రైస్‌ మిల్లర్ల ముసుగులో బీజేపీ నేత రాజకీయం..

రాజకీయం కోసం రైతుబలి..

మోహన్‌రెడ్డి తెరవెనుక పెద్దరికం… తడిచిన ధాన్యం కొనబోమని వెల్లడి….

ప్రభుత్వాన్ని బద్నాం చేయాలని, బీజేపీకి మైలేజీ రావాలని…

కామారెడ్డి ఎమ్మెల్యే చెంపదెబ్బపై మంచి స్పందన.. శాస్తి జరగాల్సిందేనంటున్న రైతాంగం…

వాస్తవం ప్రతినిధి- నిజామాబాద్‌:

అతను రైస్‌మిలర్లకు ప్రతినిధి. అంతకు మించి బీజేపీ లీడర్‌. బోధన్‌ నుంచి బీజేపీ టికెట్ ఆశిస్తున్న నేత. టీఆరెస్‌లో పదవి ఆశించి భంగపడ్డాడు. ఎమ్మెల్సీ కవిత ఏదైనా ఒక పదవి ఇస్తుందని ఆశ పెట్టుకున్నాడు. ఏళ్లు గడుస్తున్నా పట్టింపులేదు. పదవీ లేదు. దీంతో బీజేపీతో మిలాఖత్ అయ్యాడు. ఎప్పటి నుంచో ఊరిస్తున్న బోధన్‌ ఎమ్మెల్యే కోసం బీజేపీ అర్వింద్‌ పంచన చేరాడు. తనకు టికెట్ ఇస్తే గెలుస్తానని నమ్మబలికాడు. ఏవో రాజకీయాలు చేసుకుంటున్నాడు.

ఇవన్నీ నాణేనికి ఓ వైపు. రైస్‌మిల్లర్లకు రాష్ట్ర నాయకుడు కావడం.. జిల్లాలో ప్యాడీ ఎక్కువ రావడం.. ఇక్కడే ధాన్యం ఎక్కువగా తడవడంతో మోహన్‌రెడ్డిలో రాజకీయ నాయకుడు మేల్కొన్నాడు. ప్రభుత్వాన్ని, రైతులను ఇరకాటంలో పెట్టే ఎత్తు వేశారు. తడిచిన ధాన్యం కొంటే మేం నష్టపోతామని మిల్లర్లతో తెరవెనుక ఉండి చెప్పించాడు. కడుపు మండిన కామారెడ్డి ఎమ్మెల్యే రైస్‌ మిల్లర్‌ సిబ్బందిపై నిన్న చేయిచేసుకోవడం పట్ల రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. కష్టించి పండించిన ధాన్యం తడిచి.. ఎలాగోలా దాన్ని నిద్రాకలి మాని కాపాడుకుంటే ఈ తిరకాసేంటని మండిపడుతున్నారు రైతులు.

నిజామాబాద్‌ కలెక్టర్‌కు ఏకంగా మేము తడిచిన ధాన్యం తీసుకోబోమని లేఖ రాయడం పట్ల రైతాంగం సర్వత్రా మిల్లర్ల తీరుపై తీవ్ర ఆగ్రహంతో ఉంది. కానీ దీని వెనుక బీజేపీ రాజకీయం దాగుంది. మోహన్‌రెడ్డి తన రాజకీయ అనుభవాన్నంతా ఉపయోగించి ఎలాగైనా దీన్ని మరింత రాజకీయం చేసి ప్రభుత్వాన్ని రైతుల దగ్గర బద్నాం చేయడం, బీజేపీకి మైలేజీ పెంచడమే లక్ష్యంగా ఇదంతా చేస్తున్నాడనే ఆరోపణలున్నాయి. పైగా సర్కారే పట్టించుకోవడం లేదు. కేంద్రంతో ఈగోకు పోతున్నది. ఓ లేఖ కూడా రాయలేదు. మమ్మల్నెందుకు ఇబ్బంది పెడుతున్నారు. రంగు మారిన ధాన్యం కొంటే మేం నష్టపోతాం .. అని చెప్పిస్తున్నాడు మిల్లర్లతో. కానీ రైతుల ఆగ్రహం ముందు ఈ రాజకీయాలు ఎక్కువ కాలం నిలబోవని, అవి తమకే చేటు చేస్తాయనే నిజం కూడా నిన్న గంప గోవర్దన్‌ చెంపదెబ్బతో తెలిసి వచ్చింది. నేలకు దిగి వచ్చారు. చర్చలు జరుపుదామంటున్నారు.

You missed