రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి, సీఎం కేసీఆర్ నమ్మిన బంటు వేముల ప్రశాంత్ రెడ్డి శుక్రవారం బాల్కొండ నియోజకవర్గం లో కమ్మర్పల్లి మండలంలో అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్న సందర్భంగా తన ప్రసంగంలో రాష్ట్రంలో పింఛను డబ్బులు పెరగనున్నాయని సంకేతాలను ఇచ్చారు. కాంగ్రెస్ పార్టీ తమ ఆరు హామీల గ్యారెంటీ కార్డులో తెలంగాణలో తాము అధికారంలోకి వస్తే రూ. 4 వేలకు పింఛను పెంచి ఇస్తామని ఒకవైపు ప్రచారం చేస్తుండగా ముఖ్యమంత్రికి సన్నిహితుడిగా రాష్ట్రమంతా తెలిసిన వేముల ప్రశాంత్ రెడ్డి కెసిఆర్ కూడా పెంచుతారట.. అని చెప్పిన మాటల పట్ల సర్వత్ర ఆసక్తి నెలకొంది.

పింఛను 4 వేలకు పెంచి ఇస్తామని కాంగ్రెస్ చెబుతున్న వేళ కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో.. ముఖ్యంగా కొన్ని నెలల క్రితమే వారు అధికారం చేపట్టిన కర్ణాటక రాష్ట్రంలో రూ. 750 మాత్రమే ఇస్తున్న విషయాన్ని ప్రస్తావిస్తూ కర్ణాటకలో 4000 ఎందుకు వారు ఇవ్వడం లేదు.. అక్కడ ఇవ్వని కాంగ్రెస్ పార్టీ వారు తెలంగాణ రాష్ట్రంలో ఇస్తామని చెప్పడంలో ఓట్లు తమ డబ్బాల్లో నింపుకోవడానికి తప్ప నాలుగు వేల పెన్షన్ ఇవ్వడానికి కానే కాదని చెబుతూ కేసీఆర్ కూడా పెంచుతాడట అని పెంపు సంకేతాలు ఇచ్చారు . తద్వారా ఇప్పటిదాకా రెండు వేల రూపాయల దాకా పెంచి ఇస్తున్న కెసిఆర్ త్వరలో పెంచి ఇవ్వనున్నారు అన్న అంశంపైనే ప్రజల నమ్మకం కుదిరేలా చాలా వ్యూహాత్మకంగా కాంగ్రెస్ పింఛను పెంపు హామీని తిప్పికొడుతున్నారు. వందమందిలో కెసిఆర్ లబ్ధి అందని పదిమంది తో విపక్షాలు ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు రాజకీయం చేస్తున్నారని.. వందలో 90 మందికి ఇచ్చిన కెసిఆర్ ఆ పదిమందికి ఇవ్వలేడా.. ఆ పదిమందికి అందించే బాధ్యత తనదేనని ప్రకటిస్తూ నిరాశలో ఉన్న ఆ కొందరి లోను భరోసా నింపుతున్నారు.

30 నుంచి 40 కుటుంబాలు ఉన్న చిన్న తండాలకు సైతం రూ. కోటికి పైగా వ్యయంతో బీటీ రోడ్లు వేస్తున్న ప్రత్యేకతను వివరిస్తూ తన నియోజకవర్గంలో అభివృద్ధి ప్రాధాన్యత నమూనాను ప్రజల ముందు ఉంచుతున్నారు. ఇలా కాంగ్రెస్ హామీలను కేసీఆర్ పాలనలో అందిన అభివృద్ధితో పోలుస్తూ తనదైన శైలిలో కాంగ్రెస్తో మాటల యుద్ధాన్ని సాగిస్తున్నారు. తన నియోజకవర్గంలో గ్రామాలకు అభివృద్ధిని ముందు పంపించి ఆ తర్వాతే ఆ గ్రామాలకు ఆయన వెళ్తున్న తీరు ఆయన మాటలను ప్రజలు విశ్వసించేలా చేస్తున్నాయన్న విశ్లేషణలు సాగుతున్నాయి. ఇలా ప్రజలు విశ్వసించే వాతావరణంలో ఆయన ప్రసంగాలు సైతం ప్రజల విశ్వాసాన్ని అందుకోగలుగుతున్నాయని ఆ విశ్లేషణల సారాంశం. ఇలాంటి సానుకూల పరిస్థితుల్లో పింఛను పెంపుపై మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ఇస్తున్న సంకేతాలు సీఎం కేసీఆర్ త్వరలోనే పించను డబ్బులను పెంచనున్నారని చర్చను పెంచుతున్నాయి.

You missed