ఇందూరులో సాఫ్ట్‌వేర్ ఉద్యోగాలు.. ఐటీహబ్‌లో కొలువుల భర్తీ..
జాబ్‌మేళా నిర్వహిస్తున్న ఎమ్మెల్సీ కవిత…
ఈ నెల 21న టాస్క్ ఆధ్వర్యంలో మెగాజాబ్‌మేళాకు ఏర్పాట్లు..
డిగ్రీ, ఇంజినీరింగ్ చదివిన యువతీయువకుల గొప్ప అవకాశం…
ఎక్కడికక్కడ ప్రచారం చేసుకుంటున్న ఎమ్మెల్యేలు….
లోకల్ అభ్యర్థులకు ప్రాధాన్యం…
సాఫ్ట్‌వేర్ ఉద్యోగమంటే ఓ పరపతి. ఓ కల. ఎక్కడికోవెళ్లి చేయాలి. అందరినీ వదిలి వెళ్లాలి. జీతం బాగానే ఉంటుంది. జీవితం బాగుపడుతుంది. కానీ మహానగరాల్లో జీవనం అలవాటు చేసుకోవాలి. లైఫ్‌స్టైల్ మారుతుంది. కాస్ట్లీ లైఫ్‌స్టైల్ అలవడుతుంది. కానీ ఉన్న ఊళ్లోనే ఆ కల నెరవేరితే. అంతే వేతనంతో ఎక్కడికో వెళ్లకుండా మన లోకల్‌గానే జాబ్ సదుపాయం లభిస్తే.. ఇప్పుడు ఇందూరు దీనికి కేంద్ర బిందువైంది. ఇక్కడా ఐటీ జాబ్‌లు రానున్నాయి.
మహానగరాలకే పరిమితమైన సాఫ్ట్‌వేర్ జాబ్‌లు రెండో శ్రేణి నగరాల జాబితాలోకి వచ్చే నిజామాబాద్‌లో కూడా ప్రభుత్వం విస్తరించింది. అందులో భాగంగానే నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని దుబ్బ ప్రాంతంలో ఐటీ హబ్ ఏర్సాటు చేసింది. దీని నిర్మాణం పూర్తయింది. త్వరలో ఇది ప్రారంభం కానుంది. అంతకు మునుపే ఇందులో ఉద్యోగ అవకాశం లోకల్ యువతకు కల్పించేందుకు ఎమ్మెల్సీ కవిత చొరవ తీసుకున్నారు.
పది కంపెనీలతో టైఅప్ చేసుకుని లోకల్ యువతీ యువకులకు డిగ్రీ, ఇంజినీరింగ్ పాసైన వారి కోసం మెగాజాబ్‌మేళాను ఏర్పాటు చేస్తున్నారు. ఈనెల 21న తెలంగాణ అకాడమీ ఫర్ స్కిల్ అండ్ నాలెడ్డ్ (టాస్క్) ఆధ్వర్యంలో బోర్గాం(పీ)లోని భూమారెడ్డి కన్వెన్షన్ హాల్‌లో ఈ మెగా జాబ్‌మేళాను నిర్వహిస్తున్నారు. దీనికి సంబంధించిన అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. లోకల్‌గా ఎక్కడికక్కడ ఎమ్మెల్యేలు దీనిపై విస్తృత ప్రచారం చేస్తున్నారు. ఇంజినీరింగ్, డిగ్రీ, పీజీ ( 2020, 2021,2022, 2023)చేసిన అభ్యర్థులు అర్హులుగా పేర్కొన్నారు. నాలుగు రెస్యూమ్ కాపీలను, నాలుగు పాస్‌పోర్టు సైజ్ ఫోటోలు ఏదైనా ప్రభుత్వ గుర్తింపు కార్డును తీసుకురావాల్సిందిగా కోరుతున్నారు.