ఎన్నికల వేళ ఎప్పటి నుంచో ఖాళీగా ఉన్న పదవులన్నీ భర్తీ చేస్తు వస్తున్న జిల్లా బీఆరెస్‌కు ఇప్పుడు మార్కెట్ కమిటీ చైర్మన్ పదవి పెద్ద తలనొప్పినే తెచ్చిపెట్టింది. మొన్నటి వరకు ఇది నుడా పదవితో ముడిపడి ఉండటంతో ఎటూ తేలక చాలాకాలంగాప పెండింగ్‌లో పడింది. నుడా చైర్మన్ ప్రభాకర్‌రెడ్డి పదవీ కాలం ముగిసినా అతన్ని మార్చలేదు. దీన్ని ఆర్టీసీ చైర్మన్, నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్దన్ తన చిరకాల మిత్రుడు, సీనియర్ బీఆరెస్ నాయకుడు ఈగ సంజీవరెడ్డికి ఇవ్వాలని పట్టుబట్టాడు. కానీ అది కొద్ది రోజులు పెండింగ్‌లో పడింది. ఇక ఎన్నికల వరకు ఈ పంచాయతీ తెగేలా లేదు అని అంతా అనుకున్న సమయంలో బాజిరెడ్డి లాబీయింగ్‌తో ఎట్టకేలకు ఈగ సంజీవరెడ్డికి నుడా చైర్మన్ గిరీ దక్కింది.
ఇక ముందస్తు అగ్రిమెంట్ ప్రకారం నుడా రూరల్‌లకు వెళ్తే… మార్కెట్ కమిటీ చైర్మన్ పదవి అర్బన్‌కు ఇవ్వాలనేది ఓ ఒప్పందంగా చెప్పుకుంటున్నారు. కానీ ఇక్కడే అసలు సమస్య వచ్చి పడింది. అర్బన్ నుంచి సత్య ప్రకాశ్‌కు ఇవ్వాలని బిగాల గణేశ్ గుప్తా పట్టుబడుతున్నాడు. విశ్వబ్రహ్మణ సామాజికవర్గానికి చెందిన సత్యప్రకాశ్‌కు ఎలా ఇస్తారు.. మున్నూరుకాపులు వ్యవసాయం ఆధారంగా బతికే కులం..మార్కెట్ కమిటీ వాళ్లకు ఇస్తేనే సరైన న్యాయం చేసినట్టుంటుందనే వాదన ముందుకు వచ్చింది.
ఆలోచన వచ్చిందే తడువు ఎమ్మెల్యేపై తీవ్ర ఒత్తిడి పెంచారు. మేం మేం తక్కువా.. మా సామాజికవర్గం కూడా బలంగానే ఉంది అంటూ పద్మశాలీలూ ముందుకు వచ్చారు. మావోడికి ఇవ్వాలని ఇంకో వైపు పోరు మొదలు పెట్టారు. దీంతో బిగాలకు ఇదో తలనొప్పిలా మారింది. ఇదిలా ఉంటే.. ఆర్మూర్ నియోజకవర్గం మాక్లూర్ మండలానికి చెందిన ఆకుల రజినీశ్ తనకే చైర్మన్ పదవి కావాలని ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్‌రెడ్డిపై తీవ్ర ఒత్తిడి పెంచాడు. గతంలో జీవన్‌రెడ్డి రజినీశ్‌కు హామీ ఇచ్చాడు. సీఎంతో మాట్లాడానని కచ్చితంగా నీకే చైర్మన్ పదవీ అంటూ చాలా సార్లు బాహాటంగా చెప్పుకొచ్చాడు.
దీంతో రజినీశ్ దీనిపై గంపెడాశలు పెట్టుకున్నాడు. ఇదే మంచి సమయం అనుకుని జీవన్‌రెడ్డిపై మరింత ఒత్తిడి పెంచుతున్నట్టు తెలిసింది. కీలకమైన ఎన్నికల సమయంలో గ్రామీణ నేపథ్యం, వ్యవసాయక కుటుంబం, మున్నూరుకాపు సామాజికవర్గం అయినందున ఈ పదవి సూట్ అవుతుందని, ముందుగా ఎమ్మెల్యే హామీ మేరకు అందరికీ చెప్పుకున్నానని, ఇప్పుడు ఇవ్వకపోతే తనకు ఎన్నికల్లో ఉత్సాహంగా ప్రచారం చేసే చాన్స్ ఉండదనే భావనను ఎమ్మెల్యే వద్ద వెలిబుచ్చుతున్నట్టు తెలిసింది. పార్టీ ఆవిర్భావం నుంచి సిన్సియర్‌గా పనిచేస్తున్న శక్కరకొండ క్రిష్ణ రెండు పర్యాయాలు డిచ్‌పల్లి పార్టీ ప్రెసిడెంట్‌గా పనిచేశారు. ఎలాంటి పదవులు ఆశించకుండా పార్టీ బలోపేతానికి కృషి చేశారు. పద్మశాలి సామాజికవర్గానికి చెందిన వ్యక్తి అయిన క్రిష్ణకు బాజిరెడ్డి, కవిత ఆశీస్సులతో తనకు మార్కెట్ కమిటీ చైర్మన్ దక్కుతుందనే ఆశావహ దృక్పథంతో ఉన్నాడు. మరోవైపు తనకు ఎమ్మెల్సీ కవిత ఈ పదవిపై హామీ ఇచ్చారనే వాదనను చింత మహేశ్ చెబుతూ వస్తున్నాడు.
రూరల్ నియోజవర్గం నుంచి తన పేరు కూడా పరిశీలించాలని, చాలా కాలంగా పదవి లేక పార్టీని, నాయకులనే నమ్ముకుని ఉన్నానని ఆవేదనను వ్యక్తం చేస్తున్నాడు. దీంతో ఈ పదవిపై చిక్కుముడి మరింత బిగుసుకుంటూ వస్తోంది. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఇదేం పంచాయతీ.. దీన్ని ఇంకొంత కాలం ఇలాగే పెండింగ్‌లో పెడితే సరి… అనే భావనా నాయకుల్లో ప్రస్పుటమవుతన్నట్టు తెలుస్తోంది.