ఎంపీగా గెలుస్తాన‌ని క‌ల‌లో కూడా అనుకోలేదు. గెలిచిండు. ఇక‌పై అంత త‌న ఇష్టారాజ్యం. త‌నుచెప్పిందే న‌డ‌వాలె. త‌న‌కు ఎదురుచెప్పే వాళ్లుండొద్దు. త‌న వ్య‌తిరేక‌వ‌ర్గాన్ని పాతాళంలోకి తొక్కాలి. పాత బీజేపీ కాదు.. ఇప్పుడు ఇందూరులో న‌డుస్తుంది అర్వింద్ బీజేపీ. ఈ తాకిడి, వైఖ‌రీ త‌ట్టుకోలేకే ఒక్కొక్క‌రూ బ‌య‌ట‌కు న‌డుచుకుంటున్నారు. టీఆరెస్ వైపు చూస్త‌న్నారు. తాజాగా ఎమ్మెల్సీ క‌విత ఫైర్ కావ‌డంతో అర్వింద్ పరిస్తితి అగ‌మ్య‌గోచ‌రంగా మారింది. కుల సంఘాల బాధ్యులూ దూర‌మ‌వుతూ వ‌స్తున్నారు. ఇప్ప‌టి వ‌ర‌కు ఆయా నియోజ‌క‌వ‌ర్గాల వారీగా టికెట్లు వ‌స్తాయ‌ని ఆశ‌లు పెట్టుకున్న‌వారి ప‌రిస్థితి అగ‌మ్య‌గోచ‌రంగా మారుతోంది. వారికి ఆశ‌లు లేవు. ఇప్ప‌టి వ‌ర‌కు ఎంతో ఖ‌ర్చు చేశారు. కానీ న‌మ్మ‌కమైతే లేదు.

ఆ లిస్టులో మొద‌ట చేరింది ఆర్మూర్ బీజేపీ నేత విన‌య్ రెడ్డి, ఇప్ప‌టి వ‌ర‌కు ఎంతో ఖ‌ర్చు చేశాడు. ఇక్క‌డి నుంచి త‌నే పోటీ చేద్దామ‌నే ఆలోచ‌న‌లో అర్వింద్ ఉన్నాడ‌నే ప్ర‌చారం ఉంది. అర్బ‌న్ నుంచి ధ‌న్‌పాల్ సూర్య నారాయ‌ణ‌ను ఎంక‌రేజ్ చేశాడు. విప‌రీతంగా ఖ‌ర్చైతే పెడుతున్నాడు. కానీ అర్వింద్ స‌తీమ‌ణిని అర్బ‌న్ ఎమ్మెల్యేగా పోటీలోకి దింపాల‌ని ఆలోచ‌న‌లో ఉన్నాడ‌నే ప్ర‌చారం జ‌రుగుతుంది. బాజిరెడ్డి జ‌గ‌న్ ఈ రోజు ఈవిష‌యంపై మాట్లాడారు. అత‌న్ని న‌మ్ముకున్న వారెవ్వ‌రికీ టికెట్లు రావ‌ని, వాడుకుని వ‌దిలేసే ర‌క‌మ‌ని ఘాటుగా విమ‌ర్శించాడు. రూర‌ల్‌లో దినేష్ క‌లాచారి ప‌రిస్థితీ అంతే. బాల్కొండ‌లో మ‌ల్లిఖార్జున్ తిరుగుతున్నాడు కానీ.. అత‌నికీ డౌట్‌గానే ఉంది. అక్క‌డ ముత్యాల సునీల్‌రెడ్డి త‌న‌కే కావాలంటే పావులు క‌దుపుతున్నాడు. బోధ‌న్‌లో మోహ‌న్‌రెడ్డి, మేడ‌పాటి ప్ర‌కాశ్‌రెడ్డి….. ఇద్ద‌రూ త‌మ‌కే త‌మ‌కే అనుకుంటున్నా.. వీరెవ్వ‌రికీ టికెట్ వ‌చ్చే ప‌రిస్థితి లేదు. యెండ‌ల ల‌క్ష్మీనారాయ‌ణ వ‌ర్గాన్ని మొత్తం దూరం చేసేశాడు అర్వింద్‌. దీంతో వారంతా అర్వింద్‌పై నిప్పులు చెరుగుతున్నారు. నివురు గ‌ప్పిన నిప్పులా ఉంది ప‌రిస్థితి. మోఖా చూసి అర్వింద్‌ను క‌ర్రు కాల్చి వాత పెట్టేందుకు రెడీగా ఉన్నారు.