మా పార్టీ లేదంటావా..? నీ అంతు చూస్తా…!
ప్రజల్లో బీజేపీ ఉనికే లేదని రిపోర్ట్ ఇచ్చినందుకు ఓ టీవీ జర్నలిస్టును బెదిరించిన నేత
బెదిరింపులకూ వెనుకాడని కమలనాథులు.. వాస్తవాలు చెబితే సహించని తత్వం..
తాజాగా వెలుగులోకి రూరల్ బీజేపీ నేత జర్నలిస్టును బెదిరించిన పర్వం…
వాస్తవం- నిజామాబాద్ రూరల్:
అతను ఓ జర్నలిస్టు. ఓ ప్రముఖ ఛానెల్‌కు రిపోర్టర్. రోజు వారీ విధుల్లో భాగంగా ఆ రోజూ ఓ న్యూస్ కవర్ చేశాడు. నిజామాబాద్ రూరల్ నియోజకవర్గంలో ఏ పార్టీ పరిస్థితి ఎలా ఉంది..? ఏది గెలుస్తుంది..? ఏది ఓడుతుంది..? మూడో స్థానంలో ఏదుంది..? లాంటి అంశాలను ప్రజల నుంచి సేకరించి ఓ సమగ్ర రిపోర్టును తన ఛానల్‌కు ఓ వార్తగా ప్రజెంట్ చేశాడు. అది టెలికాస్ట్ అయ్యింది. ఆ వార్త చూసిన రూరల్ బీజేపీ నేత ఆ జర్నలిస్టుపై విరుచుకుపడ్డాడు.
పై నుంచి పెద్దలు ఆ నేతను బాగానే అర్సుకున్నారట. ఏం చేస్తున్నావయా..? అక్కడ మన పార్టీయే లేదంట కదా. ఏమో చేసేస్తున్నా.. ఏదో జరిగిపోతుందంటూ మా దగ్గర పెద్ద పెద్ద మాటలు నర్కుడేనా..? ప్రజల్లో పార్టీ ఉనికే లేదని .. ఆ టీవీలో స్టోరీ వచ్చింది చూశావా..? ఎక్కడున్నావ్…? ఏం చేస్తున్నావ్..? అంటూ అక్షింతలు గట్టిగానే వేశారట. అసలే ఆ నేతది దుందుడుకు స్వభావం. అంతా నాకే తెలుసుననే మితిమీరిన అహంకారం. పైగా పై నుంచి పెద్దల బాగా తలంటి వదిలేశారు. దీంతో రెచ్చిపోయిన ఆ నేత .. ఆ జర్నలిస్టుకు ఫోన్ చేసి ఎడాపెడా అర్సుకున్నాడట. ఆ స్టోరీ ఎందుకు చేశావ్..? ఎవరు చెప్పారు..? నువ్వు చూశావా..? వస్తావా చూపిస్తా.. అంటూ ఏవేవో కారుకూతలు కూశాడట. బెదిరింపులకూ దిగాడు.
అప్పటికీ ఓపిగ్గానే ఆ జర్నలిస్టు సమాధానమిచ్చాడు. అది ప్రజల టాక్. నా సొంత కహానీ కాదని. అయినా సదరు ఆ యువనేత వినలేదట. ఎవరు చెప్పారు..? ఏ ప్రజలు… ? చూపిస్తావా..? అంటూ కయ్యానికి కాలు దువ్వుతూనే ఉన్నాడట. అయినా ఆ జర్నలిస్టు మౌనాన్నే ఆశ్రయించాడు. ఇక మరింత రెచ్చిపోయాడు కమలనాథుడు. ఏం తిక్కతిక్కగా ఉందా..? ఇష్టమొచ్చినట్టు మీరు వార్తలు రాసేసుకుంటే .. ఎవరు అడగరనుకుంటున్నావా..? మీమెంత కష్టపడుతున్నామో తెలుసా..? స్టోరీలు ఇచ్చే ముందు జర జాగ్రత్తగా ఉండి ఇవ్వు… అనే రేంజ్‌కు వెళ్లిపోయాడట. ఇక అప్పటిదాకా ఓపిక పట్టిన ఆ జర్నలిస్టుకు తిక్కరేగింది. ఏం చేస్తావ్..? అని ఎదురు తిరిగాడు ఫోన్‌లోనే. ఏం చేస్తనో చూస్తావా..? ఏమాత్రం తగ్గలేదు రూరల్ బీజేపీ యువనేత. బెదిరింపులకు దిగాడు. మాతో పెట్టుకోకు ఏమైనా చేయగలం అని అర్థం వచ్చేలా నోరు పారేసుకున్నాడు. బీపీ పెంచేసుకున్నాడు. ఎదురుగా ఉంటే ఏం చేస్తాడో తెలియదన్నట్టుగా ఊగిపోతున్నాడు. ఏం చేస్కుంటావో చేస్కోపో..! అని ఆ జర్నలిస్టు ఫోన్ పెట్టేశాడు. ఇదీ సంగతి.
వాస్తవాలు చెబితే.. ఆ పార్టీకి నెగిటివ్ వార్తలు రాస్తే బీజేపీ నేతలు ఇలా రంగంలోకి దిగిపోతున్నారన్నమాట. మీడియాకు ఉన్నదున్నట్టు రాసే స్వేచ్చ ఎవడిచ్చాడు..? అనే రేంజ్‌లో బెదిరింపులకు కూడా వెనకాడటం లేదు. ఈ మధ్య బీజేపీ నేతలు ఇలా రచ్చకెక్కి నానా యాగీ చేస్తున్నారు. వీధులకెక్కుతున్నారు. వివాదాలు రేపుతున్నారు. బెదిరింపులకు దిగుతున్నారు. ప్రజల ముందు మరింత పలుచనవుతున్నారు.