కల్వకుంట్ల కవితను అబద్దాల అర్వింద్ మాటలు విని ఓడగొట్టుకున్నారని, ఆమె ఓడినా ప్రజలను వీడలేదని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. ఆమెకు ఇందూరు సొంతిల్లులాంటిదని, ఇక్కడి ప్రజలంతా కుటుంబ సభ్యులేనని అందుకే ఆమె నాయకురాలిగా మీ అందరి బాగోగులు చూసుకుంటూ మీ మధ్యే తిరుతున్నారని అన్నారాయన. పసుపుబోర్డు పేరు చెప్పి గెలిచిన అర్వింద్ ఏనాడైనా మీ పల్లెలకు వచ్చాడా..? మీ బాధలు విన్నాడా..? ఏమైనా సమస్యలు తీర్చాడా..? అని అడిగారాయన.
గురువారం ఆర్టీసీ చైర్మన్, నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్దన్, ఎమ్మెల్సీ కవిత, అర్బన్ ఎమ్మెల్యే బిగాల గణేశ్ గుప్తాలతో కలిసి ఆమె చేప పిల్లల విడుదల కార్యక్రమంలో పాల్గొన్నారు. తొలత మంత్రి డిచ్‌పల్లిలో ఫిష్ మార్కెట్ కోసం రూ.50 లక్షలతో నిర్మించే భవనానికి శంఖుస్తాపన చేశారు. అనంతరం న్యాల్‌కల్ గ్రామ చెరువులో చేప పిల్లల విడుదలను చేశారు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని అర్సపల్లిలో రూ. 2 కోట్లతో ఫిష్‌మార్కెట్ కోసం శంఖుస్థాపన చేశారు మంత్రి తలసాని. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. కులవృత్తులకు సీఎం కేసీఆర్ ఇతోధికంగా మేలు చేస్తున్నారని, పద్దెనిమిది సంవత్సరాలు నిండిన ప్రతీ గంగపుత్ర యువత సొసైటీలో మెంబర్‌గా చేరాలని, సొసైటీల సంఖ్యపెంచాలన్నారు. చెరువుల్లో వేసే చేప పిల్లల పై పూర్తి హక్కు గంగపుత్రులకు,మత్స్యకారులకే ఉంటుందన్నారు. కాంట్రాక్టర్లు ఎన్ని చేప పిల్లలు వేస్తున్నారు, ఎన్ని రొయ్యలు వేస్తున్నారో దగ్గరుండి చూసుకోవాలని, ఇందులో గోల్‌మాల్ జరిగే అవకాశం ఉందన్నారాయన.
జిల్లాకు పెద్దన్న, లక్ష్మీపుత్రుడు గోవన్న… కవిత..
నిజామాబాద్ జిల్లాకు బాజిరెడ్డి గోవర్దన్ పెద్దన్నలాంటి వాడని, లక్ష్మీపుత్రుడని కొనియాడారు ఎమ్మెల్సీ కవిత. ఆర్టీసీ చైర్మన్‌గా ఆయన ఉన్న హయాంలోనే 43వేల మంది ఉర్టీసీ కార్మికులు ఉద్యోగులుగా మారారని, ఈ బిల్లుకు గవర్నర్ కూడా ఆమోదముద్ర వేసిందన్నారు. సంపద సముద్రమంతా పెంచిన కేసీఆర్ మనసు.. అందరినీ సమంగా ఆర్థికంగా ఎదిగేలా చేసే సముంద్రమంతటి మనసన్నారు. 4.50 లక్షల టన్నుల చేపల ఉత్పత్తి లక్ష్యంగా ఈ యేడాది చేప పిల్లల పెంపకం జరుగుతున్నదని అన్నారు. గంగపుత్రులను ఆదుకునేందుకు ఈ విధంగా వందశాతం సబ్సిడీతో దేశంలో ఏ రాష్ర్ట ప్రభుత్వం చేయడం లేదన్నారామె.
కాంగ్రెస్, బీజేపీ ఓట్ల బిచ్చగాళ్లతో జాగ్రత్త: బాజిరెడ్డి
ఎన్నికలు రాగానే బిచ్చగాళ్ల మాదిరిగా కాంగ్రెస్, బీజేపీ నాయకులు ప్రజలను మభ్యపెట్టేందుకు వచ్చి ఏవేవో అబద్దపు హామీలిస్తారని బాజిరెడ్డి గోవర్దన్ అన్నారు. ఈ ఓట్ల బిచ్చగాళ్లతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ఎల్లవేళలా ప్రజలందరి శ్రేయస్సు కోరే కేసీఆర్‌ను కడుపులో పెట్టి కాపాడుకోవాలని పిలుపునిచ్చారు. గంగపుత్రులు దళారుల బెడద లేకుండా ధనవంతులయ్యేలా ఈ చేప పిల్లల పెంపకం కార్యక్రమాన్ని కేసీఆర్ చేపట్టారని, ఫిష్ మార్కెట్లు నిర్మిస్తూ వారిలో ఆత్మవిశ్వాసం, ఆత్మగౌరవం పెంచుతున్నారని అన్నారు బాజిరెడ్డి.