కామారెడ్డి నుంచి కేసీఆర్ పోటీ చేయనున్న నేపథ్యంలో జిల్లా కేంద్రంతో భారీ సభ పెట్టి … అదే ఉత్సాహంతో ప్రచారం షురూ చేయాలని బీఆరెస్ శ్రేణులు భావించారు. ఎమ్మెల్సీ కవిత రాక కూడా దాదాపు ఖరారైంది. కానీ లోకల్ ఎమ్మెల్యే గంప గోవర్దన్ కుమారుడి వివాహం ఉన్నందున ఆటంకం ఏర్పడింది. దీంతో ఈ సభ వినాయకచవితి తరువాతే పెట్టాలని భావించారు. కానీ రాష్ట్ర వ్యాప్తంగా 9 జిల్లాల్లో మెడికల్ కాలేజీలు ప్రారంభానికి ముస్తాబైన తరుణంలో దీన్ని ఓ వేడకగా చేసుకోవాలని మంత్రి కేటీఆర్ భావించారు. వెంటనే పార్టీ శ్రేణులకు ఆదేశించారు. కామారెడ్డిలో కూడా కాలేజీ భవనం పూర్తి కావడంతో పాటు మొదటి సంవత్సరానికి చెందిన అడ్మిషన్లు కూడా పూర్తయ్యాయి. ఈ తరుణంలో ఎమ్మెల్సీ కవిత ఈ మెడికల్ కాలేజీ ప్రారంభోత్సవ వేడుకను స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. కేసీఆర్ పోటీ నేపథ్యంలో ఇదే తొలిసభ కూడా భావిస్తున్న తరుణంలో ఇది ప్రాధాన్యత సంతరించుకున్నది. ఈనెల 15న ఎమ్మెల్సీ కవిత ఈ కార్యక్రమానికి హాజరుకానున్నారు. దీంతో స్థానిక ఎమ్మెల్యే గంప గోవర్దన్, జిల్లా పార్టీ అధ్యక్షుడు ముజీబుద్దీన్, సీనియర్ లీడర్ లోయపల్లి నర్సింగరావు తదితరులు పెద్ద ఎత్తున కార్యక్రమాన్ని నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.
ప్రారంభానికి మెడికల్ కాలేజీ ముస్తాబు.. పరిశీలించిన కలెక్టర్…
ఈ నెల 15 న వైద్య కళాశాల ప్రారంభోత్సవానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తున్నామని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు.రాష్ట్ర ప్రభుతం వైద్య రంగానికి అత్యంత ప్రాధాన్యాతనిస్తూ పలు జిల్లాలకు మెడికల్ కళాశాలలు మంజూరు చేయగా, నిర్మాణాలు పూర్తై 2023-24 సంవత్సరం మొదటి సంవత్సరం బ్యాచ్ కు ప్రవేశాలు ప్రారంభమైన 9 జిల్లాలో తరగతులను ప్రారంభించుటకు గానువైద్య కళాశాలలను రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ఈ నెల 15 న వర్చువల్ పద్ధతిన ప్రారంభిస్తున్న సందర్భంగా కామారెడ్డి జిల్లా కేంద్రంలోని దేవునిపల్లిలో నిర్మిస్తున్న వైద్యకళాశాలలో జరుగుచున్న పనులను కలెక్టర్ పరిశీలించారు.ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ వైద్య కళాశాలలో పురోగతిలో ఉన్న పనులను, వసతి గృహ పనులను యుద్ధప్రాతిపదికన పూర్తి చేస్తున్నామని, పనులు చకచకా సాగుచున్నాయని అన్నారు. అనాటమీ, లెక్షరర్ గ్యాలరీ, ల్యాబ్ లు తదితర విభాగాలతో పాటు , విద్యార్థులకు వసతి గృహాలు, కామన్ ఏరియా పనులు పూర్తి చేస్తున్నామన్నారు.
మిగిలిపోయిన చిన్న చిన్న త్వరితగతిన పూర్తి చేయడంతో పాటు కళాశాల ప్రారంభానికి చేపట్టవలసిన పనులపై కాంటాక్టర్లకు పలు సూచనలు చేశారు. 2023-24 విద్యా సంవత్సరానికి ఏం.బి.బి.ఎస్. మొదటి సంవత్సరం ప్రవేశానికి వంద సీట్లు కేటాయింపుకాగా ప్రధానాచార్యులు వెంజటేశ్వర్ చాలా పారదర్శకంగా అడ్మిషన్స్ పూర్తిచేశారన్నారు. విద్యార్థులు మంచిగా చదువుకునేలా చక్కటి వాతావరణం, వసతి గృహాలలో అన్ని మౌలిక సదుపాయాలూ కల్పిస్తున్నామని అన్నారు. అదేవిధంగా తరగతులు సక్రమంగా నిర్వహించేందుకు ల్యాబ్ లో అన్ని ఎక్విప్మెంట్ ఏర్పాటుతో పాటు ఫ్యాకల్టీ ని, పరిపాలనా సిబ్బందిని నియమించామని అన్నారు. ఈ సందర్భంగా వివిధ ప్రాంతాల నుండి కామారెడ్డి వైద్య కళాశాలలో చదువుకొనుటకు ప్రవేశం పొందిన మొదటి సంవత్సరం విద్యార్థిని,విద్యార్థులకు కలెక్టర్ శుభాకాంక్షలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ వెంకటేశ్వర్, గుత్తేదార్లు , తదితరులు పాల్గొన్నారు.