అసలే ఇప్పుడు బీజేపీ పరిస్థితి అంతంత మాత్రంగా ఉంది. మూలిగే నక్క మీద తాటికాయపడ్డట్టు నిజామాబాద్ ఎంపీ అర్వింద్ చేస్తున్న చర్యలు, తీసుకుంటున్న నిర్ణయాలు, దుందుడుకు చర్యలు ఆ పార్టీని జిల్లాలో నిలువునా ముంచుతున్నాయి. ఒకప్పుడు బీజేపీ మేమే బీఆరెస్‌కు ప్రత్యామ్నాయం అని విర్రవీగి కాలర్ ఎగిరేసిన పరిస్థితులను నుంచి పాతాళంలోకి పడిపోయే దుస్థితికి చేరుకున్నది. ఇదంతా ఆపార్టీ స్వయంకృతాపరాధం.. పార్టీ స్టామినా ఏమిటో నిరూపించే పరిస్థితులే ఇందుకు కారణం. కర్ణాటక ఎన్నికల ఫలితాల తర్వాత కాంగ్రెస్ కొంత జోరందుకున్నది. ఇక దీనికి తోడు బీజేపీ గ్రాఫ్ పడిపోతూ వస్తున్నది.
ఇది చాలదంటూ రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు బండి సంజయ్‌ను మార్చడంతో చాలా మంది ఇందూరు జిల్లా బీజేపీ నేతలు అప్పటి వరకు అర్వింద్ ఆగడాలు భరించి కూడా ఓపిగ్గా ఉన్నా ఈ పరిణామం తర్వాత ఆశలు చాలించుకున్నారు. ఇక ఈ పార్టీలో మనుగడలేదు… పార్టీ బట్టకట్టే పరిస్థితీ లేదు అని అనుకుంటున్న సమయంలో .. అర్వింద్ సీనియర్లకు చెక్ పెట్టడం మరింత పెంచాడు. తాజాగా ఆర్మూర్, బాల్కొండ, బోధన్ నియోజకవర్గాల్లో మొత్తం 13 మంది మండలాధ్యక్షులను కొత్తగా, తనకు అనుకూలంగా ఉన్నవారిని.. ఒకరకంగా బీజేపీలో స్వపక్షంలో కొంత చెప్పినట్టుగా డమ్మీలను నియమించాడు అర్వింద్. బోధన్‌లో కాంగ్రెస్ అభ్యర్థిగా నిలబడే మాజీ మంత్రి సుదర్శన్‌రెడ్డి గెలుపునకు అనుకూలంగా ఉండేందుకే ఈ నిర్ణయం తీసుకున్నారని కొందరు ఘాటుగా అర్వంద్‌పై ఆరోపణాస్త్రాలు సంధించారు.
మిగిలిన చోట్ల కూడా కాంగ్రెస్ అభ్యర్థుల గెలపునకు ఇతోధికంగా ఉపయోగపడే విధంగా లోపాయికారి ఒప్పందంలో భాగంగానే ఇదంతా చేస్తున్నాడని, పదిహేను, ఇరవై ఏండ్ల నుంచి పార్టీని నమ్ముకున్న సీనియర్లను పక్కన పెట్టడం వెనుక ఇదే ఉద్దేశ్యముందని వారు ఆరోపిస్తున్నారు. ఈ మేరకు బుధవారం రాష్ట్ర పార్టీ కార్యాలయంలో ఈ మూడు నియోజకవర్గాలకు చెందిన బీజేపీ నాయకులు ఆందోళనకు దిగారు. అర్వింద్ డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు. దీంతో విషయం రచ్చకెక్కింది. బండి సంజయ్ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నప్పుడు అర్వింద్ నిర్ణయాలు సాగలేదు. దీంతో చాలా మంది అర్వింద్ మీద గుర్రుగా ఉన్నవారంతా బండి పంచన చేశారు. బండి సంజయ్ కూడా వారిని పార్టీ మారొద్దని, టికెట్లు ఇప్పించే విషయంలో, పదవులు ఇచ్చే విషయంలో తాను జోక్యం చేసుకుంటానని, చొరవ తీసుకుంటానని వారిని దగ్గరకు తీశాడు.దీంతో అర్వింద్ కోపం నశాళానికి అంటింది.
అధిష్టానానికి ఫిర్యాదులు చేశాడు. జిల్లాలో పార్టీని బతికించాలంటే తను చెప్పిన విధంగా నడవాల్సిందేనని, ఎవరూ దీంట్లో జోక్యం చేసుకున్నా ఆ తర్వాత ఓటమి పరిణామాలకు తనది బాధ్యత కాదంటూ బ్లాక్‌మెయిల్‌కు దిగాడు. దీంతో అధిష్టానం చివరకు బండిని పక్కన పెట్టేసింది. కిషన్ రెడ్డి జిల్లా రాజకీయాల్లో జోక్యం చేసుకునే పరిస్థితి లేదు. దీంతో అర్వింద్ మళ్లీ తన ఇండివిజల్ ఎజెండాను బయటకు తీశాడు. అసమ్మతి నేతలంటూ సీనియర్లకు చెక్ పెట్టాడు. ఇది కాంగ్రెస్ కలిసి రాగా.. బీజేపీని తన గోతిని తానే తవ్వుకున్నట్టవుతోంది.