడం ఏ ఒక్కరూ హర్షించేది కాదు.

రికవరీ నోటీసులిచ్చినా.. వారి నుంచి నయాపైసా కూడా రికవరీ కాదు. అది సర్కార్‌కూ తెలుసు. మరి ఇంత మాత్రానికి ఇంతలా రచ్చ చేసుకోవడం అవసరమా..? రాజకీయంగా ప్రతిపక్షానికి అస్త్రాన్ని అందిచడమే తప్ప. దాదాపు ఇలాంటి వారు రాష్ట్ర వ్యాప్తంగా ఏడు వేల మంది వరకు ఉన్నట్టు గుర్తించారు. వీరికి నోటీసులు పంపుతున్నారు. ఎలాగూ ఆసరా నుంచి తీసేస్తారు. ఇప్పుడొచ్చిన లొల్లంతా ‘రికవరీ’ మీదే. సైలెంట్‌గా వారిని లిస్టు నుంచి తొలగించి ఆర్థిక భారం తగ్గించుకుంటే సరిపోయేది. అధికారులకు మరీ నెలరోజుల టార్గెట్‌ ఇచ్చి రికవరీ చేయాలని ఆదేశించడం తాను తీసిన గోతిలో తానే పడ్డట్టవుతుంది తప్ప ప్రయోజనం ఏమీ ఉండదు.