ఇవాళ..రేపు… తప్పక ఏదో పదవి వస్తుందిలే. నమ్ముకున్న నాయకులు ఏదో ఒకటి చేయకపోతారా..? ఉద్యమం నుంచి ఉన్నాం కదా..? తప్పక పదవులు వస్తాయి.. అని ఓపిగ్గా ఎదురుచూస్తూ వస్తున్న బీఆరెస్‌ సీనియర్‌ లీడర్లు ఇప్పుడు నిరాశ, నిస్పృహలకు లోనవుతున్నారు. ఎన్నికల సమయం ముంచుకొస్తున్నది. ఇప్పుడు కాకపోతే మరెప్పుడూ అనే భావం బలంగా పెరుగుతున్న క్రమంలో … ఎన్నికలకు రోజులు దగ్గర పడుతున్నాయే కానీ మాకు పదవుల ఊసే లేదు.. అని తమకు తాము ఓ నిర్దారణకు వస్తూనే.. మరి పొలిటికల్‌ భవిష్యత్ ఏంటీ..? అని క్వశ్చన్‌ మార్క్‌ ఫేసులతో దీనంగా చూస్తున్నారు. జిల్లాకు పెద్ద దిక్కుగా ఉన్న ఎమ్మెల్సీ కవితను నమ్ముకున్నారు. స్థానిక ఎమ్మెల్యేను అడిగి ఒప్పించుకున్నారు.

జిల్లా మంత్రి ప్రశాంత్‌రెడ్డికీ తమ నేపథ్యం.. పదవులు లేక ఆత్మగౌరవం లేదు అనే మనోవేదననూ వెళ్లగక్కుకున్నారు. కానీ ఏవీ ఫలించలేదు. ఎదురు చూపులే మిగిలాయి. నిరాశే ఎదురవుతూ వస్తోంది. నైరాశ్యమే అలుముకుంటున్నది. భవిష్యత్ అగమ్యగోచరంగా తోస్తున్నది. అధికార పార్టీలో ఇప్పుడు సీనియర్ల పరిస్థితి ఇలాగే ఉంది. మార్కెట్‌ కమిటీ చైర్మన్‌, గ్రంథాలయ చైర్మన్‌, నుడా.. ఇలా పదవులు తమకు వస్తాయని భావించారు. కానీ వీటిల్లో దీంట్లోనూ తమకు అవకాశం రాకపోవడంతో.. ఇక ఎన్నికల వరకు రాదు అనే భావనకు వచ్చేశారు. దీంతో మరింత నైరాశ్యంలోకి వెళ్లిపోయారు. సుజిత్‌ సింగ్‌ ఠాకూర్‌ మొన్నటి వరకు గ్రంథాలయ చైర్మన్ కోసం ఎదురుచూస్తూ వచ్చాడు. ఎంఎంబీ రాజేశ్వర్‌ పదవీకాలం ముగియగానే తనకివ్వాల్సిందిగా కోరుతూ వచ్చాడు.

కానీ మళ్లీ ఆయనకే రెన్యూవల్ చేసే సరికి ఇక ఆశలు చాలించుకున్నాడు. మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ కోసం అందరితో పాటు చింత మహేశ్ అందరి చుట్టూ ప్రదక్షిణలు చేశాడు. కానీ నుడా పదవికి దీనికి ముడి పెట్టడంతో అది ఎటు తెమలక.. చాలా కాలంగా ఏఎంసీ చైర్మన్ పదవీ అలాగే ఉండిపోయింది. ఎవరికీ ఇవ్వక అది అనాథలా ఉండిపోయింది. గవర్నర్‌ కోటా ఎమ్మెల్సీ కోటాలో తప్పనిసరిగా తనకు వస్తుందని డాక్టర్ మధుశేఖర్‌ గంపెడాశలు పెట్టుకున్నాడు. కవిత హామీ ఇవ్వడం, మంత్రితో సఖ్యతగా ఉండి ఎప్పటికప్పుడు తన అభీష్టాన్ని అధిష్టానానికి చేరవేస్తున్నాననే నమ్మకంతో ఉన్నాడు. అదీ జిల్లాకు కేటాయించలేదు. దీంతో ఆయన కూడా పొలిటికల్‌గా ఏదైనా నిర్ణయం తీసుకునే సమయం ఆసన్నమైందనే భావనలో ఉన్నట్టు తెలుస్తోంది. ఎమ్మెల్సీ కవిత ఈ మధ్య యాక్టివ్‌ అయ్యారు.

జిల్లాలోని ఐదు నియోజకవర్గాలలో మళ్లీ తమ అభ్యర్థులనే గెలిపించుకోవాలనే లక్ష్యంతో పోస్టుమార్టం చేయడం షురూ చేశారు. ఈ క్రమంలో సీనియర్లను, ఉద్యమకారులను ఆమె మళ్లీ చేరదీస్తున్నారు. ఆప్యాయంగా పలకరిస్తున్నారు. కానీ పదవులు లేకపోవడంతో నాయకుల మాటలు నమ్మే పరిస్థితిలో లేనట్టుగా మారిపోయింది పరిస్థితి. ఈ క్లిష్ట సమయంలో సీనియర్లలో పదవుల అసంతృప్త రాగం పార్టీకి మంచిది కాదనే భావన శ్రేయోభిలాషులు భావిస్తున్నారు.

 

ఆర్మూర్‌ బీసీ లీడర్‌ మానస గణేశ్‌ పదవి కోసం ఆశించి భంగపడ్డాడు. నాయకులపై నమ్మకం లేక రాజకీయంగానే పూర్తిగా తెరమరుగైపోయాడు.

You missed