తెలంగాణ సీఎం కేసీఆర్ దేశ ప్రధాని అవుతారని, తెలంగాణ మోడల్‌ను అమలు చేస్తారని ఆర్టీసీ చైర్మన్, నిజామామాద్ రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్దన్ అన్నారు. మంగళవారం భూమారెడ్డి ఫంక్షన్ హాల్‌లో నిజామాబాద్ రూరల్ నియోజకవర్గ బీఆరెస్ పార్టీ ప్లీనరీ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి జిల్లా ఇన్‌చార్జి, శాసన మండలి డిప్యూటీ చైర్మన్ బండా ప్రకాశ్ ముదిరాజ్ హాజరయ్యారు. ప్లీనరీ సమావేశానికి బాజిరెడ్డి గోవర్దన్, పార్టీ ప్రధాన కార్యదర్శి, మాజీ ఎమ్మెల్సీ వీజీ గౌడ్, జిల్లా ఒలంపిక్ సంఘం ఉపాధ్యక్షుడు, ధర్పల్లి జడ్పీటీసీ బాజిరెడ్డి జగన్‌లు ఎడ్లబండిపై తరలి రావడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. అనంతరం ప్లీనరీ వేదిక దగ్గర పార్టీ జెండాను గోవర్దన్ ఆవిష్కరించారు.
ఈ సందర్బంగా మాట్లాడుతూ.. ఒకప్పుడు గుజరాత్‌ను రోల్ మోడల్ అంటూ చెప్పేవారని, అక్కడ తాగేందుకు, సాగు చేసుకునేందుకు నీరు లేదని, రెండు వందలే పింఛన్ ఇస్తున్నారన్నారు. తెలంగాణలో అమలయ్యే పథకాలేవి అక్కడ లేవని, కేసీఆర్ ఇక్కడి పథకాలను దేశ వ్యాప్తం చేయాలనే బీఆరెస్ పార్టీని ఏర్పాటు చేశారన్నారు. మహారాష్ట్రలో పార్టీని విస్తరిస్తున్నారని, ఇప్పటి వరకు అక్కడ పెట్టిన సభలన్నీ సక్సెసయ్యాయన్నారు. కేసీఆర్ ప్రధాని కావడం పక్కా అని, దేశ వ్యాప్తంగా తెలంగాణ మోడల్ అమలు సాధ్యమని ధీమా వ్యక్తం చేశారు. విభజన హామీలను తుంగలో తొక్కిన కేంద్రం.. ప్రశ్నించిన వారిని సీబీఐ, ఈడీలదో దాడులు చేయిస్తున్నదన్నారు. అవి వారి జేబు సంస్థలుగా మారాయన్నారు.
ఒక్కో ఎమ్మెల్యేకు 50 కోట్లు వెచ్చించి కొనుగోలు చేస్తున్నదని, 9 రాష్ట్రాల్లో ఇదే విధంగా చేస్తూ వచ్చిందని, ఇంత సొమ్ము ఎక్కడిదని, ఇదంతా అవినీతి కాదా ..? అని ప్రశ్నించారు. వైట్ మనీ అదానికిచ్చి, బ్లాక్‌మనీతో ఎమ్మెల్యేలను కొంటు ప్రభుత్వాలను కూలదోస్తున్నదని ధ్వజమెత్తారు. చేవెళ్లలో ముస్లిం రిజర్వేషన్లు ఎత్తేస్తామంటూ అమిత్ షా మాట్లాడారని, అసలు మీవి రిజర్వేషన్లు అమలు చేసే ముఖాలేనా..? అని ఆయన ఎద్దేవా చేశారు. ఉన్న ప్రభుత్వ రంగ సంస్థలన్నీ అమ్మేస్తే ఇక ఉద్యోగాలు, రిజర్వేషన్లు ఎక్కడివని, మీ మాటలు ఎవరూ నమ్మరని అన్నారు. అలవిగాని హామీలిచ్చి గద్దెనెక్కాలని చూస్తున్న బీజేపీని తరిమి తరిమి కొట్టాలని పిలుపునిచ్చారు. రాబోవు రోజుల్లో రూరల్ నియోజకవర్గంలో 1100 మందికి దళితబంధు, ౩వేల మందికి ఇంటి నిర్మాణాల కోసం మూడు లక్షల ఆర్థిక సాయాన్ని అందిస్తామన్నారు.
డీఎస్, అర్వింద్ ఇద్దరూ తమ ఎంపీ నిధుల నుంచి జిల్లాకు ఒక్క రూపాయి కూడా కేటాయించలేదని, దేశంలో అందరికీ మెడికల్ కాలేజీలిచ్చి తెలంగాణకు మాత్రం ఇవ్వలేదని, నవోదయ స్కూళ్లు కూడా రాలేదని, ఇవి అడగేందుకు చేతగాని ఎంపీలు.. పార్టీ పెద్దల చెప్పులు మోస్తున్నారని విమర్శించారు. మోటర్లకు మీటర్లు పెడితే ౩౦వేల కోట్ల రుణాలిస్తామంటూ కేంద్రం హామీలిచ్చినా కేసీఆర్ కాదన్నారని, రైతుల సంక్షేమమే తనకు ముఖ్యమని ఉచిత కరెంటునిస్తున్నారని గుర్తు చేశారు.
పసుపుబోర్డును వెంటనే ఏర్పాటు చేయాలి
తను గెలవగానే ఐదు రోజులకే పసుపుబోర్డు తెస్తానని నమ్మబలికి ఎంపీగా గెలిచిన అర్వింద్ ప్రజలను మోసం చేశాడని బాజిరెడ్డి విమర్శించారు. వెంటనే పసుపు రైతులకు ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని, పసుపు బోర్డు ఏర్పాటు చేయాలని ఆయన కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ తీర్మానం పెట్టారు. సెక్రటేరియట్ భవనం వద్ద 125 అడుగుల ఎత్తున్న బాబా సాహెబ్ అంబేద్కర్ విగ్రహాన్ని పెట్టడం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ మద్దతుగా తీర్మానం ప్రవేశపెట్టారు. కొత్తగా నిర్మించిన పార్లమెంటు భవనానికి కూడా అంబేద్కర్ పేరు పెట్టాలని కేంద్రాన్ని డిమాండ్ చేస్తూ తీర్మానం ప్రవేశపెట్టారు. ఈ తీర్మానాలను కరతాళధ్వనులతో ప్రజాప్రతినిధులు బలపర్చారు. మొత్తం 12 తీర్మానాలను ప్రవేశపెట్టి ఆమోదించారు.
ఈ కార్యక్రమంలో జడ్పీ చైర్మన్ దాదాన్నగారి విఠల్ రావు, డీసీఎంఎస్ చైర్మన్ సాంబారు మోహన్, ఎంపీపీలు, జడ్పీటీసీలు, సర్పంచులు, రైతు సమన్వయ సమితి బాధ్యులు, సీరియర్ బీఆరెస్ లీడర్లు తదితర ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.