జిల్లాకు ఇద్దరు పెద్దలు. ఒకరు మంత్రి ప్రశాంత్‌రెడ్డి, మరొకరు ఎమ్మెల్సీ కవిత. ఇది ఎన్నికల సమయం. మారో వారంలో కేసీఆర్‌ టికెట్లు అనౌన్స్‌ చేస్తారని ప్రచారం ఊపందుకున్న తరుణంలో జిల్లాలో పదవులు ఆశించి భంగపడి, అసంతృప్తితో ఉన్న నేతలపై వీరిద్దరూ దృష్టి కేంద్రీకరించారు. ఎన్నికల సమయానికి అసంతృప్తులకు పదవులు కట్టబెట్టి.. రెట్టించిన ఉత్సాహంతో పనిచేసేలా వ్యూహాలు రచిస్తున్నారు. దీని కోసం అధిష్టానం వద్ద జిల్లా రాజకీయ పరిస్థితులు ఎప్పటికప్పుడు తీసుకెళ్లి.. ఒక్కొక్కటిగా పదవుల పరిష్కారం చూపుతున్నారు. గవర్నర్‌ కోటాలో ఎమ్మెల్సీ పదవులు ఆశించిన ఇద్దరికీ ఆ పదవులు దక్కలేదు.

చివరి నిమిషంలో కేసీఆర్‌ ఆలోచనలతో రాజకీయ ఈక్వేషన్స్‌ మారిపోయి.. జిల్లాకు ఎమ్మెల్సీ పదవులు దక్కలేదు. దీంతో తనకు రెన్యూవల్‌ చేస్తారని భావించిన రాజేశ్వర్‌తో పాటు.. ఈసారి తప్పక తనకు ఎమ్మెల్సీ ఇస్తారని గట్టిగా నమ్మకంతో ఉన్న డాక్టర్‌ మధుశేఖర్‌కు ఆశాభంగం తప్పలేదు. వీరి పరిస్థితి అర్థం చేసుకున్న మంత్రి, కవితలు కేసీఆర్‌ వద్ద పదవుల ప్రస్తావన తీసుకువచ్చారు. చాలా కాలంగా పార్టీ కోసం కమిట్‌మెంట్‌తో పనిచేస్తున్న చాలా మంది నాయకులకు పదవులు ఇవ్వలేదని, ఇప్పుడు ఎమ్మెల్సీలలో క కూడా అవకాశం లేకపోవడంతో జిల్లాకు గతంలో ఉన్న ఎమ్మెల్సీ స్థానాలు కోల్పోయే పరిస్థితి ఎదురైందనే విషయాన్ని చెప్పడంతో.. ఓ రెండు పదవులను కేసీఆర్‌ వీరికి ప్రకటించారు. క్రిష్టియన్‌ మైనార్టీ కార్పొరేషన్‌కు డీ రాజేశ్వర్‌ రావును నియమిస్తూ ఉత్తర్వులు జారీ అయిన విషయం తెలసిందే.

ఇక డాక్టర్‌ మధుశేఖర్‌కు తన వృత్తికి అనుసంధానంగా ఉండి సరైన న్యాయం చేసేలా వైద్యారోగ్య శాఖలో కీలకమైన విభాగం.. ఇండియన్ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ హెల్త్‌ అండ్‌ ఫ్యామిలీ వెల్పేర్‌ చైర్మన్‌గా ఆయన్ను నియమించేందుకు నిర్ణయించారు. నేడో రేపో ఉత్తర్వులు జారీ కానున్నాయి. ఆర్మూర్‌ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్‌రెడ్డి కూడా మధుశేఖర్‌కు ఏదో ఒక పదవి ఇప్పించాలని ప్రయత్నం చేశారు. అధిష్టానం వద్ద తన వాయిస్‌ కూడా వినిపిస్తూ వచ్చాడు. ఎమ్మెల్సీ పదవులు రాకున్నా..అంతకు మించిన మంచి పదవులు దక్కాయనే సంతృప్తిని వారికి దక్కేలా వీరిద్దరు అధిష్టానంతో ఒప్పించి మెప్పించి వారికి పదవులు ఇప్పించారు. వీరికే కాదు ఇంకా జిల్లాలో ఉద్యమకాలం నుంచి చాలా మందే పదవుల కోసం ఎదురుచూస్తూ ఉన్నారు. ఎన్నకల సమయంలో అధికార పార్టీలో పదవుల అసంతృప్తి రాగం వినపించకుండా అంతదరినీ మెప్పించేందుకు ఏదో ఒక పదవిని కట్టబెట్టేందుకు నియోజకవర్గాల వారీగా అందరి జాబితాను సేకరించి అధిష్టానం దృష్టికి తీసుకువచ్చేందుకు వీరిద్దరూ కృషి చేస్తున్నారు.

టికెట్లు ప్రకటించిన తర్వాత రాజకీయ వేడి మరింత వేడెక్కుతుంది. పదవులు ఇచ్చే విషయంలో తాత్సారం ఏర్పడుతుంది. దీంతో ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా ఖాళీ పదవుల్లో ఆశావహులకు అవకాశం దక్కేలా చర్యలు తీసుకునేందుకు ప్రయత్నాలు వేగిరం చేస్తున్నారు మంత్రి ప్రశాంత్‌రెడ్డి, ఎమ్మెల్సీ కవితలు. రానున్న ఎన్నికల్లో మళ్లీ అన్ని నియోజకవర్గాల్లో బ్రహ్మాండమైన మెజారిటీతో అధికార పార్టీ అభ్యర్థులే గెలిపే లక్ష్యంగా ముందుకు సాగుతున్న వీరి వ్యూహాలు, ఎత్తుగడలలో నాయకులకు పదవులు ఇప్పించుకునే ప్రయత్నాలు అదే స్థాయిలో స్పీడందుకున్నట్టు తెలుస్తోంది.

You missed