వీరు మారరంతే…

డీసీసీ అధ్యక్షుడు అందుబాటులో లేడు..

ప్రియాంక గాంధీ మీటింగుపై తలోదారి.. ఎవరికి వారే ప్రెస్‌మీట్లు…

నిజామాబాద్‌- వాస్తవం ప్రతినిధి:

కాంగ్రెస్‌ పార్టీ నానాటికి పాతాళానికి పోతున్నా.. ఆ నేతల్లో మాత్రం మార్పు రావడం లేదు. ఓ వైపు బీజేపీ తామే బీఆరెస్‌కు ప్రత్యామ్నాయం అంటూ చంకలెగరేస్తూ గాలిలో మేడలు కడుతున్న తరుణంలో మేల్కొని ప్రజాక్షేత్రంలో దూసుకుపోవాల్సిన కాంగ్రెస్‌ నానాటికి తీసికట్టుగా మారుతోంది. ఇందూరు జిల్లాలో ఈ పార్టీ అనాథగా మారింది. ఎవరికి వారే అన్నట్టుగా తయారయ్యింది. గ్రూపులుగా విడిపోయి రాజకీయాలు చేయడంతో అరకొరగా మిగిలి ఉన్న క్యాడర్లో కూడా నిరుత్సాహం వచ్చేస్తున్నది. ఈనెల 8న కాంగ్రెస్‌ పార్టీ అగ్ర నాయకురాలు ప్రియాంక గాంధీ రానుంది. భారీ సభకు ఏర్పాటుచేశారు. యూత్‌ డిక్లేరేషన్‌ సభగా దీన్ని ఏర్పాటు చేస్తున్నారు. మొన్న వరంగల్‌లో రైతు డిక్లరేషన్‌ మంచి స్పందనను తెచ్చి పెట్టింది. అదే విధంగా యూత్‌ను అట్రాక్ట్‌ చేసేందుకు ప్రియాంక గాంధీని పిలిపించి ఈ సభను ఏర్పాటు చేయిస్తున్నారు.

అయితే డీసీసీ అధ్యక్షుడు కెరళ టూర్‌లో ఉన్నాడు. దీంతో కాంగ్రెస్‌ సిటీ ప్రెసిడెంట్‌ కేశవేణు ఇవాళ ప్రెస్‌మీట్‌ పెట్టి తానే ఇన్చార్జినని ఈ మీటింగుకు పబ్లిక్‌ గ్యాదరింగ్‌ అంతా తానే చూసుకుంటున్నానని చెప్పుకొచ్చాడు. ఆ మీటింగు అయిందో లేదో… పీసీసీ వైస్‌ ప్రెసిడెంట్, మాజీ జిల్లా అధ్యక్షుడు తాహెర్‌ బిన్‌ తన టీమ్‌తో మరో ప్రసె్‌మీట్‌ పెట్టి అదే మీటింగు గురించి వల్లెవేశాడు. దీంతో క్యాడరే కాదు.. మీడియా అవాక్కయ్యింది. మీరు మారరంతే అనుకుంటున్నారంతా. కెరళా టూర్‌లో ఉన్న మానాల మోహన్‌రెడ్డి మాత్రం సిటీ ప్రెసిడెంటే ఇన్చార్జిగా ఉండటం కామన్‌ కదా అని క్లారిఫికేషన్‌ ఇచ్చి గ్రూపుల విషయం తనకు తెలియదన్నట్టు తప్పుకున్నాడు. ఇదీ సంగతి. మీమింతే. మారమంతే. అన్నట్టుగానే తయారయ్యింది కాంగ్రెస్‌ పరిస్థితి. ఇది జిల్లాలోనే కాదు.. అంతటా ఇట్లనే ఉంది నేతల తీరు.

You missed