బాన్సువాడ:
ఏపీ మాజీ సీఎం చంద్రబాబు అరెస్టును స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి తీవ్రంగా ఖండిస్తున్నట్లు ప్రకటించడం చర్చకు తెర తీసింది. ఆయనను జైళ్లో పెట్టడం ఏమాత్రం మంచిది కాదంటూ బాబుకు మద్దతుగా నిలిచారు స్పీకర్ సాబ్. ఇప్పటికే పలువురు బీఆరెస్ నేతలు ఇదే విధంగా బాబు అరెస్టును ఖండిస్తున్నట్టు మాట్లాడి విమర్శలు ఎదుర్కొన్న నేపథ్యంలో ఏకంగా స్పీకర్ ఈ విధంగా కామెంట్లు చేయడం పట్ల రాజకీయంగా చర్చకు తెరలేపినట్టయ్యింది. వాస్తవంగా బాబు అరెస్టును తెలంగాణ ప్రజలు సీరియస్‌గా తీసుకోలేదు. ఆ మాటకొస్తే ఈ విషయాన్ని అసలు పట్టించుకోలేదు. తగిన శాస్తే జరిగిందనే వ్యాఖ్యలే మెజారిటీగా వినిపించాయి.
ఏపీ రాజకీయాల రొచ్చు మనకు లేకుండా పోయిందని ఊపిరి కూడా పీల్చుకున్నారు. ఈ నేపథ్యంలో ఇన్ని రోజుల తర్వాత పోచారం ఈ విషయం పై మాట్లాటడం ప్రాధాన్యత సంతరించుకున్నది. సంచలన వ్యాఖ్యలుగా వీటిని చర్చించుకుంటున్నారు. బీర్కూర్ మండలంలో జరిగిన పలు కార్యక్రమాల్లో ఆయన పాల్గొన్న సందర్బంగా ఈ వ్యాఖ్యలు చేశారు. ప్రజాస్వామ్యంలో రాజకీయ కక్షలు మంచిది కాదంటూ హితవు పలికారు. అధికారంలో ఉన్న ప్రభుత్వాలు కారణం లేకుండా ప్రతిపక్ష నాయకులను అరెస్టు చేసి జైళ్లో పెట్టడం మంచిది కాదంటూ బాబుకు వత్తాసు పలికారు స్పీకర్. ఆయనకు ఓ రకంగా సంఘీభావం ప్రకటించారు.