వైద్యరంగంలో ఎవరికి వారే సాటి. కష్టపడి ఉన్నత చదవులు చదవి పైకొచ్చినవారే అంతా. ఇటు వైద్యవృత్తిలో రాణిస్తూ .. అటు సేవారంగంపై దృష్టి సారించినవారెందరో. కానీ కొందరు స్వచ్చంధ సంస్థలకు పరిమితమై సేవలు చేస్తే.. మరికొంత మంది రాజకీయంగా ఎదగాలని కోరుకుంటారు. అయితే ఎమ్మెల్యే, లేదా ఏదైనా పదవిలోఉంటే మరింత సేవ చేయవచ్చనే ధ్యాస, ఉద్దేశ్యంతో రాజకీయంగా ఆరంగేట్రం చేసిన వారెందరో. కానీ ఒక్కసారి వారి రాజకీయ లైఫ్‌ పరిశీలిస్తే చూస్తే ఎవరిదీ ఆశాజనకంగా కనిపించదు. అన్నీ గాయాలే. ఎదురుచూపులే. పట్టింపులేని తనాలే. పట్టించుకోని అధిష్టానాలే.

ఆపరేషన్లు చేయడంలో నిష్టాతులు వారు. వృత్తిపరంగా మంచి డాక్టర్ అని పేరు తెచ్చుకున్నవారే. కానీ రాజకీయంగా మాత్రం ఎటూ ఎదగలేక.. ఇంకా ఏవైనా అవకాశాలు రాకపోతాయా అనే ఎదురుచూపుల్లోనే ఉన్నారు. ఆశ చావదు. నిరాశ వీడదు. అందుకే ఐసీయూలోనే మన రాజకీయ వైద్యలున్నారనే మాట ఇక్కడ ప్రస్తావనర్హం. నిజామాబాద్‌ జిల్లాలో పరిస్థితి చూస్తే… ముఖ్యంగా నలుగురు వైద్యులు రాజకీయంగా తమ భవిష్యత్తును పరీక్షించుకుందామని వచ్చి.. ప్రజల నాడి తెలియక.. అధిష్టానం ఆలోచనలకు రీచ్‌ కాక అలా ఆస్పత్రిబెడ్ మీదే ఉండిపోయారు. ఇందులో అంతో ఇంతో కొంత నయమని చెప్పాల్సింది డాక్టర్‌ భూపతిరెడ్డే.

ఎందుకంటే కనీసం అధిష్టానం అతనికి ఎమ్మెల్సీ అయినా ఇచ్చింది. ఇదీ ఆయన నిలబెట్టుకోలేకపోయాడు. తర్వాత రూరల్‌ బరిలో ఎమ్మెల్యేగా కాంగ్రెస్‌ అవకాశం ఇచ్చినా గెలవలేదు. మరోసారి కాంగ్రెస్‌ నుంచి టికెట్‌ ఆశిస్తున్నా.. ఇప్పుడు పోటీ పెరిగింది. జనాల్లో ఉన్నవారికి, సర్వే రిపోర్టులో బెటర్‌ అని తేలిన వారికే అధిష్టానం టికెట్లు ఇచ్చేలా ఉంది. ఆ కోణంలో మన డాక్టర్ సాబ్‌ బహుదూరంలో ఉన్నాడనే చెప్పాలి. ఇక ఆర్మూర్ నుంచి మధుశేఖర్‌ చేయని ప్రయత్నం లేదు. ఆఖరిని మొన్నటి గవర్నర్‌ కోటా ఎమ్మెల్సీ దాకా ఎదురుచూసి నిరాశపడ్డాడు.

ఇప్పుడు పొలిటికల్‌గా ఏమి చేయాలో తెలియక ఆలోచనలో పడ్డాడు. ఏమి చేయాలన్నా అప్పటి పరిస్థితులు ఇప్పుడు లేవు. రాజకీయాలంతా కాస్ట్లీ అయిపోయాయి మరి. డాక్టర్‌ శివప్రసాద్‌ పీఆర్‌పీ నుంచి తన రాజకీయ ఆరంగేట్రాన్ని ప్రారంభించినా అదృష్టం వరించలేదు. బీఆరెస్‌లో చేరినా నుడా డైరెక్టర్‌తో సరిపెట్టారు. కాంగ్రెస్‌ నుంచి అర్బన్‌ టికెట్ ఆశించినా వారు పెద్దగా పట్టించుకోలేదు. దీంతో మళ్లీ తన ఆస్పత్రికే పరిమితమయ్యాడు. గిరిజన వైద్యుడు, కాంగ్రెస్‌ వీరాభిమాని డాక్టర్‌ మోతీలాల్‌ పరిస్థితి కూడా అంతే. ఇప్పటికీ నిజామాబాద్‌ రూరల్‌, బాన్సువాడ నుంచి టికెట్‌ ఆశిస్తున్నాడు.కానీ అధిష్టానం ఇస్తుందా..? ఇతని అభ్యర్థిత్వాన్ని పట్టించుకుంటుందా..? అంతా సీన్‌ కనబడటం లేదు. డాక్టర్లుగా రోగుల నాడి పట్టి.. వారికి మెరుగైన చికిత్సలు అందించి సక్సస్‌ డాక్టర్లుగా ముద్రపడిన వీరంతా రాజకీయంగా మాత్రం ఐసీయూలో చికిత్సలు పొందుతున్నట్టే ఉంది ప్రస్తుత పరిస్థితి..

 

 

 

You missed