ఆకుల లలిత పై జిల్లా కాంగ్రెస్ నేతలు ప్రతీకారేచ్చ తీర్చుకున్నారు. గత ఎన్నికల్లో ఆమె పార్టీకి ఇచ్చిన షాక్‌ను మరిచిపోలేదు. అది కడుపులో పెట్టుకుని ఇప్పుడు వెంటాడి వేటాడి ఆమెపై ప్రతీకారం తీర్చుకున్నారు. ఇదిప్పుడు ఇందూరు రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది. అర్బన్ కాంగ్రెస్ టికెట్ ఆశించి ఆకుల లలిత బీఆరెస్‌కు రాజీనామా చేసింది. కానీ ఇక్కడ లోకల్ నేతలు ఆమె రాకను అడ్డుకున్నారు. ఆనాడు ఆర్మూర్ కాంగ్రెస్ సీటు గెలిచేదాన్ని జీవన్‌రెడ్డికి అమ్ముడుపోయి వెనక్కి తగ్గిన వైనాన్ని గుర్తు చేస్తూ అధిష్టానం దగ్గర పెద్ద ఫైటే చేశారు. మొదట అధిష్టానం హామీతోనే బీఆరెస్‌కు రాజీనామా చేసిన ఆకుల లలిత టీమ్‌కు.. తీరా కాంగ్రెస్‌లో చేరే సమయానికి చుక్కలు చూపించారు నేతలు.
దీంతో వారికే ఝలక్ ఇచ్చేందుకు ఆకుల లలిత జిల్లాలో రాహుల్ పర్యటన ఉన్నా.. పెద్దపల్లిలో చేరేందుకు అక్కడికి వెళ్లింది. కానీ కుదరలేదు. కరీంనగర్ వెళ్లింది. అక్కడా కుదరనీయలేదు. దీంతో చేదు అనుభవం తోడు రాగా తిరుగుముఖం పట్టాల్సి వచ్చింది. ఉదయం నుంచి ఇదే హైడ్రామా కొనసాగింది. మాజీ మంత్రి సుదర్శన్‌రెడ్డి కూడా ప్రెస్‌మీట్‌లో ఆకుల లలిత ఎవరు.. మాకు సంబంధం లేదు అనే విధంగా మీడియాకు ఆన్సర్ ఇవ్వడం కూడా.. వీరంతా కూడబలుక్కుని లలిత రాకను తీవ్రంగా వ్యతిరేకించినట్టు తెలుస్తోంది. సహజంగా రాజకీయాల్లో ఇవన్నీ పట్టించుకోరు. గెలిచే అభ్యర్థులకు ఇద్దామనుకుంటారు. అర్బన్‌లో మున్నూరుకాపుల ఓట్లు బాగా ఉన్నాయి. కాంగ్రెస్ హవా కూడా కొనసాగుతుంది కాబట్టి మైనారిటీ ఓట్లు కూడా తోడు వస్తే గెలుపు ఖాయంగా భావిస్తున్నారు.
ధర్మపురి సంజయ్ దీన్ని పరిగణలోకి తీసుకునే టికెట్ ఆశించాడు. కానీ ఇప్పుడు ఆకుల లలితను అడ్డుకున్న టీమే.. సంజయ్‌కు టికెట్ రాకుండా శత విధాలా ప్రయత్నం చేసింది. ఇప్పుడు ఆకుల లలిత పరిస్థితీ అలాగే అయ్యింది. మరీ ఇంతలా పగబట్టి వెంటాడుతారని బహుశా ఆకుల లలిత కూడా ఊహించి ఉండదు. కానీ అప్పటి ఎఫెక్ట్ అలా ఉంది మరి. గెలిచే సీటును పోగొట్టుకుని.. పార్టీని తీవ్ర నష్టాల్లో ముంచి వారు మాత్రం పదవులు అనుభవించిన వైనాన్ని వీళ్లింకా జీర్ణించుకోలేదనే విషయం.. దాన్ని కడుపులో పెట్టుకుని ఇలా సమయం దొరకగానే ప్రతీకారం తీర్చుకున్నారనే వైనం ఓ రకమైన ఫ్యాక్షన్ రాజకీయాలకు ఏ మాత్రం తీసిపోలేదు. అర్బన్ కాంగ్రెస్‌తో అట్లుంటది మళ్ల…