కాంగ్రెస్ పార్టీలో డీఎస్, సంజయ్‌ల చేరిక ఇందూరు కాంగ్రెస్‌లో కలకలం రేపింది. వస్తామంటే వద్దన్న నేతలను కాదని, రేవంత్ ఈ నిర్ణయం తీసుకోవడం పట్ల కినుక వహించారు ఇక్కడి నేతలు. కనీసం వారికి సమాచారం లేదు. పిలుపు లేదు. ఈ రోజు సైలెంట్‌గా హడావుడి లేకుండా వీరిద్దరు ఠాక్రే, రేవంత్‌ల సమక్షంలో కాంగ్రెస్‌లో చేరారు. మాజీ మంత్రి షబ్బీర్ అలీ మాత్రమే హాజరయ్యాడు. మాజీ మంత్రి సుదర్శన్‌రెడ్డి వీరి రాకను ఆహ్వానించినా జాయింగ్‌కు మాత్రం హాజరు కాలేదు.
ఇప్పుడిదొక చర్చ. అందులో పొద్దున తాను కాంగ్రెస్‌లో చేరడం లేదంటూ లేఖ రాసిన… డీఎస్ చివరకు కొడుకుతో సహా గాంధీ భవన్‌లో ప్రత్యక్షమయ్యాడు. మహేశ్‌కుమార్ గౌడ్, మధుయాష్కీ, తాహెర్, జిల్లా అధ్యక్షుడు మానాల మోహన్‌రెడ్డిలకు వీరు పార్టీలోకి రావడం ఏ మాత్రం ఇష్టం లేదు. అంతా సముదాయిస్తున్నారు. కానీ ఇక్కడి నేతలు వినడం లేదు. వీరి చేరిక పార్టీ నష్టమేనంటున్నారు ఈ నేతలు. కాగా, సంజయ్‌ను అర్బన్ నుంచి బరిలోకి దింపాలని అనుకుంటున్నారని ప్రచారం జరుగుతోంది. అదెలా సాధ్యం .. నేను లేనా ? అని అంటున్నాడు మహేశ్ కుమార్ గౌడ్. కుల బలమొకటే చాలదంటున్నాడు. కులబలమే గెలిపిస్తుందని అనుకంటే డీఎస్ ఇన్ని సార్లు ఓడిపోయేవాడా..? అనే అంశాన్ని కూడా ఇప్పుడు తెరమీదకు తెస్తున్నారు.