కులవృత్తులకు బీసీ లోన్లు లక్ష రూపాయల చొప్పున ఇస్తామని తెలంగాణ దశాబ్ది ఉత్సవాల్లో దరఖాస్తులు తీసుకున్నారు. బీసీలు ఎగబడి మరీ మీసేవా సెంటర్ల చుట్టూ తిరిగి వేల రూపాయలు ఖర్చు పెట్టి కుల, ఆధాయ ధ్రువీకరణ పత్రాల కోసం పోరాటమే చేశారు. ఎట్టకేలకు దరఖాస్తు చేసుకున్నారు. కానీ నిజామాబాద్‌లో ఇంత వరకు ఈ బీసీ లోన్ల గురించి ఊసే లేదు. కామారెడ్డిలో ఎమ్మెల్యే గంప గోవర్దన్ చెక్కుల పంపిణీ చేశాడు. ఆదివారం బాన్సువాడలో స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి చెక్కులు పంపిణీ చేయనున్నారు.
కానీ నిజామాబాద్‌లో మాత్రం ఎప్పుడు బీసీ లోన్లు ఇస్తారో తెలియక బీసీల్లో తీవ్ర అయోమయం, అసంతృప్తి నెలకొన్నది. ఇచ్చేది లక్ష.. దానికి సవాలక్ష ఆంక్షలు, నిబంధలు పెట్టారు. అయినా దరఖాస్తు చేసుకుని, ఎంక్వైరీలో ఎలిజిబిలిటీ సాధించినం.. ఇంకా ఆలస్యం ఎందుకు..? అని అసహనం వ్యక్తం చేస్తున్నారు. నిధులు లేకే లేటు అవుతుందని అధికారులు చెబుతున్నారు. ఒక్కో నియోజకవర్గానికి మూడు వందల మందిని ఎంపిక చేశారు. వీరికి లక్ష చొప్పున ఇచ్చేందుకు నిజామాబాద్‌లో మాత్రమే నిధులు లేకపోవడం చర్చనీయాంశమవుతోంది. పంద్రాగస్టు తర్వాత పంపిణీ ఉండవచ్చని మాటమాత్రంగా బీసీ వెల్పేర్ అధికారుల సమాధానమిచ్చి పరిస్థితి దాట వేస్తున్నారు. బీసీల ఆగ్రహాన్ని చవి చూస్తున్నారు.