ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసిన బీజేపీకి చెంపపెట్టులాంటి ఫలితం… ఇకపై అంతటా ఇవే రిజల్ట్స్ రిపీట్…
– కర్ణాటక ఎన్నికల ఫలితాలపై ఆర్టీసీ చైర్మన్, నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్దన్ ..
కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూలదోసి.. ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసి గద్దెనెక్కిన బీజేపీకి అక్కడి ఓటర్లు చెంపపెట్టులాంటి తీర్పును వెలువరించారని, ఇకపై ఇవే ఫలితాలు అంతటా రిపీట్ అవుతాయని, బీజేపీ అప్రజాస్వామిక, నియంతృత్వ, మతతత్వ విధానాలను ప్రజలు తిప్పికొట్టి ఆపార్టీకి ఘోరి కడతారని టీఎస్ ఆర్టీసీ చైర్మన్, నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్దన్ అన్నారు. కర్ణాటక ఎన్నికల ఫలితాలపై ఆయన తన అభిప్రాయాన్ని ఓ ప్రకటనలో వెలిబుచ్చారు.
మతతత్వాన్ని రెచ్చగొట్టి, ప్రజలను మాయమాటలతో లోబర్చుకుని, భ్రమల్లో ముంచాలనే ఆ పార్టీ క్షుద్రవిద్యలను ప్రజలు తిప్పికొడతున్నారని, బీజేపీ నాయకుల నాటకాలు ఇకపై సాగబోవని ఆయన స్పష్టం చేశారు. కర్ణాటక మాదిరిగానే ఇతర రాష్ట్రాల్లో కూడా అప్రజాస్వామికంగా బీజేపీ ప్రభుత్వాలను ఏర్పాటు చేసుకున్నదని, అక్కడ కూడా త్వరలో ఇవే ఫలితాలు రాబోతాయని, కుక్క కాటుకు చెప్పుదెబ్బలా ఓటర్లు మంచి గుణపాఠం చెప్పబోతున్నారని ఆయన అన్నారు. దేశ వ్యాప్తంగా కూడా బీజేపీ పని ఖతమైపోతున్నదని, కర్ణాటకలో ఫలితాన్ని ముందుగా అంతా ఊహించిందేనన్నారు. ప్రజాస్వామ్యయుతంగా ప్రజలతో ఎన్నుకోబడిన ప్రభుత్వాలను కూల్చిన చరిత్ర బీజేపీదని, ప్రజల నుంచి వీరికి గుణపాఠం తప్పదని బాజిరెడ్డి హెచ్చరించారు.
బీజేపీ ఎమ్మెల్యేలు పూర్తిగా లంచగొండ్లుగా తయారయి ప్రజలను పీడించారని, అందుకే అన్ని చోట్ల ఆ పార్టీ ప్రజాప్రతినిధులపై తీవ్ర వ్యతిరేకత వచ్చిందన్నారు. బీజేపీ స్వయంగా గెలిచిన రాష్ట్రాల్లో కూడా ఓటమిపాలు కాకతప్పదని, ఈ పార్టీతో, వీరి పాలనతో ప్రజలకు ఒరిగిందేమీ లేదని ప్రజలు గమనించారన్నారు. కెరళా ఫైల్స్, కశ్మీర్ ఫైల్స్ అంటూ ప్రజలను రెచ్చగొట్టి పబ్బం గడుపుకోవడం తప్ప.. బీజేపీతో ప్రజలకు నయాపైసా లాభం లేదని, అంతా నష్టమేనన్నారు. ఆ కష్టనష్టాలను, అప్రజాస్వామిక పాలనను కళ్లారా చూసిన ప్రజలు కర్రుకాల్చి వాత పెట్టేందుకు రెడీగా ఉన్నారని, కర్ణాటక ఫలితాలే దీనికి నిదర్శనం, నాంది అని బాజిరెడ్డి గోవర్దన్ స్పష్టం చేశారు.