ఇస్తారా..? పోవాలా…??

గవర్నర్‌ కోటా ఎమ్మెల్సీపై మధుశేఖర్‌ ఒత్తిడి

మంత్రి వేముల మీదే గురి.. ఎమ్మెల్సీ రాకపోతే తనదారి తను చూసుకునేందుకు రెడీ..

బీఎస్పీ నుంచి ఆర్మూర్‌ బరి నుంచి పోటీకి రెడీ..?

వాస్తవం- ఆర్మూర్‌ ప్రతినిధి:

గవర్నర్‌ కోటా ఎమ్మెల్సీ కోసం డాక్టర్‌ మధుశేఖర్ ఒత్తిడి పెంచాడు. మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డిపై గంపెడాశలు పెట్టుకున్నాడు. గతంలో ఆయనను పార్టీకిలో తీసుకునేటప్పుడు ఇచ్చిన హామీని ఇప్పటికీ గుర్తు చేస్తూనే ఉంటాడాయన. ప్రతిసారీ తనకు ఏదో ఒక పదవి రాకపోతుందా..? అని ఎదురుచూడటం.. ఆ పదవులు తన దరికి చేరకుండా చేజారిపోతూ ..కళ్ల ముందే కాలం కరిగిపోతూ ఉండటం పరిపాటిగా మారింది.

మానస గణేశ్‌ కూడా తనకు ఏదైనా పదవి దక్కుతుందని చాలా ప్రయత్నాలు చేసి చేసి విసిగిపోయి ఇప్పుడు పార్టీకే దూరంగా ఉంటున్నాడు. ఆర్మూర్‌ ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి, మంత్రి వేముల ప్రశాంత్‌ రెడ్డితో మొరపెట్టుకుని ఇక తిరిగింది చాలు.. ఖర్చు పెట్టుకుని చేతి చమురు వదిలించుకున్నది చాలు అని పార్టీకి దూరం దూరం ఉంటున్నాడు. మొన్న ఆత్మీయ సమ్మేళనానికి జీవన్‌రెడ్డి బలవంతం మీద రప్పించుకున్నా.. గణేశ్‌ అన్యమనస్కంగానే వచ్చి వెళ్లిపోయాడు. మధుశేఖర్‌ మాత్రం ఆశలు వదులుకోలేదు. మంత్రితో మంచి సంబంధాలు నెరుపుతూ వస్తున్నాడు. జీవన్‌ మీద ఆయనకు ఆశలు లేవు. తన అవసరానికి హామీలిచ్చి గద్దెనెక్కిన తర్వాత ఎందరినో పక్కన పెట్టేసిన చరిత్ర జీవన్‌కు ఉందనేది మధుశేఖర్‌ అనుభవం ద్వారా తెలుసుకున్నాడు.

అందుకే సీఎంతో సాన్నిహిత్యం ఉన్న మంత్రితో తిరుగుతూ తనకు ఎలాగైనా ఈసారి ఎమ్మెల్సీ చాన్స్‌ మిస్ చేయొద్దని ప్రత్యక్షంగా, పరోక్షంగా చెబతూ వస్తున్నాడు. హైదరాబాద్‌లో జరిగే ప్రతి అధికారిక కార్యక్రమానికీ హాజరవుతున్నాడు. ఈనెలాఖరుతో రాజేశ్వర్‌ పదవీకాలం ముగియడంతో అది తనకే దక్కాలనేది మధుశేఖర్‌ గట్టిగా కోరకుంటున్నాడు. ఇక ఇది మిస్‌ అయితే ఎన్నికల దాకా పట్టించుకునే నాథుడుండడు. మళ్లీ సిట్టింగులకు తను ప్రచారం చేసి వాళ్ల గెలుపులో ఓ కీలుబొమ్మగా మారాల్సిందే కానీ..తనకు ఈ పార్టీతో,నాయకులతో వచ్చిందేమీ లేదనే అభిప్రాయంతో ఉన్నాడు. దీంతో అబీనహీతో కబీ నహీ అని నిర్ణయించుకున్నాడు.

మంత్రిపై ఒత్తిడి పెంచుతున్నాడు. శతవిధాలా ప్రయత్నం చేస్తున్నాడు. ఒకవేళ ఈ ఎంపికను అధినేత పెండింగ్‌లో పెట్టినా… తనకు ఇవ్వకున్నా.. ఇక పార్టీకి గుడ్‌బై చెప్పి తనదారి తాను చూసుకోవాలని ఫిక్స్ అయిపోయాడు. ఆర్మూర్‌ బరి నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేయాలని డిసైడ్ అయినట్టు ప్రచారం జరుగుతోంది. గతంలో కూడా ఇక్కడ నుంచి పోటీ చేసి ఓడిన విషయం తెలిసిందే. బీఎస్పీ నుంచి తనకు రూట్‌ క్లియర్‌ ఉన్నందున అధికార పార్టీపైనే గురిపెట్టి తాడోపేడో తేల్చుకునేందుకూ రెడీ అవుతున్నట్టు తెలుస్తోంది.

 

You missed