బోగస్ ఓటర్లు ఎడాపెడా అంతటా పెరిగారు. ఇక్కడా అక్కడా అని కాదు దాదాపు అన్ని నియోజకవర్గాల్లో. మహారాష్ట్రలో నివసిస్తున్న వ్యక్తులకు ఇక్కడ ఓటర్ల లిస్టులో పేర్లు నమోదయ్యాయి. ఇవన్నీ నాయకుల ప్రమేయం లేకుండా జరిగేవి కావు. ఈ విషయాన్ని పలు పార్టీలు ఆలస్యంగా పసిగట్టాయి. బోగస్ ఏరివేతపై ఫిర్యాదుల పరంపర కొనసాగుతోంది. బోగస్ ఓటర్ల ఏరివేతపై ప్రభుత్వం ప్రత్యేకంగా ఓ ఐఏఎస్ ఆఫీసర్‌ను నియమించారు. నిజామాబాద్ జిల్లాలో కలెక్టర్‌గా పనిచేసిన క్రిష్టినా జడ్‌చోంగ్తూను అధికారిగా నియమించారు. జిల్లాపై ఆమెకు పట్టుంది. దీంతో బోగస్ ఏరివేతపై ఆమె ప్రత్యేకంగా దృష్టి కేంద్రీకరించారు.
అయితే బోధన్‌లో ఓ నాయకుడు చేసిన వాట్సాప్ మెస్సేజ్ వైరల్ అయ్యింది. స్థానిక ఎమ్మెల్యే మహారాష్ట్ర వ్యక్తుల పేర్లతో ఇక్కడ ఓటర్లుగా నమోదు చేయించాడని, దీనిపై అధికారికి ఫిర్యాదు చేయడంతో బోగస్ ఓటర్లను ఏరివేశారని, కానీ అసలైన ఓటర్లు మళ్లీ తమ పేర్లను నమోదు చేసుకోకపోతే పోలింగ్ సమయంలో తమ ఓటు గల్లంతయ్యిందని తెలుసుకోవాల్సి వస్తుందని అప్రమత్తం చేశారు. ఇప్పుడిదే వైరల్‌గా మారింది. నిజమే…. చాలా మంది తమ ఓటు పదిలంగా ఉందని భావిస్తారు. అదే భ్రమలో ఉన్నారు. కానీ బోగస్ ఓట్లు ఏరివేసే క్రమంలో అసలు ఓటర్లు తమ ఓటును చెక్ చేసుకోకుండా ఉంటే పోలింగ్ వేళ తెల్లముఖం వేయాల్సిందే.
అలాగే ఉంది ఇప్పుడు పరిస్థితి. ఓటు హక్కును వినియోగించుకునేందుకు, కొత్తగా ఓటరు నమోదు ప్రక్రియను జిల్లా యంత్రాంగం తూతూ మంత్రంగానే చేస్తూ వస్తోంది. ఎన్నికలు సమీపిస్తున్నాయి. జమిలీ లేదనేది స్పష్టం అయ్యింది. ఇప్పుడు దృష్టి పెట్టాల్సింది అసలైన ఓటర్ల జాబితాపై. బోగస్ ఏరివేతపై దృష్టి పెట్టినట్లే.. మరోసారి పాత ఓటర్ల వెరిఫికేషన్ ప్రక్రియపైనా స్పెషల్ ఆపరేషన్ జరగాలి. లేదంటే ఈసారి చాలా మంది తమ ఓటు హక్కును కోల్పోవడం ఖాయం.