తొలిసారి బీఆరెస్‌లో ముసలం రేగింది. మల్కాజిగిరి ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు నివాసంలో ఎమ్మెల్యేలు భేటీ అయ్యారు. మంత్రి మల్లారెడ్డిపై నిప్పులు చెరిగారు. ఇప్పటికే మల్లారెడ్డి పై ఐటీ దాడులు జరిగిన నేపథ్యంలో పార్టీ పరువు పోయిందనే అభిప్రాయంతో ఉన్న నేతలు… మల్లారెడ్డి ఏకపక్ష వైఖరితో మరింత విసిగి వేసారి పోయారు. దీంతో ఈ రోజు మైనంపల్లి నివాసంలో ఎమ్మెల్యేలు మాధవరం క్రిష్టారావు, వివేకానందగౌడ్‌, శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరికపూడి గాంధీ, ఉప్పల్‌ ఎమ్మెల్యే భేతి సుభాష్ రెడ్డి తదితరులు కలిసి రహస్యంగా మీటింగు పెట్టుకున్నారు. ఇది మీడియాకు లీక్‌ అయ్యింది. ఎట్టకేలకు మీడియా ముందుకు వచ్చిన మైనంపల్లి తనదైన శైలిలో సీఎం కేసీఆర్, కేటీఆర్‌పై అసంతృప్తిని వెళ్లగక్కారు. కేటీఆర్‌ను వారం రోజులుగా టైమ్‌ అడుగుతున్నారట. కలవడానికి. తమ సమస్యలు చెప్పుకోవడానికి. మంత్రి మల్లారెడ్డి వైఖరితో పార్టీకి జరుగుతున్న నష్టం గురించి. కానీ కేటీఆర్‌ సమయం ఇవ్వడం లేదట.

దీంతో ఈ రోజు సమావేశమయ్యారు. మంత్రి మల్లారెడ్డి కేటీఆర్‌ పేరు చెప్పుకుని ఇష్టారీతిన వ్యవహరిస్తున్నాడని, తనకు నచ్చినవారికి పదవులు ఇప్పించుకుంటున్నారని, నిజంగా పార్టీ కోసం కష్టపడ్డ క్యాడర్‌ను విస్మరిస్తున్నారని అన్నారు. కేవలం పథకాల వల్లే అధికారం రాదని, పార్టీని ప్రాణానికి సమానంగా చూసుకుంటున్న క్యాడర్‌ను ఎందుకు విస్మరిస్తున్నారని కేసీఆర్ ను, కేటీఆర్‌ను ఉద్దేశించి అన్నారు. ఓ వైపు బీఆరెస్‌తో ఢిల్లీలో ఇప్పుడిప్పుడే పాగా వేసి బిజీ అవుతున్న క్రమంలో కేసీఆర్‌కు ఈ అసమ్మతి రాగం కొత్త తలనొప్పిని తెచ్చిపెట్టింది. వాస్తవంగా కేటీఆర్‌ కూడా మల్లారెడ్డికి అమిత ప్రాధాన్యమిస్తూ వస్తున్నాడు. అతని వైఖరి కూడా పార్టీ శ్రేణులకు ఏ మాత్రం నచ్చదు. ఈ క్రమంలో ఒక్కసారిగా ఇన్నాళ్లూ అణిచిపెట్టుకున్న ఆగ్రహజ్వాలలు ఇలా బయటకు ఎగిసిపడ్డాయి. దీన్ని ఎలా చల్లారుస్తారో చూడాలి మరి.

You missed