పాపం.. సూరన్న
జలగల్లా డబ్బుల కోసం పీడీస్తున్న సొంత పార్టీ కార్పొరేటర్లు..
కాబోయే ఎమ్మెల్యేవు నీవే అంటూనే ధన్‌పాల్ నుంచి పైసా వసూల్..
వెంట తిరగాలన్నా.. రేపు ఎన్నికల్లో బీజేపీ బలం పెరగాలన్నా వారిని అర్సుకోవాల్సిందేనట..
మింగలేక.. కక్కలేక.. సూర్య నారాయణ పరేషాన్..
వాస్తవం ప్రతినిధి: నిజామాబాద్
అర్బన్ బీజేపీలో ఇపుడు కొత్త వింత ఒకటి చోటు చేసుకున్నది. మొన్నటి మున్సిపల్ ఎన్నికల్లో కాస్తో కూస్తో బలం పెరిగడంతో ఇక అర్బన్ సీటు తమకేననే ధీమాలో కమలనాథులు పగటి కలలు కంటూ ఉన్నారు. ఈ క్రమంలో ఎప్పటి నుంచో ఈ సీటుపై ఆశలు పెట్టుకున్న ధన్‌పాల్ సూర్య నారాయణ ఈ సారి కచ్చితంగా బీజేపీ పార్టీ గుర్తు పై పోటీ చేసి గెలవాలనే కృత నిశ్చయంతో ఉన్నాడు. దీని కోసం ఎంపీ అర్వింద్‌ను ప్రసన్నం చేసుకున్నాడు. ఇక తనకు తిరుగులేదు టికెట్ ఖాయమని ప్రచారమూ చేసుకుంటున్నాడు. బీజేపీ నుంచి ఇతరులెవరూ తనకు పోటీ లేకుండా చూసుకుంటున్నాడు.
అర్వింద్ తనకు అండగా ఉంటే చాలు టికెట్ ఖాయం.. గెలుపు ఖాయమనే ధీమాలో తిరుగుతున్నాడు. ఇక ఆయన రెట్టించిన ఉత్సాహంతో పనిచేస్తున్నాడు. ఎవరు చందాలకొచ్చినా ఇచ్చి పంపుడే. గణపతి విగ్రహాలకు, దేవీమాత విగ్రహాలకు, పూజలకు అన్నింటికీ నేనున్నానంటూ విరాళంగా విరాళాలిస్తూనే ఉన్నాడు. ఎక్కడ ఏ పూజ జరిగినా సూరన్న గుర్తుకు రావాల్సిందే. అంతలా ప్రాచుర్యంలోకి వచ్చాడు. అంతా బాగానే ఉంది కానీ.. సొంత పార్టీలోనే ఆయన ఓ వింత విచిత్రమైన ఒత్తిడి ఎదుర్కుంటున్నాడు. బీజేపీ కార్పొరేటర్లు ఆయన్ను జలగళ్లా పీడిస్తున్నారట. ఎందుకో తెలుసా..? పైసల కోసం. అదేందీ.. ఆయన పైసలిచ్చడేందీ..? అనుకుంటున్నారా..? మేము మీ వెంట తిరగాలన్నా రానున్న ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలిపించడం కోసం మాకు డబ్బులు కావ్సాలిందేనని.. మొన్నామధ్య లక్షలు వసూలు చేయగా.. ఈ మధ్యే మనిషికో రెండు లక్షలు గుంజారట. ఏమనాలో తెలియక పాపం సూరన్న అడిగిన మొత్తాన్ని ఇచ్చేస్తున్నాడట. కాబోయే ఎమ్మెల్యేనవుతాననే ధీమాతో. నమ్మకంతో. ఆశతో.
మధ్యలో కొందరు బీజేపీ కార్పొరేటర్లు బీఆరెస్ గూటికి చేరారు. అప్పుడు కూడా అర్వింద్ ఆదేశాల మేరకు మిగిలి పోయిన కార్పొరేటర్లను కట్టడి చేసేందుకు కార్పొరేటర్ కింత అని చేతి చమురు వదిలించుకున్నాడు. పార్టీ వీడకండ్రా బాబు.. మీకు నేను డబ్బులిస్తానంటూ లక్షలు సమర్పించుకున్నాడు. అదే అలవాటుగా మారింది వారికి. ఇగో ఇలా సమయం వచ్చినప్పుడల్లా కప్పం వసూలు చేసినట్టు పైసా వసూల్ చేస్తున్నారు. ఇలా డబ్బులు తీసుకున్నట్టు బయట ఎవరికీ చెప్పొద్దని ఒట్లు కూడా వేసుకున్నారట. కానీ ఒట్టు తీసి గట్టు మీద పెట్టి వారే ప్రచారమూ చేసుకుంటున్నారు. టికెట్ వస్తుందో మొన్నటి మాదిరిగానే చివరి నిమిషంలో చేతిస్తారో తెలియదు కానీ.. సూరన్న చేతి చమురు మాత్రం బాగా వదిలిస్తున్నారు సొంత పార్టీ నేతలు. పాపం.. సూరన్న…!