వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ గిరీ పెండింగ్‌లో పడినట్టు తెలుస్తోంది. అర్బన్‌కు కేటాయించిన ఈ చైర్మన్ పదవి పట్ల నాకంటే నాకని కులాల వారీగా విడిపోయి ఎవరికి వారే ప్రయత్నాలు చేయడం మొదలుపెట్టారు. దీంతో ఎన్నికల వేళ ఎవరికొకరికొచ్చినా ఇంకొకరితో కయ్యమెందుకనే దోరణిలో అధిష్టానం దీన్ని పెండింగ్‌లో పెట్టినట్టు తెలుస్తోంది. నుడా పదవి రూరల్ నియోజకవర్గానికి చెందిన ఈగ సంజీవరెడ్డికి ఇచ్చారు.
దీంతో మార్కెట్ కమిటీ ముందుగా అనుకున్న ప్రకారం అర్బన్ నియోజకవర్గానికి కేటాయించారు. సత్యప్రకాశ్‌కు మార్కెట్ కమిటీ చైర్మన్ ఇచ్చి… వైస్ చైర్మన్‌గా మున్నూరుకాపుకు ఇద్దామనుకున్నారు. కానీ చైర్మన్ గిరీ తమకే కావాలన్నారు మున్నూరుకాపులు. కాదు కాదు మాకు కావాలని పోరు పెట్టారు పద్మశాలీలు. దీంతో అర్బన్‌లో ఈ రెండు మేజర్ కమ్యూనిటీలతో లొల్లెందుకని మధ్యేమార్గంగా దీన్ని అలా సీఎం వద్దే పెండింగ్‌లో ఉంచేసినట్టు తెలుస్తోంది. ఎన్నికల తర్వాతే దీనికి తుదిరూపు వచ్చి పాలకవర్గం ఏర్పడే అవకాశాలు కనిపిస్తున్నాయి.