కాంగ్రెస్‌ బీసీ డిక్లరేషన్‌ బాల్కొండ నాయకులపై పిడుగుపాటుగా మారింది. ఇక్కడ నుంచి టికెట్‌ ఆశిస్తున్న వారికి ఆశాభంగమే మిగిలించనుండగా… మాజీ ఎమ్మెల్యే ఈరవత్రి అనిల్‌కు ఇస్తేనే రెండో బీసీ సీటు ఇచ్చినట్టవుతుందని, బీసీ డిక్లరేషన్‌కు జస్టిఫికేషన్‌ దొరుకుతుందని భావిస్తున్నది అధిష్టానం. తాజాగా నిజామాబాద్‌ జిల్లాలో జరిగిన బీసీ డిక్లరేషన్‌లో నిజామాబాద్‌ పార్లమెంటు నియోజకవర్గ పరిధిలో రెండు బీసీ సీట్లు ఇవ్వాలని తీర్మానించారు.

అయితే రెండు సరిపోవు.. మూడు ఇవ్వాలనే డిమాండ్‌ వచ్చినా.. ముందుగా అనుకున్నట్టు కచ్చితంగా రెండు ఇవ్వకతప్పదని డిసైడ్‌ అయ్యారు. ఇందులో అర్బన్‌ నియోజకవర్గం నుంచి క్లియర్‌గా బీసీకే ఇస్తామని ప్రకటించేశారు. ఇక రెండో బీసీ సీటును ఆర్మూర్‌ అనుకున్నారు. ఇక్కడంతా రెడ్లే పోటీలో ఉండగా.. ఓ బీసీకి ఇస్తే సమీకరణ కుదురుతుందని భావించారు. అయితే బీజేపీ నుంచి వినయ్‌రెడ్డి కాంగ్రెస్‌లో చేరడం ఖాయమైంది. గతంలో ఎమ్మెల్యేగా పోటీ చేసి ఉన్నందున… ఇతనికి ఇస్తే క్యాడర్‌ పెరిగి.. ప్రజల్లో తెలిసిన ముఖమే కాబట్టి గెలిచే అవకాశం ఉందనే భావన అధిష్టానవర్గంలో ఏర్పడింది.

దీంతో ఇతమిత్థంగా వినయ్‌కే టికెట్‌ ఖరారని లోలోన ప్రచారం మొదలైంది. ఇక మరి రెండో బీసీ సీటు ఎవరికివ్వాలి..? ఎక్కడ్నుంచి ఇవ్వాలి..?? కోరుట్ల, జగిత్యాల నియోజకవర్గంలో ఛాన్స్‌ లేదు. బోధన్‌లో సుదర్శన్‌రెడ్డిని కదలేని పరిస్థితి. రూరల్‌లో రెడ్ల మధ్యే కుమ్ములాటలున్నాయి. ఒకరు కాకపోతే మరొకరు ఇక్కడ రెడ్డే పోటీలో ఉంటాడు. ఇక మిగిలింది ఒకటే బాల్కొండ. ఇక్కడ నుంచి ఎన్నో అపసోపాలు పడి కాంగ్రెస్‌లో చేరిన ముత్యాల సునీల్‌ ఇక టికెట్‌ తనకే అని ప్రకటించేసుకుని కార్యక్రమాలు కూడా చేసేసుకుంటున్నాడు. మరోవైపు జిల్లా అధ్యక్షుడు మానాల మోహన్‌రెడ్డి పోటీగా తనూ తిరుగుతున్నాడు. తనకే టికెట్‌ అని కూడా ప్రకటించేసుకున్నాడు. ప్రచారమూ చేసుకుంటున్నాడు. వాల్‌ రైటింగ్స్‌ జోరుగా సాగుతున్నాయి.

ఈక్రమంలో రెండో బీసీ సీటు బాల్కొండకు తప్ప వేరే చోట అవకాశం లేకపోవడంతో మళ్లీ ఈరవత్రి అనిల్‌ పేరు తెరపైకి వచ్చింది. బీసీ డిక్లరేషన్‌ పుణ్యమా అని అనిల్‌ నెత్తిన పాలుపోసినట్టయ్యింది. మరోవైపు సునీల్‌కు ఇది శరాఘాతం కానుంది. ఆశాభంగం తప్పేలా లేదు. శని ఎక్కడో లేదు.. తన వెంటే తిరుగుతుందనడానికి ఇదో నిదర్శమనొచ్చు. మానాల మోహన్‌రెడ్డి కూడా బీసీ డిక్లరేషన్‌తో సైలెంట్‌ అయిపోయాడు. ఇప్పుడు తెరవెనుక ఉన్న ఈరవత్రి అనిల్‌ హీరోగా తెరముందుకు రానున్నాడు. పోటీలు పడ్డ నేతలు అనిల్‌కు సపోర్టు చేయాలి. చేస్తారా..? ఉంటారా..? పోతారా..? బీసీకి ఇస్తారా…?? మాటకు కట్టుబడతారా..?? ఈ ప్రశ్నలన్నింటికీ త్వరలోనే సమాధానాలు దొరకనున్నాయి.

 

You missed