ఢిల్లీ లిక్కర్ స్కాం పేరుతో ఎమ్మెల్సీ కవితపై బీజేపీ కేంద్ర ప్రభుత్వం బేకార్, బోగస్ కేసు పెట్టిందని ఆర్టీసీ చైర్మన్, నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్దన్ అన్నారు. ఈ కేసు పేరుతో ఆమెను మానసికంగా వేధించారన్నారు. రోజు పొద్దున్నే పిలిచి, సాయంత్రం వరకు కూర్చుబెట్టుకుని పంపించారని, ఆడబిడ్డలకు బీజేపీ ఇచ్చే మర్యాద, గౌరవం ఇదేనా..? అని ఆయన మండిపడ్డారు. నిజామాబాద్ రూరల్ నియోజవకర్గ పరిధిలోని ఇందల్వాయి మండల బీఆరెస్ కార్యకర్తల ఆత్మీయ సమ్మేళనం సిర్నాపల్లిలో జరిగింది. ఈ సమావేశంలో బాజిరెడ్డి మాట్లాడారు. ఒక్కో ఎమ్మెల్యేకు 50 కోట్లు పెట్టి కొనుగోలు చేసేందుకు కుట్రలు పన్నిన బీజేపీ నేతలు.. తమ పార్టీ పాలిత రాష్ట్రాల్లో వేల కోట్ల అవినీతి జరిగినా పట్టించకోదన్నారు. తెలంగాణలో అమలయ్యే ఏ ఒక్క పథకం దేశంలో బీజేపీ పాలిస్తున్న ఇతర రాష్ట్రాల్లో అమలు కావడం లేదని, మోడీపై ప్రజలు సర్వత్రా విరక్తి, వ్యతిరేకత పెంచుకుని ఉన్నారన్నారు. అందుకే కేసీఆర్.. టీఆరెస్‌ను బీఆరెస్‌గా ఏర్పాటు చేశారన్నారు. దేశ వ్యాప్తంగా తెలంగాణ పాలనను అందించాలని కేసీఆర్ లక్ష్యంగా పెట్టుకుని ముందుకు పోతున్నారని, ఆయనకు మనమంతా సంఘీభావంగా ఉండాలని, మద్దతు తెలిపాలని అన్నారు. తెలంగాణ బిడ్డ రేపు ప్రధాని అయితే .. మన రాష్ట్రానికి, దేశానికి కూడా ఎంతో మేలు కదా.. అని కేసీఆర్ ప్రధాని అవుతారని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.
ఆర్టీసీ బాగుపడ్డది… ఉద్యోగులు సంతోషంగా ఉన్నార్రా.. పొట్టోడా..
తను ఆర్టీసీ చైర్మన్ అయిన తర్వాత సంస్థలో చాలా మార్పులు వచ్చాయని, కానీ తనపై పొట్టోడు ఏదేదో వాగిపోయాడని పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిపై బాజిరెడ్డి మండిపడ్డారు. కొత్త బస్సుల కొనుగోలు, కొత్త ఉద్యోగాల కల్పన, కొత్త బస్ డిపోల నిర్మాణలు చేపట్టామని, కావాలంటే ఉద్యోగులు ఎలా ఉన్నారో అడిగి తెలుసుకో అని రేవంత్‌కు హితవు పలికారు. ఓటుకు నోటు కేసులో చిప్పకూడు తిని వచ్చిన రేవంత్‌కు తెలుసు ఆ కూడు ఎలా ఉంటుందో..? తన చిప్పకూడు తిని అందరితో అదే వాగుతున్నాడని ఎద్దేవా చేశారు. మరొకడు తను వందల కోట్లు సంపాదించానని ఆరోపిస్తున్నాడని, ఆ కోట్లలో నాకు ౩౦ శాతం ఇచ్చి మిగిలింది మొత్తం వారే తీసుకోవాలని ఛాలెంజ్ విసిరారు. ఎంపీ అర్వింద్, అతని తండ్రి డీఎస్‌కు వచ్చే ఎంపీ లాడ్ నిధులు 45 కోట్లు కమీషన్‌కు అమ్ముకున్నారని అన్నారు. మరి ఎవరికి ఖర్చు పెట్టారో చెప్పాలన్నారు. పుట్టుక నుంచి చావు వరకు ప్రజలకు చేడోదు వాదోడుగా ఉంటూ వారిని ఆదుకునే సంక్షేమ పథకాలను సీఎం కేసీఆర్ ప్రవేశ పెట్టారని, గడప గడపకు పథకాలు అందుతున్నాయన్నారు బాజిరెడ్డి. ఇప్పటి వరకు ప్రభుత్వం 2, 30, 000 ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేశామన్నారు. ఇందులో 95 శాతం స్థానికులకే అవకాశం వచ్చేలా జీవో కూడా విడుదల చేశారన్నారు.