గత పార్లమెంటు ఎన్నికల్లో బీజేపీ ఎంపీ అభ్యర్థిగా అర్వింద్ చెప్పిన అబద్దాలన్నీ విని మోసపోయామని, బంగారమసొంటి కవితమ్మను ఓడగొట్టుకున్నామని మంత్రి ప్రశాంత్‌రెడ్డి అన్నారు. సోమవారం కమ్మర్‌పల్లి మండలం చౌట్‌పల్లిలోని మార్కెట్‌ యార్డులో జరిగిన ప్రజా ఆశీర్వాద సభలో మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి, రాజ్యసభ సభ్యుడు కేఆర్‌ సురేశ్‌రెడ్డి, ఎమ్మెల్సీ కవిత తదితరులు పాల్గొన్నారు. ఈ సభలో మంత్రి మాట్లాడుతూ అర్వింద్‌ తప్పుడు, అబ్దదాల హామీలపై విరుచుకుపడ్డారు. బంగారమసోంటి కవితమ్మను ఓడగొట్టుకుని, ఆంబోతును ఎన్నుకున్నామని అర్వింద్‌నుద్దేశించి వ్యాఖ్యానించారు.

ఐదు రోజుల్లో పసుపు బోర్డు తెస్తానని అర్వింద్‌ రైతులను మోసం చేసి గెలిచాడని ధ్వజమెత్తారు. పసుపు బోర్డే కాదు.. అసలు ఎంపీగా అతను జిల్లాకు చేసిందేమీ లేదని, బీజేపీ పార్టీ లత్కోర్‌ పార్టీ అని తిట్ల దండకం అందుకున్నారు. ఇన్ని కోట్ల అభివృద్ధి చేస్తున్న బీఆరెస్ ఓ వైపు అబద్దాల అర్విందు, దేవుడి పేరుతో బయటపెట్టి ఓట్లు కొల్లగొట్టాలనుకునే బీజేపీ మరోవైపు ఉన్నాయని, ఓటర్లు ఎవరు వైపు ఉంటారో తేల్చుకోవాలని ఆయన అన్నారు. ఉద్యమ నాయకుడు, సీఎం అని కూడా చూడకుండా కేసీఆర్‌ను, ఆడబిడ్డ అని కూడా చూడకుండా కవితను ఇష్టమొచ్చినట్టు తిట్టే అర్వింద్‌ వల్ల ప్రజలకు ఏమైనా మేలు జరిగిందా..? అని ప్రశ్నించారు. ప్రజలు అంతా గమనిస్తున్నారని, సమయం కోసం వేచి చూస్తున్నారని, కర్రు కాల్చి వాత పెడతారని ప్రతిపక్షాలనుద్దేశించి విమర్శించారు. కాంగ్రెస్‌ పింఛన్ల చరిత్రలో ఐదారొందంలకు మించి ఇచ్చిన దాఖలాలు లేవని, మరి ఇక్కడ ఎలా నాలుగు వేలు ఇస్తారని , ఇలాంటి వారి మాటలు వింటే మోసపోతామని, పాత రోజులే వస్తాయని మంత్రి హితబోధ చేశారు.

రాజ్యసభ సభ్యుడు కేఆర్‌ సురేశ్‌రెడ్డి మాట్లాడుతూ… బతుకమ్మ పండుగ అంతరించి పోతున్న తరుణంలో ఉద్యమంలో బతుకమ్మకు పాణం పోసి ఉద్యమాన్ని కవిత ఉర్రూతలూగించారని గుర్తు చేశారు. మహిళల్లో ఉద్యమ స్పూర్తిని రగిలించారన్నారు. ఆనాటి ఉద్యమ కాలం నుంచి ఈనాటి వరకు ఆమె ప్రజల కోసం, ప్రజల బాగుకోసం పనిచేస్తున్నారని కొనియాడారు.

మాది గోల్డెన్‌ కాంబినేషన్‌ : ఎమ్మెల్సీ కవిత

మంత్రి ప్రశాంత్‌రెడ్డి, తనది గోల్డెన్‌ కాంబినేషన్‌ అని ఎమ్మెల్సీ కవిత అన్నారు. తొలిసారిగా ఎన్నికల సభలో సీఎం కేసీఆర్‌ మోర్తాడ్‌కు వచ్చినప్పుడు బీడీ పింఛన్ల కోసం మాట్లాడి ఒప్పించి బీడీ కార్మికులకు ఆసరా పింఛన్లు ఇప్పించిన విషయాన్ని గుర్తు చేసుకున్నారు. ఇప్పటికీ కొందరికీ బీడీ పింఛన్లు రాలేదు..ఏం బెంగపడొద్దు.. త్వరలోనే అందరికీ బీడీ పింఛన్లు అందేలా చేస్తాం.. అని భరోసా ఇచ్చారు కవిత. గట్టి నాయకుడైన ముఖ్యమంత్రి కేసీఆర్‌ దగ్గర మంత్రి ప్రశాంత్‌రెడ్డి ఓ సైనికుడిలా పనిచేస్తున్నాడని, పార్టీ కార్యకర్తలను కడుపులో పెట్టి కాపాడుకుంటున్నాడని ప్రశాంత్‌రెడ్డిని కొనియాడారు. ప్రశాంత్‌రెడ్డికి వేసే ప్రతీ ఓటు కేసీఆర్‌కు బలాన్నిచ్చినట్టేనన్నారు.

You missed