కేసీఆర్‌. తను కామారెడ్డి పోటీ చేస్తున్నాడని ప్రకటించిన మరుక్షణం నుంచే ఉమ్మడి జిల్లాకు కొత్త ఊపు వచ్చింది. తొమ్మిది నియోజకవర్గాల అధికార పార్టీ ఎమ్మెల్యేలకు వెయ్యేనుగుల బలం వచ్చింది. ప్రజా వ్యతిరేకత ఉన్నా.. కేసీఆర్‌ రాకతో తమ గెలుపు నల్లేరు మీద నడకే అనే ఫీలింగ్ వచ్చేసింది. ఎవరి పనుల్లో వారు బిజిబిజీగా ఉన్నారు. ప్రచారం చేసుకుంటున్నారు. అంత వరకు బాగానే ఉంది. కానీ కేసీఆర్‌ పోటీ చేసే కామారెడ్డి నియోజకవర్గంలోనే రాజకీయం వేడెక్కింది. కేసీఆర్‌ వస్తున్నాడనే వార్త ఆ పార్టీలో అత్యుత్సాహం నింపింది. కొందరి వ్యవహార శైలి, పోకడలు కేసీఆర్ స్థాయిని తగ్గించేవిగా ఉన్నాయనడంలో అతిశయోక్తి లేదు. కేసీఆర్‌ పోటీ అనగానే ప్రతిపక్ష పార్టీలైన బీజేపీ, కాంగ్రెస్‌ల అభ్యర్థులు ఓటమిని అంగీకరించి తోకముడిచి కూర్చోవాల్సింది. నిమిత్త మాత్రపు పోటీ కూడా ఇచ్చే పరిస్థితులుండవు. కేసీఆర్‌తో అట్లుంటది మరి.

కానీ ఇక్కడ సీన్ రివర్స్‌ అవుతోంది. వీరిద్దరినీ హీరోలుగా చేస్తూ వార్తల్లో వ్యక్తులుగా నిలబెడుతున్నాయి కొన్ని సంఘటనలు. బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా కాట్‌పల్లి వెంకట రమణారెడ్డికి కొద్ది రోజుల క్రితం వరకు అక్కడ ఊపు ఉండే. ప్రధానంగా కామారెడ్డి టౌన్‌లో. అది క్రమంగా పడిపోతూ వచ్చింది అంతటా జరిగినట్టే. కేసీఆర్‌ పోటీపై ఏదో మాట్లాడాడు వెంకటరమణారెడ్డి.. దాన్ని వక్రీకరించి ఏదో రాశాడు నమస్తే తెలంగాణ విలేకరి. ఆ విలేకరిని ఇష్టమొచ్చినట్టు తిట్టాడు రమణారెడ్డి. అంతే కాదు వ్యవహారం లీగల్‌ నోటీసులు ఇష్యూ చేసేదాకా వెళ్లింది. మళ్లీ ఒక్కసారిగా రమణ్‌రెడ్డి పేరు తెరపైకి వచ్చింది. ఇది చాలదంటూ చలో గజ్వేల్ ప్రోగ్రాం పెట్టుకున్నాడు. అరెస్టులు, నిర్బంధాల పేరుతో నానా యాగీ చేశారు.

అదీ బీజేపీ నేతను హైలెట్‌ చేసింది. కేసీఆర్‌ పోటీ ఏమోగానీ మూలకున్న నేత కాస్తా మళ్లీ రోడ్డెక్కాడు. ఇక షబ్బీర్‌ అలీ. అంతా మరిచిపోయిన క్యారెక్టర్. కాంగ్రెస్‌ పుంజుకుంటున్న తరుణంలో ఆ హవాతో మైనార్టీ ఓట్లతో ఎలాగోలా ఈసారైనా గెలిచేద్దామనుకున్నా.. కేసీఆర్‌ వస్తున్నాడనగానే జవజీవాలు గాలిలో కలిసిపోయినంత పనైంది. ఇతగాడికీ హైలెట్‌ అయ్యేందుకు ఓ అంశం బ్రహ్మాస్త్రంగా దొరికింది. అదే ఏకగ్రీవ తీర్మానాలు. ఏకంగా పంచాయతీలే కేసీఆర్‌కు మద్దతునిస్తూ ఆయనకే ఓటేస్తామనే విధంగా లెటర్‌ హెడ్‌లపై తీర్మానాలు చేసి రాసివ్వడాన్ని షబ్బీల్‌ తప్పుబట్టాడు. అడపాదడపా కుల సంఘాలు ఇలా ఏకగ్రీవ తీర్మానాలు ఇవ్వడం సహజంగా ఎన్నికల వేళ జరిగేవే.కానీ ఇక్కడ జరిగింది.. సర్పంచులే దగ్గరుండి పంచాయతీ లెటల్‌ హెడ్‌లపై తీర్మానాలు చేయడం. మరలాంటప్పుడు ప్రజాస్వామ్యమెందుకు..? ఎన్నికలెందుకు..? ఓట్లెందుకు..?? అనేది షబ్బీల్‌ అలీ ఫిర్యాదు.

దీనిపై మంత్రి ప్రశాంత్‌ రెడ్డి ఖండించాడు. ప్రకటన విడుదల చేశాడు. విమర్శించాడు. అదే వేరే విషయం. కానీ ఇలాంటి సంఘటనల ద్వారా ప్రతిపక్షాల నేతలిద్దరూ తోకముడిచి ఎటో కొట్టుకుపోతారుకుంటే ఏదో ఒక అస్త్రాన్ని స్వయంగా బీఆరెస్‌ పార్టీ నేతలే వారికి అందిస్తున్నట్టుగా ఉంది. అవి అందిపుచ్చుకుని ఇలా వీరిద్దరూ హీరోలవుతన్నారు. వాస్తవంగా కేసీఆర్‌కు ఇవన్నీ అవసరమా..? తను సభలు పెట్టి.. ప్రెస్‌మీట్లు పెట్టి జనాలను తనవైపు తిప్పుకుని వార్‌ వన్ సైడ్ చేసుకోలేడా..? అంతెందుకు.. జనాలే కేసీఆర్‌ వస్తుంటే అభివృద్ధి జరుగుతుందనే ఫీలింగులో ఉన్నారు. దీనికి అంతలా బీఆరెస్‌ నేతలు కష్టపడాల్సిన పనిలేదు. అత్యుత్సాహంతో ప్రతిపక్షాలకు అస్త్రాలందించి వారు కత్తులు తింపుతూ జనాల వద్ద కత్తుల కాంతారావులుగా మారేలా చేస్తున్నది ఎవరు..? అందుకే ఇప్పుడు రాజకీయమంతా కామారెడ్డి చుట్టే తిరుగుతున్నది.

You missed