దండుగుల శ్రీనివాస్‌ – తెలంగాణ బ్యూరో :

‘వాస్తవం’ ముందే చెప్పింది. కాంగ్రెస్‌ సర్కార్‌ ఇచ్చిన హామీలు అమలు చేసే ప్రతీ పథకంలో కండిషన్స్‌ అప్లై అంటూ ఆంక్షల వలయం ఉంటుందని. ఇప్పుడు అదే నిజమవుతున్నాయి. ఒక్కొక్కటిగా పథకాలు అమలు చేస్తున్నామని చెప్పుకునే క్రమంలో సవాలక్ష ఆంక్షలు, కండిషన్లు పెట్టి ఏదో అలా ఇగో చేశాం చూశారా అంటూ చేతులెత్తేసే కార్యక్రమమే ఈ సర్కారూ చేస్తోంది. పథకాలన్నీ ఒకెత్తయితే రైతుల పథకం మాత్రం వేరే వాటికి డిఫరెంట్‌. ఎందుకంటారా..! అంతే మరి రైతులతో పెట్టుకున్న సర్కార్‌ ఏదీ నిలవలేదు. గెలవలేదు. బతికి బట్ట కట్టాలేదు. గతంలో కేసీఆర్‌ సర్కార్‌కు ఇది మంచి నిదర్శనం.

లక్ష రుణమాఫీ చేస్తానని హామీ ఇచ్చి.. దాన్ని లాగీ లాగీ చివరకు ఎన్నికల సమయంలో ఏదో కొంత చేస్తే జనాలు మరిచిపోయి సంబరపడి ఓట్లు వేస్తారు కదా అని నక్క వినయాలకు పోయి బొక్కబోర్లా పడ్డాడు కేసీఆర్‌. రైతులను తక్కువ అంచనా వేశాడు. అప్పటి ఎన్నికలు గట్టెక్కితే చాలనుకున్నాడు. హామీల అమలుపై ఇలా నిర్లక్ష్యం వహించాడు. మధ్యలో గొప్పలకు పోయి దళితబంధు అంటూ ఏవేవో అలవిమాలిన పథకాలు తెచ్చి ఖజానాకు బొక్క పెట్టాడు. రుణమాఫీ విషయానికి వచ్చే సరికి చేతులెత్తేశాడు. రైతుబంధు ఇస్తున్నా కదా చచ్చినట్టు వేస్తారులే అని ఓవర్‌ కాన్ఫిడెన్స్‌కు పోయాడు. ఎన్నికల వేళ రైతుల సెగ తగిలి బీఆరెస్‌ బూడిదయ్యింది.

ఇప్పుడు అదే బాటలో రేవంత్‌ పయనిస్తున్నాడు. ఎంతైనా కేసీయారే రేవంత్‌కు ఆదర్శం కదా. పంద్రాగస్టులోపు రెండు లక్షల రుణమాఫీ చేసి తీరుతా అని ఎంపీ ఎన్నికలు గట్టేందుకు ఏవో శపథాలు చేసి గుళ్ల మీద ఒట్లేసుకుని జనాలను నమ్మించే ప్రయత్నం చేశాడు. ఇప్పుడు ఓడదాటినాకా బోడి మల్లన్న అన్న చందంగా రుణమాఫీకి కటాఫ్‌ డేట్‌ పెట్టాడు. 2018 డిసెంబర్‌ 12 నుంచి 2023 డిసెంబర్ 9 కటాఫ్‌ డేట్‌ పెట్టి ఆలోపు రుణాలు తీసుకున్న వారికి మాత్రమే రుణమాఫీ చేస్తామని ప్రకటించేందుకు సర్వం సిద్దం చేసుకున్నాడు రేవంత్‌. అంటే.. అంతకు ముందు కేసీఆర్‌ హామీ ఇచ్చి బొక్క పెట్టిన బకాయిలు ఈ సర్కార్‌కు పట్టిలేదన్నమాట. మరి ఆ అప్పు సంగతేంగాను.

బ్యాంకర్లు రైతులను వదిలేలా లేరు. క్రాప్ లోన్లకు ఈ బకాయిలు పెద్ద గుదిబండలా మారాయి. ఒకవేళ ఇచ్చినా పాత బకాయిలు కట్‌ చేసుకుని మిగిలిన పదో పరకో చేతిలో పెట్టి పంపుతున్నారు. డీసీసీబీ బ్యాంకు అధికారులైతే ఎర్ర జెండాలు, వేలం వేస్తాం రోయ్‌.. కడ్తారా కట్టరా అనే ఫ్లెక్సీలు పెట్టుకుని మరీ పొలాల వెంట తిరుగుతున్నారు. అప్పుడు కేసీఆర్‌, ఇప్పుడు రేవంత్‌ రాజకీయాలకు మధ్యలో బలైపోతున్నది రైతులే. కానీ రైతుల ఉసురు తగిలిన సర్కార్‌ ఏదీ మనలేదు. నిలవలేదు. ఇది రేవంత్‌ సర్కార్ గుర్తెరిగితే ఆ పార్టీకే మేలు. ఏం చెయ్యలేం. మా హామీలు అలా ఉన్నాయి. ఖజానా ఇలా ఉంది… అని సాకులు వెతుక్కున్నారా.. మీ గొయ్యి మీరే తీసుకున్నట్టు బహు పరాక్‌..!

 

Dandugula Srinivas

Senior Journalist

8096677451

You missed